దేవుడుగారూ-జిందాబాద్

6 Aug, 2015 01:58 IST|Sakshi
దేవుడుగారూ-జిందాబాద్

అసదుద్దీన్ ఒవైసీ, ‘యాకూబ్ మెమన్‌ని ఉరితీయడానికి కారణం - అతని మతం’ అన్నారు. ఆయన అభ్యంతరానికి దేవుడు పెట్టుబడి. సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ ఈ మధ్య ఓ మాట అన్నాడు: ‘80 శాతం హిందువులు ఉన్న ఈ దేశంలో సూపర్ స్టార్స్‌గా ఉన్న- షారూఖ్, సల్మాన్, అమీర్-20 శాతం ఉన్న మైనారిటీ మతస్తులు’.
 
 ఈ దేశంలో విరివిగా అమ్ము డుపోయే, కలిసివచ్చే, కొంగు బంగారంగా నిలిచే వస్తువు పేరు - దేవుడు. దేవుడు జాతి ప్రాథమిక బలహీనత - అన్నా రెవరో పెద్దమనిషి. దేవుడు జాతికి అన్ని రంగాలలోనూ ప్రధానమయిన పెట్టుబడి అని ఆయనకి తెలీదు. దేవుడు ప్రాతిపదికగా ఒక పార్టీ దేశాన్ని పరిపాలి స్తోంది. వారు చేసే ఏ పనయినా - అది మంచయినా చెడు అయినా - దేవుడు కారణంగానే ప్రతిపక్షాల విమ ర్శకు గురవుతోంది. ‘‘యోగా ఆరోగ్యానికి మంచిద య్యా’’ అంది ఐక్యరాజ్యసమితి. సూర్యుడు దేవుడు కాదు-అంది ఓ మతం. ప్రహ్లాదుడికంటే హిరణ్యకశ పుడు అనునిత్యం దేవుడిని తలుస్తూండాలి - ఆయనకి శత్రువు కనుక. Hypocricy is a fulltime job  అన్నాడు సోమర్సెట్ మామ్.
 ఇప్పుడు రెండు కథలు. రెండు కథలకూ సుప్రీం కోర్టే మద్దతు. వ్యాపార వస్తువుల మీద - అంటే పళ్ల పొడి, తలనొప్పి మందు, మసాలా వస్తువులు, మం దులు, బట్టల మీద - దేవుడి బొమ్మలు ఉండరాదని ఒకాయన సుప్రీంకోర్టులో కేసు పెట్టాడు. సుప్రీం కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల న్యాయపీఠం ఆ కేసుని కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి అన్నారు కదా: ‘‘ఒక వ్యాపా రి తాను బాలాజీ భక్తుడిననో, లక్ష్మి భక్తుడిననో అంటు న్నాడు. తత్కారణంగా తన కొడుక్కీ, కూతురుకీ ఆ పేర్లు పెట్టుకుంటున్నాడు. తన నేమ్‌ప్లేట్ మీదా, కారు మీదా, తయారు చేసే వస్తువు మీదా ఆ బొమ్మలు వేసు కున్నాడు. తప్పేముంది?’’
 
 మరో కేసు. కేరళలో ఓ ము స్లిం అమ్మాయి తల చుట్టూ హిజాబ్ (కప్పుకునే చున్నీ) వేసుకునే అఖిల భారత వైద్య పరీక్షకు వస్తానంది - అది మన మతానికి సంబంధించిన ఆచారం కనుక. కేరళ హైకోర్టు అర గంట ముందు పరీక్ష హాలుకి వచ్చి తనిఖీ జరిపించాలని ఆదేశించింది.
 అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు: ‘‘పరీక్షకి తలమీద హిజాబ్ లేకుండా రావ డం వల్ల మత విశ్వాసానికి ఏ మా త్రమూ భంగం కలుగదు’’ అని.
 
 దేవుడికీ, దేవుడిపట్ల విశ్వాసా నికీ, మెడికల్ పరీక్షకీ, మెడ మీద వేసుకున్న హిజాబ్‌ని రెండు గంటల పాటు దూరంగా ఉంచడం వల్ల ఎంత మాత్రం హాని జరగదని ఆయన విశ్వాసం. మొన్ననే కేరళలో ఓ క్రైస్తవ సిస్టర్ సైబా ఆలిండి యా ప్రీ మెడికల్ పరీక్షకి తలనిండా ముసుగు వేసుకుని, మెడలో శిలువని ధరించి వచ్చారు. పరీక్షా అధికారులు ఆమె పరీక్ష హాలులోకి అలా రావడానికి తిరస్కరించారు. వాటిని తొలగించాలన్నారు. ఆమె తనని మరొక గదిలో కూర్చుని పరీక్ష రాసే అవకాశాన్ని కోరింది. అధికారులు అంగీకరించలేదు. ఆమె పరీక్ష రాయకుండానే వెళ్లిపో యింది.
 
 22 సంవత్సరాల కిందట (1993 మార్చి 2న) కనీ వినీ ఎరగని రీతిలో 12 స్థలాలలో ముంబైలో దారుణ మారణకాండ జరిగింది. 257 మంది చచ్చిపోయారు. 713 మంది గాయపడ్డారు. ఒక ముద్దాయిని ఈ దేశంలో అన్ని దశలలోనూ న్యాయస్థానాలు, రాష్ర్టపతితో సహా ఉరితీయవచ్చునని నిర్ణయించాయి. మొన్న శిక్ష అమలు జరిగింది. ఒకానొక అఖిల భారత ముస్లిం పార్టీ నేత అసదు ద్దీన్ ఒవైసీ, ‘‘యాకూబ్ మెమన్‌ని ఉరితీయడానికి కార ణం - అతని మతం’’ అన్నారు. ఆయన అభ్యంతరానికి దేవుడు పెట్టుబడి.
 
 ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ ఈ మధ్య ఓ మాట అన్నాడు: 80 శాతం హిందువులు ఉన్న ఈ దేశంలో సూపర్ స్టార్స్‌గా ఉన్న ముగ్గురు నటులు - షారూఖ్ ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్-20 శాతం ఉన్న మైనారిటీ మతస్తులు. ఈ దేశాన్ని గురించి చెప్పడానికి ఇంతకన్న మంచి ఉదాహరణ లేదు. దేవుడు చాలా మందికి చాలా రకాలయిన ఊతం. నిస్సహాయు లకి ఊరట. అసమర్థులకి చేయూ త. నమ్మినవారికి మోక్ష ప్రదాత. మ తఛాందసులకి సర్వస్వం. వ్యాపార స్థులకి లాభసాటి తాయిలం. రాజ కీయ నాయకులకి ఓట్లకి పెట్టుబడి.
 
దేవుడు అందరికీ అన్నీ సమ కూర్చే కల్పతరువు అనడానికి ఇంత కన్న గొప్ప సాక్ష్యం ఏముంది? ఆశా రాం బాపూకి, అసదుద్దీన్ ఒవైసీకి, సాక్షి మహరాజ్‌కీ, బాబా రాందేవ్‌కీ, అజ్మల్ కసబ్‌కీ, ఉమాభారతికీ, ప్రవీణ్ తొగాడియాకీ, జాకీవూర్ రెహ్మాన్ లఖ్వీకీ - అం దరికీ అన్నిటికీ దేవుడే మూలాధారం. కొందరు ఒక దేవు డికి భక్తులు. ఆ కారణంగానే మరో దేవుడిని నమ్మేవారికి శత్రువులు. కొందరు దేవుడిని అడ్డం పెట్టుకుని అమ్మా యిలతో రాసక్రీడలు జరిపి జైలుకెళ్లారు. కొందరు దేవు డుని చేరడానికి దగ్గర తోవని వ్యాపారం చేశారు. కొంద రు మతం పేరిట మారణహోమాన్ని ఉద్యమం చేసుకు న్నారు. కొందరు పక్క మతం మసీదులు పగలగొట్టారు. కొందరు దేవుడిని రాజకీయ ఆయుధాన్ని చేసి ప్రసంగా లలో ఉద్యమాలు జరిపారు. ఇది దేవుడి విశ్వరూపం. దేవుడుగారూ, జిందాబాద్!
 - గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు