న్యాయం దక్కేదెలా?

17 Aug, 2016 01:48 IST|Sakshi

ఏళ్లు గడిచినా అతీ గతీ లేకుండా న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉండి పోవడానికి కారణమేమిటో ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ను అభినం దించాలి. అంతకుముందు పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు అసలు మాట్లాడ లేదని కాదు గానీ... జస్టిస్ ఠాకూర్ ఆ పదవిలో కొచ్చాక  కేసులు పెండింగ్‌లో పడిపోవడం గురించీ, న్యాయమూర్తుల నియామకాలలో జాప్యం గురించీ తరచు పాలకుల దృష్టికి తీసుకొస్తున్నారు. తాజాగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో జడ్జీల నియామకం అంశాన్ని ప్రస్తావించకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. అందుకు ఖేదపడ్డారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్న సభలో ఆయన సమక్షంలోనే ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. సమస్యలెదురై తమ దగ్గరకొస్తే పరిశీలించి తప్పొప్పుల్ని నిర్ధారించి న్యాయం చెప్పగల వ్యవస్థ నుంచే ఇలాంటి వ్యాఖ్యలు వినవలసి రావడం పాలకు లకే కాదు... దేశ ప్రజలందరికీ ఇబ్బందికరమే. జస్టిస్ ఠాకూర్ ఇలా బహిరంగ వ్యాఖ్యానించడం ఆక్షేపణీయమని కొందరంటే... కేంద్ర న్యాయశాఖ మంత్రి దృష్టికి లేదా ప్రధాని దృష్టికి మరోసారి సమస్యను నేరుగా తీసుకెళ్లాల్సిందని మరికొందరు అభిప్రాయపడ్డారు.


అయిదు నెలలక్రితం ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్న జాతీయ సదస్సులో కూడా జస్టిస్ ఠాకూర్ జడ్జీల నియామకంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రస్తావించారు. ఆ సందర్భంలో ఆయన కంటతడి పెట్టారు కూడా. కోర్టుల్లో న్యాయమూర్తుల కొరత, దాన్ని సరిదిద్దడంలో జరుగుతున్న జాప్యంపై దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం గత శుక్రవారం విచారణకొచ్చినప్పుడు... తాము న్యాయపరంగా జోక్యం చేసుకునే స్థితి కల్పించ వద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాజ్యంపై ఏడాది కాలంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేసేలా చూస్తానని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ హామీ ఇవ్వాల్సివచ్చింది. నిజానికి దీన్ని కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య సాగుతున్న పంచాయతీగా చూడలేము. దీని పర్యవసానాలను అనుభవిస్తున్నది సాధారణ పౌరులు. న్యాయస్థానాల్లో కింది నుంచి పైవరకూ భారీయెత్తున కేసులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. వాటి సంఖ్య 3 కోట్ల వరకూ ఉంటుందని ఒక అంచనా. వీటిని తేల్చవలసిన న్యాయమూర్తుల సంఖ్య మాత్రం 7,675కు పరిమితమై ఉంది. మన దేశంలో పది లక్షలమందికి సగటున పదిమంది న్యాయ మూర్తులున్నారు. అమెరికాలో ఈ సంఖ్య 107! అమెరికాలో సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు ఏడాదికి సగటున 81 కేసులు పరిష్కరిస్తారు. మన దేశంలో ఈ సంఖ్య 2,600. న్యాయమూర్తులపై ఇంత భారం పడటం ఎలా చూసినా అవాంఛనీయం. స్వచ్ఛంద సంస్థ దక్ష్ ఈమధ్యే విడుదల చేసిన గణాంకాలను చూస్తే... మన న్యాయస్థానాల్లో అయిదేళ్లకు పైబడి పెండింగ్‌లో ఉన్న కేసులు 4 శాతమైతే, 5 నుంచి పదేళ్లలోపు పెండింగ్‌లో ఉన్నవి 12 శాతం, 10 ఏళ్ల పైబడి 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నవి 82 శాతం. నిజానికి తాము పూర్తి స్థాయిలో డేటా సేకరించ లేకపోయామని ఆ సంస్థ చెబుతున్నది. ఈ కేసులన్నిటా ప్రధాన కక్షిదారు కేంద్ర ప్రభుత్వమే అన్నది మరవకూడదు. కేసులు తెమల్చడంలో జరుగుతున్న విపరీత జాప్యం పర్యవసానంగా 31 శాతంమంది బెయిల్‌కు  వీలైన కేసుల్లో అరెస్టయిఉన్నా జైళ్లలో మగ్గుతున్నారు.


న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న కొలీ జియం వ్యవస్థ స్థానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)ని ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని నిరుడు అక్టోబర్‌లో కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించారు. న్యాయమూర్తులే న్యాయమూర్తుల్ని నియమించుకునే ఈ విధానంలో పారదర్శకత లోపించిందని ఇదే కేసులో మెజారిటీ తీర్పుతో విభేదించిన జస్టిస్ చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఏమైతేనేం కొలీజియం వ్యవస్థే ఇప్పుడు అమల్లో ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి వెలువడాల్సిన విధాన పత్రం(ఎంఓపీ) రాక పోవడం ప్రస్తుత సమస్య. ఫలితంగా కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి 75మంది పేర్లున్న జాబితా అనిశ్చితిలో పడింది. దేశంలోని 24 హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలు 478 ఉన్నాయని న్యాయ మూర్తుల నియామకాలపై సుప్రీంకోర్టులో పిల్ విచారణ కొనసాగిన రోజునే కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ఆ హైకోర్టుల్లో దాదాపు 39 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కూడా చెప్పింది. సమస్యపై ఇంత స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు పరిష్కారంలో జాప్యం మంచిది కాదు. అయితే మొత్తం సమస్యకు న్యాయమూర్తుల కొరత అన్నది ఒక పార్శ్వం మాత్రమే. అదే ఏకైక కారణమనడం కూడా సరిగాదు. కేసులకు సంబంధించిన యాజమాన్య నిర్వహణ సరిగా లేక పోవడం కూడా ఒక కారణమని దక్ష్ సంస్థ ఎత్తిచూపింది. జాతీయ స్థాయిలో ఉన్న కోర్టు మేనేజ్‌మెంట్ వ్యవస్థ సమకూర్చిన డేటాకూ, కోర్టు వెబ్‌సైట్లలో చూపుతున్న డేటాకూ పొంతన లేదని ఆ సంస్థ అంటున్నది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ చట్టాన్ని సవరించాక చెక్ బౌన్స్ కేసులు వెల్లువలా వచ్చిపడి నేర న్యాయవ్యవస్థ పని విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. న్యాయమూర్తులకూ, న్యాయ వాదులకూ మధ్య తలెత్తే వివాదాలు, ఎడతెగని వాయిదాలు, కేసుల దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం, కింది స్థాయి కోర్టుల్లో మౌలిక సదుపాయాల లేమి, నిరర్ధకమైన కేసులు వంటివి కూడా సమస్యను పెంచుతున్నాయి. పర్యవసానంగా న్యాయం లభించక సాధారణ పౌరులు విలవిల్లాడుతున్నారు. అందువల్ల సమస్య పరిష్కా రానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు న్యాయవ్యవస్థ సమష్టిగా కృషి చేసి దీనికొక ముగింపు పలకాలి.

మరిన్ని వార్తలు