దక్షిణాఫ్రికా 124 ఆలౌట్‌

22 Jul, 2018 01:26 IST|Sakshi

స్పిన్నర్ల ధాటికి  కుప్పకూలిన సఫారీలు

తిప్పేసిన ధనంజయ, పెరీరా

శ్రీలంక ఆధిక్యం 365  

కొలంబో: తొలి టెస్టులో శ్రీలంక స్పిన్నర్ల ధాటికి ఘోర పరాభవం మూటగట్టుకున్న దక్షిణాఫ్రికా రెండో టెస్టులోనూ అదే బాటలో పయనిస్తోంది. లంకతో ఇక్కడ జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 34.5 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి మ్యాచ్‌పై పట్టు సాధించింది. గుణతిలక (61; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కరుణరత్నే (59 బ్యాటింగ్‌; 8 ఫోర్లు) రాణించారు. కేశవ్‌ మహరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. మరో ఏడు వికెట్లు చేతిలో ఉన్న లంక ప్రస్తుతం 365 పరుగుల ఆధిక్యంలో ఉంది. కరుణరత్నేతో పాటు మాథ్యూస్‌ (12 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 277/9తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక 104.1 ఓవర్లలో 338 పరుగులు చేసింది.

అఖిల ధనంజయ (43 నాటౌట్‌; 7 ఫోర్లు), హెరాత్‌ (35) పదో వికెట్‌కు 74 పరుగులు జతచేశారు. చివరి వికెట్‌ కూడా మహరాజ్‌ ఖాతాలోకి వెళ్లింది. దీంతో అతను 9/129తో స్పెల్‌ ముగించాడు. దక్షిణాఫ్రికా జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసిన అనంతరం ఆ దేశ బౌలర్‌ అత్యుత్తమ గణాంకాలివే. ఆ తర్వాత సఫారీలు లంక స్పిన్నర్లు పెరీరా (4/40), అఖిల ధనంజయ (5/52) ధాటికి విలవిల్లాడారు. ఏ ఒక్కరూ ఎదురు నిలిచే ప్రయత్నం చేయకపోవడంతో ఆ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే కుప్పకూలింది. డు ప్లెసిస్‌ (48; 8 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. మార్క్‌రమ్‌ (7), ఎల్గర్‌ (0),  ఆమ్లా (19), బవుమా (11) నిరాశపరిచారు. 

మరిన్ని వార్తలు