మొదటి మెట్టెక్కిన డబ్ల్యూటీఓ

2 Dec, 2014 09:47 IST|Sakshi
డా॥కె. క్రాంతి కుమార్ రెడ్డి

సందర్భం

 వ్యవసాయానికి పరిమితి లేని సబ్సిడీలనిచ్చే అధికారం తనకుందన్న ఇండియా వాదనను ఇటీవలే డబ్ల్యూటీఓ సాధారణ మండలి ఆమోదించటం మంచిదే కానీ, ధనిక దేశాల వ్యవసాయ కార్పొరేషన్లకు, పేద దేశాల రైతులకు మరో ప్రచ్ఛన్న యుద్ధానికి డబ్ల్యూటీఓలో తెరలేవనుంది.

  కోట్లాది పేద ప్రజల ఆహార భద్రత గాలికొదిలి వాణిజ్య సరళీకరణకు తలోగ్గేదిలేదని, ఆహార భద్రతపై శాశ్వ త పరిష్కారం లభించే వరకు పరిమితిలేని సబ్సిడీల నిచ్చే అధికారం తనకుం దన్న ఇండియా వాదనను ఇటీవలే డబ్ల్యూటీఓ సాధారణ మండలి ఆమోదించటంతో, వాణిజ్య ప్రోత్సాహక ఒప్పందం అమలుకు రంగం సిద్ధమైంది. 2001లో మొదలైన దోహా అభివృద్ధి ఎజెండాలో ఈ ఒప్పందం ఒక చిన్నభాగమే అయినప్పటికీ 1995లో డబ్ల్యూటీఓ ఆవిర్భవించినప్పటి నుండి ఇదే మొట్టమొదటి  ఒప్పందం కావటం విశేషం. 2001లో మొదలైన దోహా అభివృద్ధి ఎజండాపై చర్చలు గత 14 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి వ్యయంలో పది శాతానికి మించి సబ్సిడీలు ఇవ్వరాదన్న ఆంక్షల్ని భారత్ వ్యతిరేకించటంతో గత డిసెంబర్‌లో అవగాహన కు వచ్చిన వాణిజ్య ప్రోత్సాహక ఒప్పందం అమ లుకు ఆటంకమేర్పడిందని, దీనివల్ల ప్రపంచ వాణి జ్యంలో లక్ష కోట్ల డాలర్ల అభివృద్ధిని, 2 కోట్ల ఉద్యోగావకాశాలను ప్రపంచం కోల్పోతుందని అభివృద్ధి చెందిన దేశాలు గళమెత్తాయి. కానీ తమ జీడీపీ వృద్ధి శాతం మందగించటంతో అవి ఇండియా డిమాండుకు తలొగ్గక తప్పలేదు.
 
 2013లో ఇండియా, అమెరికా, బ్రిటన్,  జపాన్, జర్మనీలలో జీడీపీ వృద్ధి శాతం.
 1.    ఇండియా    5.70
 2.    జపాన్    2.00
 3.    {బిటన్    1.80
 4.    అమెరికా    1.60
 5.    జర్మనీ    0.50
 ఆర్థిక మందగమనంలో పడ్డ ధనిక దేశాలు వాణిజ్య సులభతర ఒప్పందంతోనైనా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మార్కెట్ అవకాశాలు పెంచు కోవాలని తాపత్రయపడుతున్నాయి. ఇటీవలి డబ్ల్యూటీఓ సమావేశం వ్యవసాయంపై ఒక శాశ్వ త పరిష్కారం డిసెంబర్ 2015 నాటికి సాధించా లని నిర్దేశించింది. డబ్ల్యూటీఓ వ్యవసాయ ఒప్పం దం మేరకు ఆహార సబ్సిడీలను మొత్తం వ్యవ సాయ ఉత్పత్తుల 1986-88 సంవత్సర ధరల విలువలో 10 శాతంకి పరిమితం చేయవలసి ఉం ది. అయితే మన వ్యవసాయ సబ్సిడీ లెక్కలను ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ధరల ఆధారంగా గడచిన మూడు సంవత్సరాల సగటున లెక్కించాలని ఇండియా అంటోంది.

 ఈ.యూ. తన రైతులకు 110 బిలియన్ డాలర్ల సబ్సిడీలనిస్తోంది. ఇండియా తన 40 కోట్ల రైతులకు ఇచ్చే సబ్సిడీ 15 బిలియన్ డాలర్లుంటే, అమెరికా తన 30 లక్షల మంది రైతులకు 120 బిలి యన్ దాలర్ల సబ్సిడీ ఇస్తోంది. అంటే అమెరికా ప్రతి  రైతుకు సగటున 40 వేల డాలర్ల సబ్సిడీ ఇస్తోంది. ఇండియా తన రైతులకు చెల్లించే కనీస మద్దతు ధరలు, ఆహార నిల్వలవల్ల ప్రపంచ వాణి జ్యంలో సమతౌల్యత దెబ్బతింటుందని, ఆహార భద్రతా చట్టంవల్ల మన సబ్సిడీలు 10% పరిమి తిని దాటతాయని అమెరికా వాదిస్తోంది. ఇదెంత వరకు నిజం? చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలపై వడ్డీ 12% ఉంటే, పంటరు ణాలపై మినహా మిగతా రుణాలన్నిటిపై రైతులు 13.5% వడ్డీ చెల్లిస్తున్నారు. మూడు లక్షలు దాటిన పంట రుణాలపై కూడా 13.5% వడ్డీ చెల్లిస్తున్నారు. ట్రాక్ట ర్లు లేకుండా వ్యవసాయం చేయలేని ఈ పరిస్థి తులలో ట్రాక్టర్ల కొనుగోలుకు రైతులు 13.5% వడ్డీని చెల్లిస్తున్నారు. లగ్జరీ కార్ల కొనుగోలుకు మా త్రం బ్యాంకులు 10% వడ్డీకే రుణాలిస్తున్నాయి. అంటూ సేద్యానికి ప్రభుత్వ మద్దతు శూన్యం.

 అభివృద్ధి చెందిన దేశాలు తమ వ్యవసాయ రంగాలకు ఇస్తున్న భారీ సబ్సిడీలతో తమ వ్యవ సాయ ఉత్పత్తులను అంతర్జాతీయ  మార్కెట్లలో కృత్రిమ ధరలకు డంప్ చేస్తున్నాయి. అమెరికా గత కొంత కాలంగా 65% డంపింగ్ మార్జిన్ (ఉత్పత్తి వ్యయానికి ఎగుమతి ధరకు మధ్య వ్యత్యాసం)తో ప్రత్తిని అంతర్జాతీయ  మార్కెట్లలో డంప్ చేస్తోం ది. దీనివల్ల ప్రత్తిధరలు పతనమై అనేక దేశాలలో రైతులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా రు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలమధ్య తీవ్రమైన వాణిజ్య అసమతౌల్యతలున్నాయి. అమె రికా ఫ్రాన్స్ నుంచి వచ్చే కొన్ని దిగుమతులపై కన్నా బంగ్లాదేశ్ నుంచి వచ్చే దిగుమతులపై 10 రెట్లు  అధికంగా సుంకాలను విధిస్తోందంటే పేద దేశాలకు మార్కెట్ అందుబాటు ఏమేరకు ఉందో అర్థమౌతుంది.

 డబ్ల్యూటీఓ ముఖ్య ఆశయం స్వేచ్ఛా వాణి జ్యం ద్వారా అభివృద్ధిని అంతర్జాతీయం చేయ టం. కానీ స్వేచ్ఛా వాణిజ్యం ఫలితంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో పేదరికం పెరి గిందని, డబ్ల్యూటీఓ ఆవిర్భవించినప్పటి నుంచి అంటే 1995 నుంచి ప్రపంచ వాణిజ్యంలో పేద దేశాల వాటా 1% తగ్గిందనీ అధ్యయనాలు చెబు తున్నాయి. స్వేచ్ఛా వాణిజ్యం ఫలితంగా ఆహారా న్నందించే అన్నదాతలే ఆత్మహత్యల పాలవుతు న్నారు. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అంచ నాల ప్రకారం ఒక్క ఆసియాలోనే 50 కోట్ల మంది రైతులు అర్ధాకలితో జీవిస్తున్నారు. రానున్న రోజు లలో దోహా ఎజెండాలోని వ్యవసాయ సబ్సిడీలకు సంబంధించి ధనిక దేశాలకు చెందిన వ్యవసాయ కార్పొరేషన్లకు, పేదదేశాల ైరైతులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి డబ్ల్యూటీఓ వేదిక కానుంది.

 (వ్యాసకర్త వ్యవసాయ విధాన విశ్లేషకులు)

మరిన్ని వార్తలు