సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్‌సెల్‌

4 Sep, 2018 16:43 IST|Sakshi
గ్రీవెన్స్‌సెల్‌కు హాజరైన ఫిర్యాదిదారు ఎస్‌.చంద్రశేఖర్‌రావు 

పర్లాకిమిడి : సమస్యలు పరిష్కరిచేందుకే గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ అనుపమ సాహా అన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా అధికారుల ఆధ్యర్యంలో సోమవారం గీవెన్స్‌సెల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి సమస్యను నిశితంగా పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలోని గుసానినువగాం, పర్లాకిమిడి తహసీల్దార్‌ పరిధిలోని పలు గ్రామాల నుంచి వినతులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఆయా గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యల గురించి మొత్తం 77 వినతులు అందాయని, వీటిలో వ్యక్తిగత ఫిర్యాదులకు సంబంధించి 58, ఇతర ఫిర్యాదులకు సంబంధించి 18 వినతులు వచ్చాయని వివరించారు. వీటిల్లో ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు ఇద్దరు వ్యక్తులు దరఖాస్తు చేసుకోగా, రెడ్‌క్రాస్‌ సహాయం కోసం మరొకరు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 

పీఎఫ్‌ ఖాతాపై ఫిర్యాదు

అలాగే స్థానిక మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల నుంచి పీఎఫ్‌ (ప్రావిడెంట్‌ ఫండ్‌) కోసం వసూలు చేసిన సొమ్ము తమ ఖాతాలో జమ చేయలేదంటూ భువనేశ్వర్‌కు చెందిన అభిరాం కేర్‌ టేకింగ్‌ అండ్‌ ఎక్స్‌పర్ట్‌ సర్వీసస్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు భవననిర్మాణంలో క్షతగాత్రుడైన స్థానిక ఎస్పీ వీధికి చెందిన ఎస్‌.చంద్రశేఖర్‌కు ప్రకటించిన ఆర్థికసాయం రూ.4లక్షలు ఇంతవరకు అందలేదన్నట్లు ఒక ఫిర్యాదు అందిందని అధికారులు తెలిపారు.

గ్రీవెన్స్‌సెల్‌ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అనుపమ సాహాతో పాటు సబ్‌కలెక్టర్‌ వీరేంద్ర కొరకొరా, తహసీల్దార్‌ కేదార్‌నాథ్‌ భయి, సీడీఎంఓ డాక్టర్‌ పాణిగ్రాహి, సబ్‌కలెక్టర్‌ రజనీకుమార్‌ స్వంయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు