లీకేజీలతో తాగునీటి కష్టాలు

21 Mar, 2018 17:21 IST|Sakshi
గాంధీనగర్‌లో నీరు లీకేజీ అవుతున్న దృశ్యం

నీటి కోసం కిలోమీటర్లు వెళ్తున్న వైనం

ఇబ్బందుల్లో ప్రజలు 

పట్టించుకోని అధికారులు 

గోదావరిఖనిటౌన్‌ : రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 12 డివిజన్‌లో నీటి కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఎండలు ముదరకముందే నీటి కష్టాలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో అని స్థానికి ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఏర్పాటు చేసిన తాగు నీటి పైపులు చాలా చోట్ల లీకేజీ కావడంతో నీరు లీకేజీ అవుతోంది.

దీంతో ఇక్కడి ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందడం లేదు. దూర ప్రాంతాల నుంచి తాగు నీరు తెచ్చుకుంటున్నామని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సర కాలం నుంచి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలందరికీ తాగునీరు అందించాలని కోరుతున్నారు.

 నీటి కలుషితం..
తాగు నీటి పైపులు లీకేజీ కావడంతో బురద, మట్టి, ఇతర కాలుష్య వస్తువులు కలవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల కొంతమంది డయేరియా, ఇతర వ్యాధుల బారిన పడ్డామని స్థానికులు అంటున్నారు. లీకేజీలు అరికట్టి స్వచ్చమైన తాగునీరు అందించాలని వేడుకుంటున్నారు. అధికారులు, పాలకులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

సంవత్సరాలు గడిచినా పట్టించుకోవడం లేదు
తాగు నీటి పైపులు లీకేజీ అవుతున్నాయని సంవత్సరాల నుంచి అధికారులకు, పాలకులకు వినతి పత్రాలు అందించినా పట్టించుకోవడం లేదు. నీటి కాలుష్యంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి.      

 –   బొద్దుల నరేందర్‌

తాగునీటి కోసం రోజూ ఇబ్బందే..
తాగు నీటి కోసం ప్రతి రోజూ ఇబ్బంది పడుతున్నాం. ప్రతి రోజు 5 కిలోమీటర్ల నుంచి తాగు నీరు తెచ్చుకుంటున్నాం. నీరు తెచ్చుకోవడం దిన చర్యలో భాగమైంది. ఎండా కాలంలో మరింత ఇబ్బంది పడుతున్నాం. కాలుష్యం లేని నీరు అందించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలి.                 
– రాజేశం, స్థానికుడు

మరిన్ని వార్తలు