ఎన్నారై భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష

27 Jan, 2019 10:34 IST|Sakshi
భర్త ఇంటి ముందు నిరసన వ్యక్తం చే స్తున్న శిరీష 

పాతపట్నం: ఎన్నారై భర్త మోసం చేశాడంటూ భార్య మౌన పోరాటం చేసిన సంఘటన పాతపట్నం ఎస్సీ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలంలోని హరిజన గోపాలపురం గ్రామానికి చెందిన పట్నాల సింహాద్రి, భారతిల కుమార్తె శిరీషకు పాతపట్నం ఎస్సీ కాలనీకు చెందిన సాన ధర్మపురి, విజయల కుమారుడు సాన గౌరీశంకర్‌తో 2016లో వివాహం జరిగింది.

గౌరీశంకర్‌లో బ్యాంకాక్‌లో పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో రూ.5 లక్షలు, 5 తులాల బంగారం, ఇతర వస్తువులు కానుకగా ఇచ్చారు. పెళ్లయిన నెల రోజుల నుంచే అదనపు కట్నం కావాలంటూ అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. రెండు నెలలు గడిచిన తర్వాత శిరీషను బ్యాంకాక్‌ తీసుకెళ్లిన గౌరీశంకర్‌ 15 రోజుల అనంతరం భార్యను ఒంటరిగా పాతపట్నం పంపించేశాడు. అప్పటి నుంచి శిరీష కన్నవారింట్లోనే ఉంటుంది.

గౌరీశంకర్‌ మాత్రం పాతపట్నం రాకుండా విదేశాల్లోనే ఉంటున్నాడు. ఎప్పటికీ భర్త రాకపోవడంతో శిరీష శనివారం తన మూడేళ్ల కుమారుడు సుజిత్‌ శంకర్‌తో కలిసి మౌనదీక్షకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న అత్తమామలు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయని, పోలీసులు స్పందించి తన భర్త పాతపట్నం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడింది.

మరిన్ని వార్తలు