ఊహకందని పరిణామాలు.. ముంబైకి రెబెల్‌ ఎమ్మెల్యేలు!

6 Jul, 2019 20:35 IST|Sakshi
కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయినట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా 11 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖల్ని స్పీకర్‌ కార్యాలయంలో అందజేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరింది. రాజీనామా లేఖల్ని సమర్పించిన ఎమ్మెల్యేలు అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టాన దూతలు రంగంలోకి దిగి.. రెబెల్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించేప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, వారికి అందుబాటులో ఉండకుండా రాజీనామా చేసిన వారిలో 10 మంది ఎమ్మెల్యేలు ముంబైకి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లడం గమనార్హం. రాజీనామా చేసిన వారిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ఎస్టీ సోమశేఖర్‌, మునిరత్న మాత్రం బెంగళూరులోనే ఉండిపోయారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ముంబైలో క్యాంపు వేయడం బీజేపీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. 

అధికారం ‘చే’జారే పరిస్థితి..!
ఊహకందనంత వేగంగా రాష్ట్రంలో అధికారం చేజారిపోయే పరిస్థితి రావడంతో కాంగ్రెస్ పార్టీ షాక్‌కు గురైంది. ఊహించని పరిణామాలతో ఆ పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దినేశ్‌ గండూరావ్ రాష్ట్రంలో లేని సమయంలో ముంచుకొచ్చిన ఈ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్‌ పెద్దలు రంగంలోకి దిగారు. ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ హుటాహుటిన స్పీకర్ ఆఫీస్‌కి చేరుకుని ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ప్రయత్నం చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ వెంటనే బెంగళూరు వచ్చి.. సీఎల్పీ లీడర్‌ సిద్ధరామయ్య, డీకే శివకుమార్, ఇతర అందుబాటులో ఉన్న నాయకులతో అత్యవసరంగా భేటీ అయ్యి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

వ్యూహాత్మంగా పావులు కదుపుతున్న బీజేపీ
కర్ణాటకలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ వ్యూహాత్మంగా పావులు కదుపుతోంది. 105మంది సభ్యుల బలంతోనే ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు పథక రచన చేసింది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మ్యాజిక్ ఫిగర్‌ని 105కు తగ్గించి.. అతిపెద్ద పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేల రాజీనామాలని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224మంది సభ్యులున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 105, కాంగ్రెస్‌ 79, జేడీఎస్‌ 37, ఇతరులు 3  గెలుచుకున్నారు. కాంగ్రెస్ జేడీఎస్‌ కూటమికి 117మంది ఎమ్మెల్యేల బలముంది. అయితే ఆనంద్ సింగ్ రాజీనామా ఆమోదంతో కూటమి బలం 116కు పడిపోయింది. ఇప్పుడీ 13మంది రాజీనామాలనూ స్పీకర్‌ ఆమోదిస్తే కూటమి బలం 103కి పడిపోతుంది. దీంతో సీఎం కుమారస్వామి బలనిరూపణ చేసుకోవాల్సి వస్తుంది.  సభలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య ఆధారంగా బలనిరూపణలో గట్టెక్కి అధికారం దక్కించుకోవడమే బీజేపీ ప్లాన్‌ అంటున్నారు విశ్లేషకులు.

14మంది ఎమ్మెల్యేల రాజీనామా!
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో సంకీర్ణ సర్కార్ విఫలమైనందునే.. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశామని జేడీఎస్‌ నేత హెచ్‌ విశ్వనాథ్ ప్రకటించారు. ఇందులో ఎవరి బలవంతంలేదన్నారు. రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్‌ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకూ 14మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని తెలిపారు. ఈ వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి సంబంధంలేదని స్ఫష్టంచేశారు. మంగళవారంలోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపట్టాలని గవర్నర్‌ని కోరినట్టు విశ్వనాథ్ తెలిపారు. ఇక, పార్టీలో నిర్లక్ష్యానికి గురైనట్టు భావించే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి తెలిపారు. రాష్ట్రప్రభుత్వాన్నిగాని, హైమాండ్‌ని గాని.. ఎవరినీ తాను తప్పుపట్టడంలేదన్నారు. కూతురు సౌమ్యారెడ్డి రాజీనామా గురించి తనకు తెలియదని రామలింగారెడ్డి చెప్పారు.

>
మరిన్ని వార్తలు