మృత్యువును ధిక్కరించిన పాట

6 Apr, 2017 02:06 IST|Sakshi
మృత్యువును ధిక్కరించిన పాట

మట్టి మనుషులు మనిషిలాగా బ్రతకాలని, మనిషిలాగా మరణించాలన్న కోరికని సామూహిక చైతన్యంగా మలచటంలో ప్రజా కళాకారుల పాత్ర ప్రముఖమైనది. ఆ ప్రజా కళాకారులకి గోసి, గొంగడి, గజ్జెలు కట్టి.. ప్రజలు పెట్టిన ముద్దుపేరు గద్దర్‌.

తెలుగు కళా సాహిత్య చరిత్రలో శబ్దం ఒక విశాల వేదికను సృష్టించింది. అనేకమంది కవులను, కళాకారు లను, రచయితలను, చిత్రకారులను, జర్నలిస్టులను, ఫొటోగ్రాఫర్లను, మేధావులను, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను ఒక వేదిక మీదకు తెచ్చింది. వీరి సృష్టిని, సృజనాత్మకతకు అద్దం పట్టింది శబ్దం. ఆనాడు ఆ శబ్దం గద్దర్‌ కోసం మార్మోగింది. పాటలై, కవితలై, కథలై, పద్యమై, గద్యమై, చిత్రమై, ప్రాణ గీతమై, డప్పుల సంగీతమై, గజ్జెల గానమై, మృత్యువుకు పెను సవాలై, అశేష పీడిత ప్రజల ఐక్య నినాదమై ప్రతిధ్వనిం చింది. గద్దర్‌ పాట దీనికి స్ఫూర్తి, గద్దర్‌పై పేలిన తూటా దాని సందర్భం. అది 6 ఏప్రిల్‌ 1997. నేటికి 20 ఏండ్లు. గద్దర్‌ పాటకు 60 ఏండ్లు.

‘‘భారతదేశం భాగ్య సీమరా–సకల సంపదకు కొదు వలేదురా/సకల సంపదలు కల్ల దేశమున దరిద్రమె ట్లుందో’’ ఇది గద్దర్‌ పాట. ఇది గద్దర్‌ ప్రశ్న. 50 ఏండ్లు నిండినా ఈ ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. గుండెల్లో బుల్లెట్లు దించినా ఈ ప్రశ్న చచ్చిపోలేదు. ఇది భిన్న సంస్కృతుల దేశం. విభిన్న విశ్వాసాల సమాజం. అనేక భాషలు, వర్గాలు, కులాలు, జాతులు, ప్రాంతాలు, ఆహార అల వాట్లు, భిన్న సత్యాలు, అలవికాని మానవ ఆహార్య అందాలు కలిగి ఉన్న దేశం, అందుకే నిజమైన ప్రజాస్వా మ్యమే ఈ దేశానికి ధర్మం, మార్గం. నిజమైన ప్రజాస్వామ్యమే ఈ దేశ దరిద్రానికి పరిష్కారం.


ఈ ప్రజాస్వామ్యం కోసం ఈ దేశ ప్రజలు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. భారతదేశ రాజ్యాంగ అమలు కోసం అనేకమంది రైతులు, కూలీలు, కార్మికులు, విద్యా ర్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఆడవాళ్లు, అంటరాని వాళ్లు ప్రాణాల్ని అర్పించారు. ఈ మట్టి మనుషులు మనిషిలాగా బ్రతకాలని, మనిషిలాగా మరణించాలని కోరుకుంటున్నారు. ఈ కోరికని సాంస్కృతిక చైతన్యంగా, సామూహిక ప్రజా చైతన్యంగా మలచటంలో ప్రజా కళా కారుల పాత్ర ప్రముఖమైనది. ఆ ప్రజా కళాకారులకి గోసి, గొంగడి, గజ్జెలు కట్టి, ముద్దు పెట్టి ప్రజలు గద్దర్‌ అని పేరు పెట్టారు.

‘‘యాలరో ఈ మాదిగ బతుకు’’ గద్దర్‌ పాట. పాట వెంట పాట. వందలు, వేలు. పాటల ప్రవాహం. తనకు గోసి పెట్టిన ప్రజల కోసం, గొంగళి కప్పిన ప్రజల కోసం, ముద్దు పెట్టిన ప్రజల కోసం వీధుల్లో, వాడల్లో, పల్లెల్లో, పట్టణాల్లో తిరుగుతూ దేశమంతా పాడుకుంటూ వెళ్లి పోయాడు. ప్రజా వాగ్గేయకారుడిగా ప్రజల గొంతును ప్రపంచానికి వినిపించాడు. సమస్య ధరలదైనా, దొరల దైనా, అగ్రరాజ్యాలదైనా, దాడి దళితుల మీదైనా, గిరిజ నుల మీదైనా, మైనార్టీ మీదైనా, స్త్రీల మీదైనా, దౌర్జన్యం పోలీసుమీదైనా, నక్సలైట్‌ మీదైనా–ఒక్క మాటలో అన్యా యం ఎక్కడ జరిగితే అక్కడ గద్దర్‌ ఉంటాడు.

వర్గ పోరులో, దళిత ఆత్మగౌరవ ఉద్యమంలో, ఉరిశిక్ష రద్దు పోరాటంలో, దళిత బహుజన రాజకీయ పోరాటంలో గద్దర్‌ ఆయన లేని ఉద్యమం లేదు. ఆయన లేని పాట, ఆయన పాత్రలేని ప్రత్యేక తెలంగాణ ఉద్య మాన్ని ఊహించలేము. రాజ్యాంగం అమలు లోకి వచ్చి 67 ఏండ్లు నిండినా ఈ దేశంలో ఇంకా దళితులు, గిరిజనులు, బీసీలు, మహి ళలు, మైనార్టీలు ఓటుకు బయటనే ఉన్నారు. చదువు కోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, రేషన్‌ కార్డు పొందా లన్నా, కూడు తినాలన్నా, దవాఖానాకు పోవాలన్నా, దేవుడ్ని కొలవాలన్నా, చివరికి బిడ్డల పెళ్లిళ్లు చేయాలన్నా అగ్రకులాల దయా దాక్షిణ్యాలతోనే జరగాలి. ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు. ప్రజల మనస్సుకు శాంతి లేదు. ప్రజల ఆత్మకు విశ్రాంతి లేదు. సాగు చేసుకోటానికి భూమి లేదు. చావు చేసుకోవటానికి భూమి లేదు.

ఏది అడిగినా ఈ పెత్తందార్లు మన అవసరాలని వరాలుగా ప్రకటించి, మన డిమాండ్లనే వాళ్ల రాజకీయ మేనిఫెస్టోగా చెప్పి మన నోరు మూసు కోమంటున్నారు. ప్రశ్నించే గొంతులను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారు. దళిత, గిరిజన, బీసీ, మహిళ, మైనార్టీ ప్రజల ప్రతినిధు లుగా ఎదిగినవాళ్లకు పదవులతో, కాంట్రాక్టులతో మభ్యపెడుతున్నారు. ఈ దుస్థితికి అనేక కారణాలు న్నాయి. ఓట్ల యుద్ధంలో గెలవాల్సిన వాడు ఓడిపోతున్నాడు. ఓడిపోవా ల్సిన వాడు గెలుస్తున్నాడు. పోరాడేది ఒకడు–పీఠమెక్కేది మరొకడు. మెజా ర్టీగా ఉన్న దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ ప్రజలు 70 ఏండ్లుగా ఓడి పోతూనే ఉన్నారు. ఈ చరిత్ర గతిని మార్చటానికి మెజార్టీ ప్రజలు సరైన సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తి తమ జీవితాల్లో వెలుగొందాలని ఈ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ప్రజాస్వామిక చైతన్యం.

‘‘ఈ దేశం ఎవడిదిరా – ఈ దేశం మనదేరా/ దుక్కిని దున్నిన రైతుది – మొక్కలు నాటిన కూలిది/ రెక్కలు దప్ప ఆస్తులు లేని – కార్మికులది, కార్మికులది’’ ఇది గద్దర్‌ ప్రశ్న మాత్రమే కాదు. గద్దర్‌ సమాధానం కూడా. ‘‘నీ చైతన్యం నీ ఓటును నిర్దేశించాలి. నీ ఓటు నీ జాతి పురోగతికి, ఈ దేశ ప్రగతికి మార్గమవ్వాలి. నీ ఓటుతోనే నిజమైన ప్రజా స్వామ్యం నిలబడాలి’’ ఈ సందేశాన్ని ఇప్పటివరకు ఓటుకు బయట ఉన్న మెజారిటీ దేశ ప్రజలకు అందిం చాల్సిన అవసరం ఉన్నదని శబ్దం భావిస్తుంది. భారత రాజ్యాంగ రక్షణకై ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు శబ్దం కవులను, కళాకారులను, రచయితలను, మేధావు లను, ప్రజా సంఘాల నాయకులను ఆహ్వానిస్తుంది. ఈ సందర్భంగా ‘‘పల్లె పల్లెకు పాట – పార్లమెంటుకు బాట’’ అనే కార్యక్రమంతో రాజకీయ–సాంస్కృతిక ప్రస్థానాన్ని ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్నాము.
(ఈ పత్రం 6 ఏప్రిల్, 2017న సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్‌లో జరుగుతున్న శబ్దం కార్యక్రమంలో ప్రజల ఆమోదానికి ప్రవేశపెడుతున్న ప్రతిపాదన)
సీఎల్‌ యాదగిరి, లెల్లె సురేష్‌ (‘శబ్దం’ ప్రతినిధులు)

మరిన్ని వార్తలు