యువకుడి దారుణ హత్య..?

15 Sep, 2018 16:58 IST|Sakshi

మృతుడి తలపై తీవ్రగాయాలు 

ఆయుధంతో మోది చంపేసి ఉంటారని అనుమానం..

ప్రశాంతంగా ఉండే డెంకాడ మండలం ఉలిక్కిపడింది. పెదతాడివాడ పంచాయతీ ఊడికలపేట సమీపంలో ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. మృతుడి తలపై తీవ్రగాయాలు ఉండడంతో ఎవరో హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇటువంటి సంఘటనలు జరగకపోవడం.. ఒక్కసారిగా హత్య జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

విజయనగరం / డెంకాడ: మండలంలోని పెదతాడివాడ పంచాయతీ ఊడికిలపేట గ్రామ సమీపంలో విజయనగరం–కుమిలి ఆర్‌అండ్‌బీ రహదారికి ఆనుకుని ఉన్న ఒక లే అవుట్‌కు వెళ్లే  దారిలో ఓ వ్యక్తి మృతదేహం పడి ఉంది. దీంతో సమీప గ్రామప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ మృతదేహాన్ని నెల్లిమర్ల మండలం సతివాడ పంచాయతీ పరిధిలోని ముల్లుపేట గ్రామానికి చెందిన ఆబోతుల శ్రీరామ్‌(32)దిగా  గుర్తిం చారు.   మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సతివాడ పంచాయతీ ముల్లుపేట గ్రామానికి చెందిన ఆబోతుల శ్రీరామ్‌ ఈనెల 12వ తేదీ రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో సతివాడ కూడలిలో స్నేహితులతో కలిసి ఉన్నారు. అక్కడకు కొద్ది సేపటికి బయటకు వెళ్తానని స్నేహితులకు చెప్పి వెళ్లిపోయాడు.

 సమయం మించినా భర్త ఇంటికి చేరుకోకపోవడంతో శ్రీరామ్‌ భార్య కాంతమ్మ రాత్రి పది గంటల సమయంలో ఫోన్‌ చేయగా, పనిపై విజయనగరానికి వచ్చానని శ్రీరామ్‌ బదులిచ్చాడు. అయితే ఫోన్‌ చేసి గంట దాటినా ఇంటికి చేరుకోకపోవడంతో భార్య కాంతమ్మ శ్రీరామ్‌కు మళ్లీ ఫోన్‌ చేసింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా శ్రీరామ్‌ లిఫ్ట్‌ చేయలేదు. మరుచటి రోజు పోలీసులు ఫోన్‌ చేసి పెదతాడివాడలోని ఊడికిలపేట సమీపంలో శ్రీరామ్‌ శవమై పడి ఉన్నాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భా ర్య తోపాటు ఇద్దరు పిల్లలు చందన (5), ప్రమీల (3) ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మృతదేహాన్ని పరిశీలించిన పోలీస్‌ అధికారులు..
శ్రీరామ్‌ మృతదేహాన్ని విజయనగరం డీఎస్పీ డి. సూర్యశ్రవణ్‌కుమార్, భోగాపురం సీఐ రఘువీర్‌విష్ణు, డెంకాడ ఇన్‌చార్జ్‌ ఎస్సై ఉపేంద్ర   పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌ బృందాన్ని రప్పించి వివరాలు ఆరా తీశారు. మృతుడి తలపై తీవ్ర గాయం ఉండడం.. ద్విచక్ర వాహనానికి దూరంగా మృతదేహం పడి ఉండడాన్ని చూస్తుంటే ఎవరో కావాలనే హత్యచేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

మృతుడు ఆటో డ్రైవర్‌
మృతుడు శ్రీరామ్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ పైడిభీమవరం ప్రాంతంలో ఉన్న కెమికల్‌ కంపెనీలకు కూలీలను తీసుకువెళ్తుంటాడు. అలాగే ఆయా కంపెనీల్లోని కాంట్రాక్టర్లకు లేబర్‌ మేస్త్రీగా కూడా వ్యవహరిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఎవరితోనైనా విబేధాలు చోటుచేసుకోవడం వల్ల హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు