ఏసీ కోచ్‌లో నాగు పాము

7 May, 2018 10:58 IST|Sakshi

భువనేశ్వర్‌: రైలు ప్రయాణం అడుగడుగునా ప్రమాదకరంగా మారిందంటే అతిశయోక్తి కాదు.   నిన్న మొన్నటి వరకు రైలు బోగీల్లో బొద్దింకలు, ఎలుకలు వంటి సాధారణ కీటకాలు, చిరు జంతువులు ప్రత్యక్షం కావడంపట్ల ప్రయాణికులు అలవాటు పడ్డారు. తాజాగా రైలు ఎయిర్‌ కండిషన్‌ ద్వితీయ శ్రేణి బోగీలో నాగుపాము ప్రత్యక్షం కావడం సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది. ఈ దుమారం కథనం ఇలా ప్రసారంలో ఉంది. ఈ సంఘటన పూర్వాపరాల్ని రైల్వే శాఖ పర్యవేక్షిస్తోంది.18507 విశాఖపట్నం–అమృతసర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ద్వితీయ శ్రేణి ఎయిర్‌ కండిషన్‌ బోగీలో నాగుపాము గలాటా సృష్టించింది. ఎ–1 బోగీ 32వ నంబరు బెర్తు కింద పాము తారసపడింది. 

ఈ బెర్తులో భువనేశ్వర్‌ నుంచి అంబాలా వెళ్లేందుకు ఓ యువతి బయల్దేరింది. రైలు ఢిల్లీ నుంచి బయల్దేరిన తర్వాత తనపైకి ఏదో పాకుతున్నట్లు అనిపించి చూడబోతే సాక్షాత్తు నాగు పాము కావడంతో పిడికిట్లో ప్రాణాలు పెట్టుకుని తనకి అందుబాటులో ఉన్న కంబళిని నాగుపాముపై రువ్వి హఠాత్తుగా బెర్తు నుంచి కిందకు దూకి మిగిలిన ప్రయాణం పూర్తి చేసింది. వేరే చోట తోటి ప్రయాణికులతో సర్దుకుని అంబాలా గమ్యం చేరింది. గమ్యం చేరిన భయంతో బిక్కచచ్చిన యువతి కిందకు దిగలేని పరిస్థితిలో డీలాపడినట్లు కుటుంబీకులు గుర్తించారు. ఆమెకి చేయూతనిచ్చి రైలునుంచి దించాల్సి వచ్చిందని యువతి తండ్రి సోషల్‌ మీడియాలో ఆదివారం ప్రసారం చేశాడు. 

మరిన్ని వార్తలు