రాబందులు 'మండేలా' ఆస్పత్రిని వదిలి వెళ్లండి!

2 Jul, 2013 10:48 IST|Sakshi
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చికిత్స పొందుతున్న ప్రిటోరియా ఆస్పత్రి ప్రాంతాన్ని మీడియా వదిలి వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. ఆస్పత్రి వద్ద మీడియా తీరుపై మండేలా కూతురు గురువారం మండిపడిన తర్వాత మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించడం గమనించాల్సిన విషయం. మెడి క్లినిక్ హార్ట్ ఆస్పత్రి వద్ద పార్క్ స్ట్రీట్ ప్రవేశ ద్వారానికి వెలుపల ఉన్న తమ కార్లను గంటలోపు తీసి వేయాలని రిపోర్టర్లకు ఆదేశించారు.
 
ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లే సీలీయర్ స్ట్రీట్ ద్వారం కూడా ఇప్పటికే మూసివేశారు. ఆస్పత్రి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మీడియా కార్లు భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా మీడియా సంస్థలు నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. 21 రోజుల క్రితం మండేలాను ఆస్పత్రిలో చేర్పించనప్పటి నుంచి మీడియా వాహనాలు అక్కడే వేచి ఉన్నాయి.
 
ప్రవేశ ద్వారం వద్ద మీడియా వాహనాలు ఆస్పత్రి ముందు వేచి ఉండటాన్ని మండేలా కూతురు మాకాజైవే తప్పుపడుతూ..మీడియాను రాబందులతో పోల్చిన సంగతి తెలిసిందే.
 
మండేలా ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ఇదే దారిని మండేలా కుటుంబం, ప్రభుత్వ అధికారులు, అధ్యక్షుడు జకోబ్ జ్యూమాలు ఉపయోగిస్తున్నారు. దక్షిణాఫ్రికా సంస్కృతిని, కుటుంబ మనోభావాల్ని విదేశీ మీడియా దెబ్బ తీస్తోందని మాకాజైవే విమర్శించారు. 
 
>
మరిన్ని వార్తలు