కర్షకుడి పేరు... కంపెనీల జోరు

30 Oct, 2013 01:18 IST|Sakshi
కర్షకుడి పేరు... కంపెనీల జోరు

సందర్భం: హైదరాబాద్ సదస్సులో ప్రధానోపన్యాసం బేయర్‌కంపెనీ ప్రతినిధి ఇవ్వబోతున్నాడు. ఈ కంపెనీతో మన రైతులు ఎందరో నష్టపోయారు. వారికి ఇప్పటికీ నష్ట పరిహారం రాలేదు. దీని ప్రతినిధి చిన్న రైతుల బాగు గురించి ప్రసంగించటం హాస్యాస్పదమే.  
 
 ప్రపంచ వ్యవసాయ సదస్సు కు ఈసారి హైదరాబాద్ వేదిక కాబోతోంది. నవంబర్ 4-7 తేదీలలో జరిగే ఈ సదస్సు నిర్వ హణలో రాష్ర్ట ప్రభుత్వం కూడా  భాగస్వామే. ఇంతకీ ఈ సదస్సు ఎవరి కోసం?  ఇది మన రైతులకు ఉపయోగపడితే సంతోషమే. ఈ సదస్సులు ప్రపంచ వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకు (గత పదేళ్లుగా) ఒకసారి జరుగుతున్నాయి. తొలి ఐదు అమెరికాలోనూ గత సదస్సు బెల్జియం (బ్రస్సెల్స్)లోను జరిగాయి. సదస్సులతో ప్రపంచ వ్యవసాయ అభివృద్ధికి దిశానిర్దేశనం చేయడం ఈ వేదిక ఉద్దేశం. పెరుగుతున్న ప్రపంచ జనాభాకు ఆహారం అందాలంటే అధిక ఉత్ప త్తితోనే సాధ్యమని ఇది స్పష్టం చేస్తున్నది. హరిత విప్లవా న్ని కొనసాగిస్తూ, వ్యవసాయాన్ని ఆధునీకరించాలని ఆశిం చే ప్రపంచ సంస్థలలో ఇది ఒకటి. ఇదే సూత్రాన్ని పాటించ మని ప్రైవేట్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం మీద ఒత్తి డి తెస్తున్నాయి.  కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ కూడా ఈ దిశగానే ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఆలోచ నలు కలిగిన వ్యక్తులు, సంస్థల కలయికే ఈ సదస్సు.చిన్న రైతులు, మహిళా రైతుల ప్రయోజనాల కోసం అని పత్రాలలో రాసుకున్నా ఆచరణలో వాటికి ప్రాధాన్యం కన పడదు. సదస్సు నిర్వాహక సంఘంలో ఒక్క మహిళ కూడా లేదు.
 
 పేరు గొప్ప... ఊరు దిబ్బ...
 చిన్న రైతులు లేదా వారి ప్రతినిధులకు కూడా ప్రాతినిధ్యం లేదు. నాణ్యమైన విత్తనాలు దొరక్క, వేసిన విత్తనాలు మొలకెత్తక, మొలక వచ్చినా కాయ రాక, వచ్చిన కాయకు సరైన మార్కెట్ ధర అందక రైతు ఇబ్బంది పడుతుంటే, ‘అధిక ఉత్పత్తి మా లక్ష్యం’ అనే నినాదంతో ఈ సదస్సు జరగబోతోంది. మరి సాగు సమ స్యలు ప్రస్తావించకుండా ఏం సాధిస్తారు? జన్యుమార్పిడి విత్తనాల వల్ల రైతుకు వచ్చే ప్రయోజ నం ఏమీ లేదని ఐదేళ్ల బిటీ పత్తి అనుభవంలో తేలింది.
 
  అలాంటి జన్యు మార్పిడి విత్తనాలను నెత్తికెత్తుకున్న డా॥కెన్నెత్ బేకర్ (చైర్మన్, ప్రపంచ వ్యవసాయ వేదిక) ఈ సదస్సును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం పెద్ద వ్యూహమే. డా॥కెన్నెత్ యూరోప్, ఆఫ్రికా ఖండాలలో మోన్‌శాంటో కంపెనీ ప్రతినిధి. మన పార్లమెంటులో, సుప్రీంకోర్టులో జన్యుమార్పిడి విత్తనాలను అనుమతిం చడం గురించి తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో ఈ సదస్సు ఏర్పాటయింది.  దేశంలో విత్త నాల ఉత్పత్తిలో 90 శాతం మన రాష్ట్రంలోనే జరుగుతుంది. విత్తన కంపెనీలు, వారికి వత్తాసు పలికే రాజకీయ నాయ కులు, అధికారులు కలిసిపోయి జన్యుమార్పిడి విత్తనాల అనుమతులకు మార్గం సుగమం చేయడానికే ఈ సదస్సును తలపెట్టారు. ఈ సదస్సుకు పెట్టుబడి పెట్టే వాళ్లలో మోన్‌శాంటో, బెయిర్ లాంటి పెద్ద కంపెనీలు ఉండటం గమనార్హం.
 
 మొదటి ఐదు సదస్సులు అమెరికాలోని మిస్సోరీలో జరిగాయి. వాటి చర్చనీయాంశాలు ఇవి:  ఒకటి (20-22 మే, 2001) వ్యవసాయంలో కొత్త శకం: ప్రపంచానికి ఆహారం. రెండు: (8-20 మే, 2003) వ్యవసాయంలో కొత్త శకం: కలిసి భవిష్యత్తు నిర్మాణం, అడ్డంకుల తొల గింపు. మూడు: (6-18 మే, 2005) శాంతి, రక్షణ, వృద్ధికి మార్గం: స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ వ్యవసాయ - ఆహార వ్యవస్థలు. నాలుగు: (8-10 మే, 2007) వ్యవ సాయ పెట్టుబడుల ద్వారా సంపద సృష్టి. ఐదు:(18-20 మే, 2009) వ్యవసాయానికి సవాళ్లు. బెల్జియంలో (29 నవంబర్ - 1 డిసెంబర్, 2011) జరిగిన ఆరో సదస్సులో అంశం ‘పెరుగుతున్న ప్రపంచ జనాభా పోషణకి వ్యవ సాయంపై పునరాలోచన. రాష్ట్రంలో జరగబోయే ఏడో సద స్సులో ‘సుస్థిర భవిష్యత్తుకు వ్యవసాయ స్వరూపాన్ని మార్చడం: చిన్న రైతుల మీద దృష్టి’ అన్న అంశాన్ని తీసుకుంటున్నారు.
 
 ఆది నుంచీ వివాదాస్పదమే
 1997లో ప్రారంభమైన ప్రపంచ వ్యవసాయ వేదిక వ్యవ సాయ విధానాల మీద చర్చలను నిర్వహించే తటస్థ సంస్థ అని చెప్పుకుంటుంది. కానీ వ్యవహారంలో ఇదెక్కడా కన పడదు. వేదిక రైతుల కోసం ఏర్పాటయినది కూడా కాదు. ఇది ఏటా తమ మార్కెట్ వాటాలను పెంచుకుంటున్న బహుళజాతి కంపెనీల వ్యాపార వేదిక. ప్రపంచ వ్యవ సాయాన్ని వారి వ్యాపారాలకు అనుగుణంగా మార్చడమే ప్రధాన ధ్యేయంగా కనపడుతుంది. పెద్ద కమతాలలో ఆధునిక వనరులను పెద్ద ఎత్తున ఉపయోగించి చేసే సేద్యం గురించిన వ్యూహాలే కనిపిస్తాయి.
 
 జన్యుమార్పిడి పంటల పరిశోధన, ఉత్పత్తి, అను మతులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఉన్న వ్యాజ్యం కీలక దశకు చేరింది. కోర్టు నియమించిన టెన్నికల్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక జీవరక్షణ, భద్రత చర్యలు లేకుండా జన్యుమార్పిడి విత్తనాల క్షేత్ర పరీక్షలు నిర్వహిం చరాదని చెబుతున్నది. తీర్పు ఇంకా రావాల్సి ఉంది. అటు పార్లమెంటులో బీఆర్‌ఏఐ బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా అనేక అభిప్రాయాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇది పార్లమెంటరీ స్థాయీ సం ఘం ముందుంది. ఈ సంఘం ఇప్పటికే జన్యుమార్పిడి పంటల అవసరం మన సేద్యానికి లేదని నివేదించింది. కేంద్ర వ్యవసాయ, పర్యావరణ మంత్రిత్వశాఖల మధ్య ఈ పంటలకు అనుమతి ఇవ్వడం గురించి ఏకాభిప్రాయం లేదు. ఈ తరుణంలో సదస్సు ఏర్పాటు చేయడమంటే  మన వ్యవసాయ విధానాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికే.
 
 హైదరాబాద్ సదస్సులో ప్రధానోపన్యాసం బెయ ర్‌కంపెనీ ప్రతినిధి ఇవ్వబోతున్నాడు. ఈ కంపెనీతో మన రైతులు ఎందరో నష్టపోయారు. వారికి ఇప్పటికీ నష్ట పరి హారం రాలేదు. దీని ప్రతినిధి చిన్న రైతుల బాగు గురించి ప్రసంగించటం హాస్యాస్పదమే. తుపానులతో దెబ్బ తిన్న రైతాంగాన్ని చూడటానికి కూడా రాని కేంద్ర వ్యవసాయ మంత్రి ఈ సదస్సుకు రావాలని నిర్ణయించుకోవడం శోచ నీయం. 2011 సమావేశంలో జేమ్స్ బోల్గేర్, (చైర్మన్, అం తర్జాతీయ సలహా సంఘం) జన్యు మార్పిడి పంటల ఆవ శ్యకతను గుర్తు చేశారు. వ్యాట్ వెబ్‌సైట్ ప్రకారం వారి సహకారం అందించే సంస్థలలో ప్రపంచ బ్యాంకు, డబ్లు. కె.కెల్లోగ్ ఫౌండేషన్, మోన్‌శాంటో, టైసన్, డీఐ ఆయిల్స్, కార్పొరేట్ కౌన్సిల్ ఆన్ ఆఫ్రికా, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ద వరల్డ్ ఫుడ్ ప్రైస్ పార్టనర్‌షిప్ టు ఎండ్ హంగర్ ఇన్ ఆఫ్రికా. ఇవన్నీ కూడా మోన్‌శాంటో కంపెనీకి అనుగుణంగా పని చేస్తున్నవే.
 
 మేలు చేయని ఆలోచనలు
 గత సమావేశాలలో వేటిలోనూ రైతులు పాల్గొన్న దాఖ లాలులేవు. బ్రస్సెల్స్ సమావేశాలలో ప్రసంగించిన వారి లో ఎవరూ రైతులుకాదు.  సమావేశాల తీరు, భాష కూడా అంతర్జాతీయమే. ఎక్కువగా, రౌండ్ టేబుల్ సమావేశాలే. వారి చర్చనీయాంశాలు ఇవి.
 
         వ్యవసాయంపైన పునరాలోచన- సమస్యలు: (వ్యవ సాయ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కడ నుంచి వస్తుం ది? ఇది నూతన ప్రపంచ ఒరవడికి దారితీస్తుందా? /రైతుల నుంచి సమాజం ఏమి ఆశిస్తుంది?/ వ్యవ సాయానికి ఆధునిక టెక్నాలజీ: సవాళ్లు./ప్రపంచ వాణిజ్య ఏర్పాటు ద్వారా ఆహార భద్రత. /గొలుసు కట్టు వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా నుంచి ఉప యోగాలు ఎలా రాబట్టాలి?)
         వ్యవసాయంపైన పునరాలోచన- సాధ్యమయ్యే పరి ష్కారాలు: (వ్యవసాయానికి ఒక నూతన దృష్టి: మార్కెట్ ఆధార పరిష్కారాలు./తక్కువ నుంచి ఎక్కువ: సమాజ వనరుల సుస్థిర ఉపయోగంలో మార్పులు. /వ్యవసాయంలో పెట్టుబడులకు సూత్రా లు. /వ్యవసాయంలో భవిష్యత్తు పెట్టుబడులకు ప్రోత్సాహం.)
         {పపంచ వ్యవసాయంపైన పునరాలోచన: భవిష్య త్తుకు అవసరమైన నిధులు, యాజమాన్యం (వ్యవ సాయ ఉత్పత్తుల మార్కెట్: నియంత్రణ అవస రమా?/వాణిజ్యం, ఆర్థిక అంశాలు.)
 ఈ శీర్షికలు, చర్చనీయాంశాలు సామాన్య రైతుకు కాదు, ఇది చూడగానే అర్థమవుతుంది. వ్యవసాయం మీద వ్యాపారం చేస్తున్న కంపెనీలకు ఉపయోగపడేవి మాత్రమే.
 
 ఒరిగేదేమీ లేదు...
 హైదరాబాద్ సదస్సులోను ఈ తరహా శీర్షిక లే ఉండబోతు న్నాయి. ఇందులో రాష్ట్రంలో పురుగు మందులు లేకుండా లక్షల ఎకరాలలో జరుగుతున్న వ్యవసాయం గురించి లేదు. చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన పెట్టుబడుల ప్రస్తావన లేదు. వ్యవసాయం ద్వారా సాధ్యమయ్యే ఆహా ర భద్రత గురించీ లేదు. రైతులు ఇందులో పాల్గొనే అవకా శాలు తక్కువ. ప్రవేశ రుసుం రాష్ర్ట ప్రభుత్వం భరించినా, భాష ఒక సమస్య. అనువాదకులు ఉన్నా, సంబంధం లేని విషయాలు అర్థం చేసుకునే అవకాశం రైతులకు లేదు. ప్రపంచ వ్యవసాయ సదస్సు హైదరాబాద్‌లో నిర్వహిం చినా మనకు నష్టమే తప్ప లాభం లేదు. మన వ్యవసాయ సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. మన శాస్త్ర వేత్తలు, అధికారులు, రైతులు చర్చించుకోవాలి. ముఖ్యం గా రైతుల స్వాతంత్య్రాన్ని హరించే సదస్సులకు ప్రజా ధనం వినియోగపడరాదు.

- డాక్టర్ డి.నరసింహారెడ్డి
 వ్యవసాయ విశ్లేషకులు

మరిన్ని వార్తలు