బీజేడీ, కాంగ్రెస్‌ మాటల యుద్ధం

28 Sep, 2017 03:57 IST|Sakshi

వేడెక్కిన బిజేపూర్‌ ఉప ఎన్నిక

వ్యూహాల్లో ప్రతిపక్షాలు

విపక్షాలకు అభ్యర్థి కరువు

భువనేశ్వర్‌: బిజేపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే సుబొలొ సాహు మరణానంతరం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు నిత్యకృత్యంగా మారింది. బిజేపూర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ చేతి నుంచి అధికార పక్షం బిజూ జనతా దళ్‌కు హస్తగతమైనట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిజూ జనతా దళ్, కాంగ్రెస్‌ పార్టీల మధ్య వాగ్యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల నాయకులు మాటల తూటాలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బిజూ జనతా దళ్‌ ఉపాధ్యక్షుడు, సిటింగ్‌ మంత్రి సూర్య నారాయణ పాత్రో, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, పీసీసీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ల మధ్య బుధవారం తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.  

అధోగతిలో కాంగ్రెస్‌ పార్టీ
నాయకత్వ లోపంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌  పార్టీ తునాతునకలైంది. అతి త్వరలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఛాయ లేకుండా పోతుందని బిజూ జనతా దళ్‌ ఉపాధ్యక్షుడు, సిటింగ్‌ మంత్రి సూర్య నారాయణ పాత్రో ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితులకు బిజేపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ తార్కాణంగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిష్టాత్మకంగా చలామణి అయిన పశ్చిమ ఒడిశాలోని బర్‌గడ్‌ జిల్లా బిజేపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ ఖాతా శాశ్వతంగా మూతబడింది. ఆ పార్టీ దివంగత నాయకుని కుటుంబీకులతో పాటు పార్టీ అనుచరులు విశేష సంఖ్యలో అధికార పక్షం బిజూ జనతా దళ్‌లో చేరిన విషయం  తెలిసిందే. అరకొరగా బిజేపూర్‌ అసెం బ్లీ సెగ్మెంట్‌ కాంగ్రెస్‌ గూటిలో మిగిలిన వారు కూడా అతి త్వరలో బీజేడీ గూటికి తరలి వస్తారు. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ శిబిరం ఖాళీ అవడం తథ్యమని సూర్యనారా యణ పాత్రో స్పష్టం చేశారు.    బిజేపూర్‌ అసెంబ్లీ ని యోజకవర్గం ఉప ఎన్నికలో బీజేడీ గెలుపు తథ్యమని ఆయన ముందస్తుగా ధీమా వ్యక్తం చేశారు.  

పాత్రోది పొరబాటు  
అధికార బిజూ జనతా దళ్‌ నాయకుడు సూర్య నారాయణ పాత్రో పొరబడ్డారని పీసీసీ మాజీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ ఎదురు తిరిగారు.  ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పార్టీ అధ్యక్షునిగా కొనసాగినంత కాలమే బిజూ జనతా దళ్‌ డాంబికాలు. ఆయన తర్వాత ఆ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది. మరో 2, 3 ఏళ్లలో నవీన్‌ పట్నాయక్‌ అధ్యక్ష పదవి నుంచి విరామం పొందుతారు. ఆ తర్వాత బీజేడీని ముందుకు నడిపించే నాథుడు లేడు. ఆయన తర్వాత బీజేడీ నుంచి ప్రతి ఒక్కరు మాతో (కాంగ్రెస్‌) లేదా భారతీయ జనతా పార్టీ శిబిరానికి చేరి పబ్బం గడపాల్సిన రోజులు పొంచి ఉన్న విషయాన్ని మంత్రి సూర్య నారాయణ పాత్రో గుర్తించకుండా మాట జారుతున్నారని నిరంజన్‌ పట్నాయక్‌ అన్నారు.   చారిత్రాత్మక పార్టీగా కాంగ్రెస్‌ ఎప్పుడూ గుర్తింపును కోల్పోయే పరిస్థితే లేదన్నారు. ఒడిదుడుకుల్ని సమర్థంగా ఎదుర్కొని పాలనా పగ్గాలు చేపట్టిన అనుభవాలు కోకొల్లలుగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రతిపక్షాల అభ్యర్థిపట్ల ఉత్కంఠ
బిజేపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక విపక్షాలకు పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిటింగ్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు దివంగత సుబొలొ సాహు మరణానంతరం ఆయన కుటుంబీకుల్ని బిజూ జనతా దళ్‌లో విలీనం చేసి సుబొలొ సాహు భార్యకు పార్టీ టికెట్‌ కేటాయిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. దీంతో పార్టీ తరఫున బిజేపూర్‌ ప్రతిష్టాత్మక ఉప ఎన్నికలో బీజేడీ అభ్యర్థిని ముందస్తుగా స్పష్టం చేశారు. తదుపరి కార్యాచరణ అంతటినీ జిల్లా పర్యవేక్షకులు, అగ్ర శ్రేణి నాయకుల భుజస్కంధాలపై పెట్టి నవీన్‌ పట్నాయక్‌ ధీమాగా ఉన్నారు. అధికార పక్షంతో సానుభూతి వ్యూహంపై గురిపెట్టడంతో  ఉభయ ప్రతిపక్షాలు కంగు తిన్నాయి. సానుభూతి అస్త్రం అధికార పక్షం బిజూ జనతా దళ్‌ పొదికి చేరింది. తదుపరి కార్యాచరణ ఏమిటో ప్రతిపక్షాల శిబిరం నుంచి అస్పష్టంగా కనిపిస్తోంది. సుబొలొ సాహు భార్యతో తలపడి విజయావకాశాలు కలిగిన దీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు అభ్యర్థి అన్వేషణలో పడ్డాయి. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి అధికార పక్షానికి నీళ్లు తాగించిన అశోక్‌ పాణిగ్రాహిని ఈసారి భారతీయ జనతా పార్టీ బరిలోకి దింపేందుకు దాదాపు రంగం సిద్ధం చేసినట్లు పరోక్షంగా తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పరిశీలనలో ముగ్గురు
రాష్ట్ర కాంగ్రెస్‌ కూడా ముగ్గురు ఔత్సాహిక అభ్యర్థుల పేర్లను పార్టీ హై కమాండ్‌కు సిఫారసు చేసింది. పార్టీ అధిష్టానం ఆమోదం కోసం రాష్ట్ర కాంగ్రెస్‌ నిరీక్షిస్తోంది. బిజేపూర్‌ ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు పెను సవాల్‌గా నిలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా సుబొలొ సాహు వరుస విజయాలు సాధించారు. ప్రజల్లో విశేష ఆదరణ సాధించారు. ఆయనపట్ల ఉన్న ప్రజాదరణను పార్టీపరంగా కాంగ్రెస్‌ ఎంతవరకు సానుకూలంగా మలచుకుంటుందోననే ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతోంది.  
 

మరిన్ని వార్తలు