ఈ విద్వేషాన్ని సహించగలమా?

30 Mar, 2016 01:03 IST|Sakshi
ఈ విద్వేషాన్ని సహించగలమా?

దేశాన్ని అస్థిరపర్చేందుకు అసహనం అనే ఒక వైరస్‌ను ప్రవేశపెట్టి హిందుత్వంపై ద్వేషంతో భారతదేశంపై దాడి చేస్తున్నారు. నక్సలైట్లపై కేసులు పెట్టే మనం తిన్నింటి వాసాలు లెక్కపెట్టే జాతి వ్యతిరేకులపై కేసులు పెట్టకూడదా?
 
 ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద ప్రసంగాలకు పెట్టింది పేరు. ఒక వ్యక్తినో, పార్టీనో, చివరకు వ్యవస్థనో విమర్శిస్తే, అలాంటి విమర్శ ద్వారా వివాదాన్ని సృష్టించి లబ్ధి పొందుదాం అనుకుంటే వేరు. ఆయన చేసే విమర్శ లకు ఆయా సంస్థలో, వ్యక్తులో సమాధానమిస్తారు. అక్కడితో అది సమసిపోతుంది. కానీ ఈసారి ఆయన హద్దు మీరారు. గొంతు మీద కత్తి పెట్టినా ‘భారత్ మాతా కీ జై’ అనేది లేదని ప్రకటించి ఒక పెద్ద వివాదానికి తెరతీశారు. ఏం చేసింది ఆ నినాదం? అందులో తప్పేముంది? స్వాతంత్య్ర సంగ్రామంలో అది కోట్లాదిమంది భారతీయులను ఏకం చేసిన నినాదం. స్వాతంత్య్రానంతరం ఈ దేశ పౌరుల ఐక మత్యాన్ని చాటుతున్న నినాదం. ‘తల్లి భారత దేశానికి జయం కలగాలి’ అన్నదే ఆ నినాదంలోని అంతరార్ధం. దేశానికి జయం కలగాలని కోరుకోవడమంటే దేశా భివృద్ధిని కాంక్షించడం. మన ఇల్లు, తల్లి బాగుండాలని కోరుకోవడం. అలా కోరుకోకపోవడమంటే బాహా టంగా దేశ వినాశనాన్ని, విచ్ఛిన్నాన్ని కోరుకోవడమే.
 
 భరతమాతకు ఎందుకు జై కొట్టాలి? భరత మాత విజయాన్ని ఎందుకు మనం కాంక్షించాలి? మన దేశంలో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు వాటిలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు, వందలాది భాషలు ఉన్నాయి. వీరందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుతున్నది కాబట్టి జై కొట్టాలి. ఆమె విజయం సాధించటం అంటే.. వీరంతా సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో వర్థిల్లటమే కాబట్టి. సర్వేజనా స్సుఖినో భవంతు అని.. అంతా బాగుండాలని కోరుకునే మంచి తల్లి కాబట్టి. ఎన్నో ముస్లిం దేశాల్లో పేదరికం తాండవ మాడుతోంది. రెండు వర్గాలై ఘర్షణలు పడుతుండటం వల్ల చాలాచోట్ల అరాచకం రాజ్యమేలుతోంది. ఉగ్ర వాదం విస్తరిస్తోంది. ఒకే భాష, ఒకే దేశం, ఒకే మతం అయినా  ఇలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులు అక్క డున్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని నింపుకుని, 125 కోట్ల మందిని ఒకేతాటిపైకి తెచ్చి ముందుకు నడిపిస్తున్న మాత భరతమాత. ప్రపంచ వినువీధుల్లో ప్రతి భారతీ యుడూ గర్వంగా ఎలుగెత్తి చాటగల నినాదం.  
 
 ఒవైసీ అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతానికో లేక పార్టీకో పరిమితమైతే జాతి వ్యతిరేకులపై ఏం చర ్యలు తీసుకోవాలో వాటిని ప్రభుత్వమే తీసుకుంటుంది. కానీ, ఒక వర్గానికి ప్రతినిధిగా ఆయన ఈ వైఖరిని ప్రచారం చేయాలనుకుంటే, దేశాన్ని అస్థిరపరచాలని చూస్తే మాత్రం భారతీయులు తిరగబడతారు. ఆయన ఆ ఒక్క మాట అని ఆగలేదు. పవిత్రమైన రాజ్యాంగాన్ని కూడా తన తప్పుడు ఆలోచనకు అడ్డం పెట్టుకున్నారు. రాజ్యాం గంలో చెప్పలేదు కాబట్టి భరతమాత వర్థిల్లాలని తాను నినదించనని ఆయన అన్నారు. అంటే, ఆయన చేస్తున్న దంతా రాజ్యాంగంలో పేర్కొన్నారా? ప్రసిద్ధ గేయ రచయిత జావేద్ అక్తర్ రాజ్యసభలో ప్రసంగించినట్లుగా.. కుర్తా, షేర్వాణీ వేసుకోమని, టోపీ పెట్టుకోమని ఒవైసీకి రాజ్యాంగంలో చెప్పారా? మరి ఆయన ఎందుకు అవి ధరిస్తున్నారు?
 
 మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఉండవచ్చు. వాటిని పరిష్కరించుకోవటానికి కుటుంబ సభ్యులు విభేదించు కోవచ్చు. ఒక్కోసారి గొడవ పడటం కూడా సాధార ణమే! కానీ, కుటుంబాన్నే కూల్చాలని చూసే జాతి వ్యతి రేకులు ఈ మధ్యకాలంలో తయారయ్యారు. హింసకు పాల్పడటాన్ని పక్కన పెడితే నక్సలైట్లు దేశభక్తులే అనిపిస్తుంది. ఎందుకంటే వారు రాజ్యం మీద ఎదురు తిరుగుతున్నారు తప్ప జాతి వ్యతిరేకులు కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నక్సలైట్లపై కేసులు పెడుతున్న మనం జాతి వ్యతిరేకులపై ఎందుకు పెట్టకూడదు? తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న వారు దేశద్రోహులు కాదా? దేశాన్ని అస్థిరపర్చేందుకు అసహనం పేరిట ఒక వైరస్‌ను ప్రవేశపెట్టారు. హిందుత్వంపై ద్వేషంతో భార తదేశంపై దాడి చేస్తున్నారు. జాతికి తూట్లు పొడవాలని చూస్తున్నారు. యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్య సించాల్సిన విద్యార్థులు నోటికొచ్చినట్లు మాట్లాడటమే ప్రజాస్వామ్యమా? వీరు చేసింది పక్కనపెట్టి వారిని హీరోలుగా తీర్చిదిద్దాలని చూస్తున్న వారు సెక్యుల రిస్టులు అవుతారా?
 
 రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో పోల్చారు. దేశ ంలో కొన్నివేల పాఠశాలలు స్థాపించి, లక్షలాది మంది పిల్లలకు విద్యను అందిస్తూ, దేశానికి డాక్టర్లు, ఇంజనీర్లను అందిస్తున్న సంస్థను.. దేశంలో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ జాతి ఐక్యతను కాపాడుతున్న సంస్థను.. మతం పేరుతో అరాచకం సృష్టిస్తూ మానవత్వమనేదే లేకుండా మానవ జాతిపై యుద్ధానికి దిగిన ఉగ్రవాద సంస్థతో పోల్చటం ఆయన పెద్దరికాన్ని దిగజారుస్తోంది. మెజార్టీ ఉంది కదా అని దేశాభివృద్ధికి పాటుపడే, ప్రజల సంక్షేమాన్ని చేపట్టే ముఖ్యమైన బిల్లులను అడ్డుకుంటూ.. ప్రభుత్వం పైన, ఆర్‌ఎస్‌ఎస్‌పైన అభాండాలు వేసి తప్పించుకో వాలని ఆయన చూస్తున్నారు. ఇలాంటివారిని ప్రజలు క్షమించరు.
 
అయినా, హిందుత్వం పట్ల వారికెందుకంత అక్కసు? హిందుత్వం అనేది ఒక మతం కాదు. అదొక సంస్కృతి. ప్రపంచమంతా కుటుంబం అనుకునే ఒక భావన. హిందూ సంప్రదాయాన్ని అనుసరించటమే తమ సమస్యలకు పరిష్కారమని పాశ్చాత్యులు భావి స్తున్న నేపథ్యంలో భారతీయులు మాత్రం వ్యతిరేకిం చటం విడ్డూరం. మన సంప్రదాయాన్ని, సంస్కృతిని కించపర్చాలని చూసే కుహనా మేధావులు సిగ్గు పడాలి. తలదించుకోవాలి. భరత మాత వర్థిల్లాలి. భారతీయు లకు జయం కలగాలి. భారత్ మాతాకీ జై..
 వ్యాసకర్త బీజేపీ నాయకుడు
 - పురిఘళ్ల రఘురామ్
 ఈమెయిల్: raghuram.bjp@gmail.com

>
మరిన్ని వార్తలు