విభజనకు మేం వ్యతిరేకం!

5 Jan, 2014 00:44 IST|Sakshi
విభజనకు మేం వ్యతిరేకం!

స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం లేఖ

 రాష్ట్ర విభజనను సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం పునరుద్ఘాటించింది. ఈ చర్యను ఎందుకు వ్యతిరేకిస్తున్నది వివరిస్తూ శాసనసభా పక్ష నేత వైఎస్ విజయమ్మ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి శనివారం అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేలు మేకతోటి సుచ రిత, భూమా శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, గొల్ల బాబూరావు, టి.బాల రాజు, కోరుముట్ల శ్రీనివాసులు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, భూమన కరు ణాకర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలతో కలిసి విజయమ్మ మీడియాతో మాట్లాడారు. శాసనసభలో సమైక్య తీర్మానం చేసిన తర్వాతే ఇతర అంశాలపై చర్చకు అంగీకరిస్తామని ఆమె అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని యూపీఏ దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. లేఖ ప్రతులను మీడియాకు కూడా అందజేశారు. ముఖ్యాంశాలు...
 
 సమాఖ్య స్ఫూర్తికి విఘాతం
 

  •      ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం వ్యతిరేకి స్తోంది. సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించే రీతిలో ఈ నిర్ణయం ఉంది.
  •           వాస్తవాల ప్రాతిపదికగా చూస్త్తే విభజన వల్ల సీమాంధ్రకు అపార నష్టం వాటిల్లడమే కాకుండా రెండు ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఈ నిర్ణయం ఇరు ప్రాంతాల ఆర్థిక ప్రగతిని దెబ్బతీస్తుంది. నీటి కేటాయిం పుల్లో నికర జలాలను కోల్పోయి నష్టం వాటిల్లుతుంది. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతుంది. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఆంధ్ర, రాయలసీమ పారిశ్రామిక వేత్తలు హెఎండీఏ పరిధిలో అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతం ఆ స్థాయికి చేరుకోవాలంటే కనీసం 50 ఏళ్లు పడుతుంది.
  •           ఇక్కడి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ కూడా సూచించింది. విభజిస్తే, చేయని పాపానికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు 50 ఏళ్లు వెనక్కి వెళతాయని శ్రీకృష్ణ కమిషన్ తేల్చింది. గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా ప్రగతి సాధిస్తున్నది. ఈ పురోగతి కారణంగానే అభివృద్ధి దిశగా పయనిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో నిలు స్తోందని శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది.
  •           {పజల విశ్వాసాన్ని కోల్పోతూ ఒకదాని తర్వాత మరొకటన్నట్టు రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోతున్నా... అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్న ప్పటికీ విభజనపై యూపీఏ ప్రభుత్వం ఎందుకు దూకుడుగా వెళుతోంది? రాష్ట్రంలో పదేళ్లపాటు పాలించిన కాంగ్రెస్ పదవీ కాలం ముగిసిపోతున్న సమయంలో రాష్ట్రాన్ని విభజించాలని ఎందుకు నడుం బిగించింది? ప్రత్యేక తెలంగాణ కోసం ఆ ప్రాంతంలో రగిలిన భావోద్వేగాలను వాడుకోవడం ద్వారా అధికార కాంగ్రెస్ ఏవో కొన్ని సీట్లు సంపాదించవచ్చన్న దుర్బుద్ధి తోనే విభజనకు అంకురార్పణ చేసింది.
  •           కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం జరిపిన రెండు ముఖ్యమైన న్యాయ కమిషన్లు... జస్టిస్ సర్కారియా కమిషన్, జస్టిస్ పూంచ్ కమిషన్ పరిశీలనలను సైతం కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఏదైనా రాష్ట్రాన్ని విభజించడం కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని అర్టికల్ 3 ద్వారా ప్రక్రియను ప్రారంభించడానికి ముందుగా ఏదైనా కమిషన్ లేదా కమిటీని నియమించి దాని నివేదిక ప్రాతిపదికపై గానీ లేదంటే సంబంధిత అసెంబ్లీ నుంచి విభజన కోరుతూ తీర్మానం వస్తే దాని ప్రాతిపదిక మీద గానీ తదుపరి చర్యలకు ఉపక్రమించాలని ఈ రెండు కమిషన్లు చెప్పాయి.

 
 శ్రీకృష్ణ కమిషన్ నివేదికలో...
 

  •  ... విచారణ అనంతరం తేటతెల్లమైందేమంటే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉందో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న వాదన కూడా అంతే బలంగా ఉంది. రాయలసీమ ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలంటూ ఆయా ప్రాంతాలకు చెందిన వివిధ వర్గాలు చేస్తున్న డిమాండ్లను కూడా ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలుగా పరిగణించవచ్చు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రా న్ని సమైక్యంగా ఉంచాలన్న వాదనవైపే కమిషన్ మెగ్గుచూపుతోంది.
  •           విశాల జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను సమైక్య రాష్ట్రంగా కొనసాగించాలని కమిటీ సూచించింది. దృఢమైన రాజకీయ సంకల్పం, పాలనా యాజమాన్యం ద్వారా ఈ ప్రత్యామ్నాయం సర్వజన హితమైన దని, రాష్ట్రంలోని అత్యధిక ప్రజానీకానికి సంతృప్తి కరమైనదనీ ప్రజలలో విశ్వాసం కల్పించడం సాధ్యమే. విద్య, పారిశ్రామిక, ఐటీ కేంద్రంగా విరాజిల్లుతున్న హైదరాబాద్ నగర భవితవ్యంపై ఏర్పడిన అనిశ్చితిని ఈ ప్రత్యామ్నాయం ద్వారా తొలగించవచ్చు. సమన్యాయం ప్రాతిపదికపై నీరు, సాగునీటి వనరుల యాజమాన్యం కోసం వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డ్, ఇరిగేషన్ ప్రాజెక్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వంటి సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేసి, వాటి పాత్రను విస్తృత పరచాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాం. పైన తెలిపిన కార్యాచరణ ద్వారా తెలంగాణ ప్రజలు లేవనెత్తిన సమస్యలన్నింటినీ వారికి తృప్తి కలిగించే రీతిలో పరిష్కరించాలి.’
  •           జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ పది మాసాలపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రతినిధులతో సంప్రదించి, తన సిఫార్సులతో సమగ్ర నివేదికను రూపొం దించింది. ఇంత ప్రధానమైన నివేదికపై కూడా ఎలాంటి చర్చ జరపకుం డానే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి తీర్మానం కూడా లేకుండానే విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టడం దురదష్టకరం. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్‌ను ఎం దుకు నియమించినట్టు? దాని నివేదికను, సిఫార్సులను ఎందుకు విస్మరిం చినట్టు? నివేదికలో పేర్కొన్న వాస్తవాలు కేంద్ర ప్రభుత్వం ముందుగానే తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా ఉండటమే కారణమా?
  •           తెలంగాణ కంటె ముందే మొదలై ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లను పక్కనపెట్టి తెలంగాణ సమస్యను మాత్రమే పరిగణన లోకి తీసుకోవాలని కేంద్రం ఎందుకు భావించిందో అర్థంకాదు. ఉదాహర ణకు, నాగపూర్ రాజధానిగా విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందిగా 1956లోనే రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ సంఘం సిఫార్సు చేసింది. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మూడేళ్ల కిందటే తీర్మానాన్ని ఆమోదించింది. గుర్ఖాలాండ్, బోడోలాండ్ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే ఉత్తర కర్ణాటక, దక్షిణ తమిళ నాడు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. కాగా, కొత్త రాష్ట్రాల ఏర్పాటు మీద కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన కూడా ఉంది. విదర్భకు ప్రత్యేక రాష్ట్రం అంశంపై 1 ఆగస్టు 2000 రోజన కేంద్ర హోంమంత్రి పార్లమెంట్‌లో చేసిన ప్రకటన దీనిని స్పష్టం చేస్తుంది. ‘1953-54లో ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్‌సి సిఫార్సుల మేరకు భారతదేశం లోని రాష్ట్రాలను భాష ప్రాతిపదికపై పున ర్వ్యస్థీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం ఏర్పా టు సరైన చర్య అవుతుంది. వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి భిన్న మైన డిమాండ్లు ఉన్నాయి. విదర్భ ప్రాంత ప్రజలు ఒక ప్రత్యేకమైన డిమాం డ్‌ను లేవనెత్తారు. మహారాష్ట్ర ప్రజలు దానిని వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల ఈ విషయంలో మేం ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించదలచుకున్నాం. ఏ ప్రాంతం నుంచైనా వచ్చే డిమాండ్‌కు దాని సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం ఉంటేనే ఆ డిమాండ్‌ను పరిశీలించి, ఆమోదించాలని నిర్ణయిం చుకున్నాం. అంతమాత్రాన రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించే ప్రతి అంశాన్ని మేము అంగీకరిస్తామని కాదు. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అసెంబ్లీ తీర్మానం ఆ రాష్ట్ర ప్రజల అభీష్టానికి, మనోభావాలకు అద్ధంపడుతుంది’
  •           2009, డిసెంబర్ 9న అప్పటి కేంద్రహోంమంత్రి పి. చిదంబరం తెలంగాణ అంశంపై ప్రకటన చేస్తూ, రాష్ట్ర అసెంబ్లీలో తగిన తీర్మానం ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పిన విషయాన్ని గమనించాలి. ఆయన చేసిన ప్రకటన సారాంశం ఇది.. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం. అం దుకు తగిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది’ కాబట్టే, అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర సాగుతున్న విభజన ప్రక్రియను నిలిపివేయాలని ఇటీవల రాష్ట్రపతి, ప్రధానమంత్రిలకు విజ్ఞాపనలు చేశాం. తక్షణమే రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి రాష్ట్ర విభజనపై సభ ఆమోదం పొందవలసిందిగా కోరుతూ ముఖ్యమంత్రికి, స్పీకర్‌కు లేఖలు రాశాం. కానీ, ఏ సంప్రదాయాలనూ, పద్దతులనూ పాటించకుండానే విభజన ప్రక్రి య ముందుకు సాగుతోంది.
  •           రాష్ట్రంలోని 8.4 కోట్ల మంది జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అనేక అంశాలపై అర్థవంతమైన చర్చ, వాదన జరగడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టంలేదు. ఇది భవిష్యత్తులో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండానే రాష్ట్రా లను విభజించే అన్యాయమైన పద్దతికి దృష్టాంతం కాబోతుంది.

 
 అత్యధికులు వద్దంటున్నారు!
 

  •           ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధిక ప్రజలు, వారి ప్రతినిధులు విభజనను వద్దంటున్నారు.
  •           నిర్దిష్ట కారణం, ఆధారం వంటి పరిస్థితులలో  ఆర్టికల్-3ను ప్రయోగిం చడానికి కేంద్రానికి వీలుంది. దీని ప్రకారం అసెంబ్లీ తీర్మానంతోనే విభజనకు అవకాశముంటుంది.
  •           ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఆర్టికల్-3 ప్రకారం తీర్మానం చేయలేదు.
  •           ఇలా చేయడం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుకు వ్యతిరేకం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే  ఉత్తమమైనదని కమిటీ సిఫార్సు చేసింది.
  •           విభజించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.
  •           1998లో జస్టిస్ సర్కారియా కమిషన్, 2010లో జస్టిస్ పూంచ్ కమిషన్‌లు ఆర్టికల్-3 ప్రకారం కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై చేసిన పరిశీలనలో వెల్లడైన అంశాలకు కూడా ఇది విరుద్ధం.
  •           2000 ఆగస్టు ఒకటో తేదీన పార్లమెంటులో అప్పటి కేంద్ర హోం మంత్రిత్వశాఖ చేసిన విధాన నిర్ణయానికి ఈ విభజన విరుద్ధం. రెండో ఎస్సార్సీ నియామకం ద్వారా, లేదా.. సంబంధిత అసెంబ్లీ నుంచి ఏకగ్రీవ తీర్మానం ద్వారా మాత్రమే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తామ న్నది ఆ ప్రకటన సారాంశం.
  •           2010 ఫిబ్రవరి3,4 తేదీలలో లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన భోపాల్‌లో ఏర్పాటైన 74వ ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయానికి కూడా ఇది వ్యతిరేకం. రాష్ట్రాల పునర్య్వస్థీకరణ కమిషన్ సిఫార్సు మేరకే కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరగాలనేది ఆ సదస్సు చేసిన తీర్మాన సారాంశం.
  •           ఆర్టికల్ 371 డీ ఏ లక్ష్యాన్నైతే సాధించలేకపోయిందో ఆ అంశాన్ని సరిగ్గా అంచనా వేయకుండానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు పూనుకుంది.
  •           అవశేష రాష్ట్రానికి విభజన తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అన్యాయాన్ని మిగులుస్తుంది.
  •  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2004 లేదా 2009 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మానిఫెస్టోల్లో కూడా హామీ ఇవ్వలేదు. వాటిల్లో ఏం పొందుపరి చారో లేఖలో వివరించారు.
  •  అలాగే రాష్ట్రపతి ప్రసంగంలో ఏముందన్న విషయాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు.  

 
 ఉపాధికి భాగ్యనగరం
 

  •  మిగిలిన రాష్ట్రాల రాజధానుల మాదిరిగా కాకుండా గడిచిన 57 ఏళ్ల కాలం లో హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ఏరియా) ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధానిగా మాత్రమే కాకుండా ఆర్థిక, ఉపాధి కల్పనకు కేంద్ర బిందువైంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన పరిశో ధనా సంస్థలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. బీహెచ్‌ఈఎల్‌ను రాష్ట్రంలో హైదరాబాద్‌లో మంజూరు చేస్తే.. యూపీలో హరిద్వార్‌లోనూ, తమిళ నాడులో తిరుచ్చిలోనూ స్థాపించారు. హెచ్‌ఏఎల్‌ను హైదరాబాద్‌లో స్థాపి స్తే, ఒడిషాలో గిరిజన ప్రాంతమైన కోరాపుట్‌లో, మహారాష్ట్రలో నాసిక్‌లో నెలకొల్పారు.
  •           హెచ్‌ఎమ్‌టీ, బీడీఎల్, ఐడీపీఎల్, ఈసీఐఎల్, బీఈఎల్, మిధానీ, ఎన్‌ఎఫ్‌సి, ఎన్‌ఎమ్‌డీసీ, ఎన్‌ఆర్‌ఎస్‌ఎ, ఎన్‌జీఆర్‌ఐ, ఎన్‌ఎఫ్‌డీబీ, డీఎమ్‌ఆర్‌ఎల్, హెచ్‌సీఎల్, డీఎల్‌ఆర్‌ఎల్, డీఆర్‌డీఎల్, సీసీఎమ్‌బీ, ఐఐసీటీ, డీఆర్‌డీఓ సంస్థలు కూడా హైదరాబాద్‌లోనే నెలకొల్పారు. వీటి యూనిట్లు ప్రైవేట్ సెక్టార్‌లో గ్లోబల్ యూనిట్లుగా మారాయి. 90శాతం పైగా ప్రైవేట్ పెట్టుబడులు సీమాంధ్ర ప్రాంతం నుంచే వచ్చాయి. ఆ కారణంగా రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు వ్యవసాయ ఆధారిత ప్రాంతా లుగానే మిగిలిపోయాయి.
  •           ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఎస్‌బీ, ఐఐఐటీ, ఐఐఎఫ్‌టి, నల్సర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, బిట్స్, టీఐఐఎస్, టీఐఎఫ్‌ఆర్, వైద్య సంస్థలు కూడా హైదరాబాద్ పరిసరాలలో కేంద్రీకతమయ్యాయి. భారతదేశంలోనే ఒక ఏడాదిలో అత్యధిక చిత్రాలు నిర్మించే తెలుగు సినిమా పరిశ్రమ కూడా ఇక్కడే ఉంది.
  •           హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నందున రాష్ట్ర ఆదాయం మొత్తం 75 శాతం తెలంగాణ ప్రాంతం నుంచి లభిస్తున్నట్టు లెక్క. కానీ తెలంగాణ జనాభా రాష్ట్రంలో నలభై శాతమే.
  •           రాష్ట్ర ఆదాయంలో అమ్మకం పన్ను (వ్యాట్) ద్వారా వసూలు అయ్యేది సుమారు 65 శాతం. 2008-09 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అమ్మకం పన్ను కింద రూ.22 వేల కోట్లకు పైబడి జమైంది. ఇందులో 75 శాతం మొత్తాలు హైదరాబాద్ నుంచే వచ్చాయి. సీమాంధ్ర నుంచి 15 శాతం, హైదరాబాద్ మినహా తెలంగాణలో 8 శాతం ఉండగా, రాయలసీమలో అది 3 శాతమే ఉందని జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ తేల్చింది.
  •           విభజన జరిగితే, 2012-13 లో వసూలైన అమ్మకం పన్ను ప్రాతిపదికగా పరిగణిస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం వసూళ్లలో కేవలం 25-30 శాతంతోనే సీమాంధ్ర ప్రాంతం సరిపెట్టుకోవలసి ఉంటుంది. విభజన తర్వాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయంలో 25-30 శాతం మాత్రమే పొందగల ఈ అవశేష రాష్ట్రం అప్పులు మాత్రం 60 శాతం జనాభా ప్రాతిపదికన పంచు కోవాలి. ఇది ఆ రాష్ట్ర ప్రజలకు చావుదెబ్బ కాదా? ఒక రాష్ట్రం ఆదాయాన్ని మరో రాష్ట్రానికి పంచడానికి రాజ్యాంగపరమైన ఎలాంటి అధికారం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 కింద కేవలం కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని మాత్రమే రాష్ట్రాలతో పంచుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి అవశేష రాష్ట్రం ఎక్కడికి పోవాలి? జనాభా ఆధారంగా పంచిన రుణాలను చెల్లించడానికి ఏం చేయాలి?
  •           1991 తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం తీసు కుని ప్రభుత్వ రంగంలో పెట్టుబడులను నిలిపేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రంలో బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, ఎన్‌ఎఫ్‌సీ, బీఈఎల్, బీడీఎల్, డీఎంఆర్‌ఎల్, డీఆర్‌డీఎల్, డీఆర్‌డీవో, హెచ్‌సీఎల్, మిధాని, హెచ్‌ఏఎల్, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ తదితర కేంద్ర సంస్థలు ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, 60 శాతం వ్యాపారం కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వగలదా? సీమాంధ్రకు పుండు మీద కారం చల్లినట్టుగా ఇప్ప టికే సాఫ్ట్‌వేర్ పరిశ్రమ వేళ్లూనుకున్న హైదరాబాద్‌కే కేంద్రం ఐటీఐఆర్‌ను మంజూరు చేసింది.

 
 నీళ్ల సంగతేమిటి?
 

  •       నదీ జలాల పంపిణీపై ప్రస్తుతం నిర్ణీత వ్యవస్థలేదు. సమైక్య రాష్ట్రానికి నదీ జలాల విడుదలపై ఇన్ని ట్రిబ్యునల్స్, బోర్డులు ఉన్నప్పటికీ పై రాష్ట్రాల అవసరాలు తీరితే తప్ప నీటిని విడిచిపెట్టడంలేదు. మహారాష్ట్ర తన అవసరాలు తీరిన తర్వాత కర్ణాటకకు నీటిని విడుదల చేస్తోంది. అక్కడ నారాయణపూర్, ఆలమట్టి డ్యాంలు నిండితే తప్ప కింద ఉన్న మనకు నీరు రావడంలేదు. ఇక విభజన జరిగి మధ్యలో మరోరాష్ట్రం వస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. తెలంగాణ ప్రాంతంలో రెండున్నర జిల్లాలు ఉన్న కృష్ణా ఆయకట్టును ప్రభుత్వం ఎలా విడదీయగలదు. కృష్ణా ఆయకట్టు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లోని ఎనిమిదిన్నర జిల్లాలో విస్తరించి ఉంది. ఇది రోజూ నీటి యుద్ధాలకు దారితీయదా?
  •           పోలవరం విషయానికి వస్తే భద్రాచలం రెవెన్యూ డివిజన్, కుక్కునూరు మండలం, వేలేరుపాడు మండలం, గణపవరం, రాయీగూడెం, బూర్గుం పాడు, మండలంలోని శ్రీధర గ్రామాలు ముంపునకు గురవుతాయి. తెలం గాణ నుంచి నీటిని విడుదల చేయకపోతే పోలవరానికి నీరెలా వస్తుంది?
  •           ఎస్సార్సీ సిఫారసు మేరకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో మూడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడగా, హైదరాబాద్ రాష్ట్రంతో పాటు పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. ఎస్సార్సీ నివేదికను 1955 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకూ అసెంబ్లీ చర్చిం చింది. 175 మంది సభ్యులలో 147 మంది తమ అభిప్రాయాలను వెల్లడిం చారు. ఇందులో 103 మంది విశాలాంధ్రను, 29 మంది స్వతంత్ర హైదరా బాద్‌ను సమర్థించగా, 15 మంది తటస్థంగా ఉండిపోయారు. మిగిలిన రాష్ట్రాలలో 59 మంది విశాలాంధ్రకు మద్దతు పలకగా, 25 మంది ప్రత్యేక హైదరాబాద్‌కు మద్దతు తెలిపారు. ఒకరు తటస్థంగా ఉన్నారన్న విషయం జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ పొందుపరిచింది. ఇంతపెద్ద మెజారిటీతో హైదరా బాద్‌ను ఆంధ్రప్రదేశ్‌లో కలవాలని ఆకాంక్షించగా, బలవంతంగా జరిగిం దని అనడం ఎంతవరకు సమంజసం?
  •           హైదరాబాద్‌ను పదేళ్ల పాటు మాత్రమే రాజధానిగా కొనసాగించుకునే అవ కాశాన్ని కేంద్రం ఆంధ్ర ప్రాంతానికి కల్పించింది. పదేళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని నగరాన్ని నిర్మించుకోవడం సాధ్యమేనా? 60 ఏళ్ల పాటు శ్రమించి నిర్మించుకున్న ఇంటిలోనే పదేళ్లపాటు అద్దెకు ఉండాల్సిన అగత్యా న్ని కేంద్రం సీమాంధ్ర ప్రాంతానికి కల్పించింది.
  •           57 ఏళ్ల అనంతరం రాష్ట్రాన్ని విభజించడాన్ని తెలంగాణ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. విభజనకు ప్రాంతీయ వాదాన్ని ప్రాతిపదికగా తీసుకుం టే 1947 కంటె ముందున్న వాటికంటే ఎక్కువ ప్రాంతాలు ఏర్పాడుతాయి.

 
 ముగింపు...
 
 రాష్ట్రం ఏర్పడిన 57 ఏళ్ల తర్వాత ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశంలోనే పలు విపరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఒక ప్రాంతంలోని ప్రజల మనోభావాలను ప్రాతిపదికగా చేసుకుని మెజారిటీ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయిస్తే చివరకు భారతదేశం చీలిక పేలికలై 1947 కు పూర్వం కంటే ఎక్కువ ప్రాంతాలు ఏర్పడి... దేశ సమైక్యతకు సమగ్రతలకే ముప్పు దాపురించడం తథ్యం. రాష్ట్రాన్ని విభజించడం కంటె ప్రాంతీయ వాదాలను గౌరవిస్తూ ఆయా ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తూ ముందుకు సాగాలి. అందువల్ల రాష్ట్ర విభజన విషయాన్ని రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి, ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా పరిగణించి విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నాం.
 
 ఇట్లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
 
 
 

మరిన్ని వార్తలు