అమలే హామీకి గీటురాయి

18 Apr, 2014 00:23 IST|Sakshi
అమలే హామీకి గీటురాయి

రాజశేఖరరెడ్డి ఆశయాలతోనే ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో వ్యవసాయం గురించి చేసిన ప్రస్తావనలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రైతులకు మేలు చేసిన చరిత్ర వైఎస్‌ఆర్‌కు ఉంది. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన ఘనత ఉంది. ఆ నేపథ్యం, ఇప్పుడు ఇచ్చిన హామీలను బట్టి ఈ మేనిఫెస్టోను వేరుగానే చూడాలి.
 
 తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరు ఎన్నికల ప్రణాళికలతో జరుగుతున్న ఎన్నికలను మొదటిసారి చూడబోతున్నాం. ఈ రెండు ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీల ఎన్నికల వాగ్దానాలను చూస్తుంటే ప్రతి సృష్టి చేయబోతున్నాం అని పురాణ పురుషులు చెప్పే మాటలు గుర్తుకు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి పార్టీలు చేస్తున్న ప్రతిజ్ఞలు, ఇస్తున్న హామీలు, కురిపిస్తున్న వరాలు ఒక తంతుగా కనిపిస్తున్నాయే తప్ప, ఆచరణ సాధ్యమని అనిపించడం లేదు. ఇందుకు వైఎస్‌ఆర్ సీపీ మినహాయింపు అని కొన్ని కారణాలతో కచ్చితంగా చెప్పుకోగలిగినా, మొత్తం సేద్యం మీద కురిపిస్తున్న హామీలకూ, వాటి ఆచరణకూ మధ్య అగాధమే కనిపిస్తున్నది.
 
 తెలంగాణ రైతులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ కాదు, కేంద్ర బడ్జెట్ కూడా చాలదు. ప్రతి జిల్లాకు లక్ష ఎకరాలకు కొత్తగా నీటి సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అంటే పది జిల్లాలకు కోటి ఎకరాలకు నీరు ఇస్తామని వాగ్దానం చేశారు. ఇది ఎంత వరకు సాధ్యం? ఎలా సాధ్యం? ఈ వివరణలు  మేనిఫెస్టోలో కానరావు. చాలా వాగ్దానాలను ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను కూడా పట్టించుకోకుండా చేస్తున్నారని అనిపిస్తుంది. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలను చేయరాదనీ, ఉచిత తాయిలాలు ప్రకటించరాదనీ సుప్రీం కోర్టు ఇచ్చిన(జూలై, 2013) ఆదేశాలను ఉటంకిస్తూ ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలను హెచ్చరించింది. తెరాస ఆ ఆదేశాలను పెడచెవిన పెట్టినట్టే ఉంది. ఎందుకంటే, ఒక వాగ్దానం చేస్తే, దానిని నెరవేర్చే మార్గాలను కూడా ప్రస్తావించాలని ఎన్నికల కమిషన్  పేర్కొన్నది. ఆ వాగ్దానాల అమలుకు కావలసిన నిధులు ఎలా సమకూర్చుకుంటారో వాగ్దానాలు చేసిన పార్టీలు స్పష్టం చేయవలసిందే. అయినా చేతికి ఎముక లేదన్న రీతిలో రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయంటే మభ్యపెట్టడానికని చెప్పక తప్పదు.
 
 తెరాసతో పాటు, టీడీపీ చేస్తున్న వాగ్దానాలలో కూడా ఆచరణకు సాధ్యం కానివే ఎక్కువ. రైతు రుణాలను మాఫీ చేస్తామని ఈ రెండు పార్టీలు కూడా చెప్పుకున్నాయి. లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని తెరాస హామీ ఇచ్చింది.  ఈ పరిమితి ఎంతో తెలుగుదేశం చెప్పలేదు. గృహావసరాలకూ, పరిశ్రమలకూ 24 గంటలు, సేద్యానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తానని కూడా టీడీపీ హామీ ఇచ్చింది. తెదేపా రుణ మాఫీ హామీ ఆచరణ సాధ్యం కాదని సామాన్యులకే అర్థమవుతుంది. ఇక ప్రత్యర్థి పక్షాలకీ, ప్రజా సంఘాలకీ తెలియకుండా ఉంటుందని ఎలా అనుకుంటాం? సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం, అలాంటి రుణ మాఫీ హామీ ఇచ్చినందుకు తెలుగుదేశం మీద వెంటనే చర్య తీసుకోవలసిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర శాఖ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అన్ని రకాల వ్యవసాయ, స్వయం సేవా రుణాలను మాఫీ చేయాలంటే దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయల నిధులు కావాలి. అసలు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ మొత్తమే 1.6 లక్షల కోట్ల రూపాయలు పైనే. అన్నిపథకాలకు కలిపి కేటాయించిన ప్లాన్ బడ్జెట్ మొత్తమే 59,000 కోట్లు. ఈ నేపథ్యంలో  రుణ మాఫీ ఎలా సాధ్యమో చెప్పాలని ఆమ్‌ఆద్మీ కోరుతోంది. రైతన్నలు తీసుకున్న రుణాలలో 70 శాతం ప్రభుత్వం దగ్గర నుంచి కాకుండా, వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నవనీ, ఈ రుణాలను మాఫీ చేయడం ఎలాగో చెప్పాలనీ ఆమ్ ఆద్మీ పార్టీ నిలదీస్తోంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులలో ఎక్కువ మంది ఇలా ప్రైవేటు వ్యక్తుల నుంచి రుణాలు తీసుకున్నవారే. ఇంకా కీలకమైన ప్రశ్న- పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ రుణాల పేరిట తీసుకున్న మొత్తాలను ఏం చేస్తారు?
 
 డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతోనే ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో వ్యవసాయం గురించి చేసిన ప్రస్తావనలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రైతులకు మేలు చేసిన చరిత్ర వైఎస్‌ఆర్‌కు ఉంది. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన ఘనత కూడా ఉంది. ఆ నేపథ్యం, ఇప్పుడు ఇచ్చిన హామీలను బట్టి ఈ మేనిఫెస్టోను వేరుగానే చూడాలి. వైఎస్ కుమారుడు జగన్ ఆధ్వర్యంలో విడుదలైన మేనిఫెస్టోలో అమ్మఒడి, విద్యార్థులకు ఫీజుల మాఫీ, మహిళా స్వయం సేవా సంఘాల రుణ మాఫీ వంటి హామీల విషయంలో విభేదించడానికి ఏమీ ఉండదు. ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతన్నకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో రూ. 2,000 కోట్ల కార్పస్ నిధిని ఏర్పాటు చేస్తామని ఈ కొత్తపార్టీ చెబుతోంది. మూడు వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్ కూడా ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి వైఎస్‌ఆర్ మడమ తిప్పకుండా వ్యవహరించారు. ఐదేళ్ల పాటు ఉచితంగా విద్యుత్‌ను ఇచ్చారు. రూ. 3,000 కోట్లతో  నిధి ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణకు కృషి చేస్తామని కూడా వైఎస్‌ఆర్ సీపీ హామీ ఇచ్చింది. గిట్టుబాటు ధరలు లేక నిరంతరం కుంగిపోతున్న రైతు కోసం దీనిని ఉద్దేశించారు. ధ రల స్థిరీకరణను ఎలా సాధ్యం చేయబోతున్నారో ఇప్పుడే చెప్పడం కష్టమే. అయినప్పటికీ ఈ ఆశయంతో పడిన ఒక అడుగుగా ఈ అంశాన్ని గమనించవచ్చు. తెలుగుదేశం కూడా ఇందుకు 5,000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానని చెప్పడం ఆహ్వానించదగినదే. గిట్టుబాటు ధరల గురించి స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయడం, గిడ్డంగుల నిర్మాణం, వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటు, ప్రత్యేక విత్తన చట్టం, వ్యవసాయ యంత్రాల కొనుగోళ్లపై సబ్సిడీ వంటి అంశాలు టీడీపీ మీద పడిన రైతు వ్యతిరేక ముద్రను కొంతయినా తొలగించగలిగినవే. కానీ రైతుల సంక్షేమం విషయంలో ఆ పార్టీకి ఉన్న గత చరిత్రను బట్టి అవి అమలు కావడం మొదలయ్యే వరకు ప్రజలకు  నమ్మకం కుదరదు.
 
 అమ్మఒడి, విద్యార్థి వేతనాలు, వృద్ధాప్యపు పెన్షన్ 700/- (పెంచినది), ధరల స్థిరీకరణ నిధి, రూ. 20,000 కోట్ల డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ వంటి వాటిపై వైఎస్‌ఆర్‌సీపీ ఇప్పటికే నిశ్చితాభిప్రాయంతో ఉంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే వీటికి సంబంధించిన ఫైళ్ల మీద సంతకం చేయాలని జగన్ ఆశయంగా చెబుతున్నారు. పెండింగ్‌లో లేదా అసంపూర్తిగా ఉన్న పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ వంటి భారీ మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల పనులు, కృష్ణా, గోదావరి, పెన్న నదుల పరీవాహక ప్రాంతాలలో ముఖ్యమైన డ్రైనేజీ పనులకు ప్రాముఖ్యం ఇవ్వబోతున్నట్టు కూడా వైఎస్‌ఆర్ సీపీ ప్రకటించింది. రైతులకు సూచనలూ సలహాల కోసం 102 సర్వీసు, రెండేసి జిల్లాలకు ఒక వ్యవసాయ కళాశాల, ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాల నియంత్రణను 102కు అనుసంధానం చేస్తూ కళాశాలలకు అప్పగింత, పశు ఆరోగ్యం కోసం 103 సర్వీసు, ప్రతి జిల్లాలో శీతల గిడ్డంగి, వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్ సౌకర్యం, సేద్యానికి ఇద్దరు మంత్రులు వంటి అంశాలు కూడా చేరడం వల్ల ఈ మేనిఫెస్టోకు ప్రత్యేకత వచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోవచ్చు. కొత్త పార్టీలకు అవకాశం రావచ్చు. పార్టీ ఏదైనా రైతు సంక్షేమం మీద ఏకాభిప్రాయం ఉంటేనే ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది.    
 
 విశ్లేషణ: బలిజేపల్లి శరత్‌బాబు (వ్యాసకర్త సాగు అంశాల విశ్లేషకులు)
 

మరిన్ని వార్తలు