103వ రోజు పాదయాత్ర డైరీ

5 Mar, 2018 01:27 IST|Sakshi

04–03–2018, ఆదివారం
అద్దంకి శివారు, ప్రకాశం జిల్లా

నాపై వాళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానీయను 
నాన్నగారే ఉంటే అద్దంకి ఇలా దయనీయంగా ఉండేదా? ఈ నియోజకవర్గంలో ఈ రోజు సాగిన పాదయాత్రలో చాలామంది అన్న మాట ఇది. నిజమే.. గుండ్లకమ్మ ప్రాజెక్టు, భవనాశి రిజర్వాయర్, యర్రం చిన్నపోలిరెడ్డి ఎత్తిపోతల.. ఆయన పథకాలే. రూ.592 కోట్ల అంచనా విలువున్న గుండ్లకమ్మకు నాలుగేళ్లలోనే దాదాపు రూ.579 కోట్లు వెచ్చించి ఆయన హయాంలోనే పూర్తిచేసి, జాతికి అంకితం చేశారు. కొద్దిపాటి కాల్వ పనులే మిగిలాయి. కానీ, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. మిగిలిన ఐదు శాతం పనుల అంచనాలను భారీగా పెంచాడు. కమీషన్ల కోసం రూ.13 కోట్ల అంచనాను కాస్తా.. రూ.161 కోట్లకు తెచ్చాడు. నిధులు మింగడమే తప్ప పనులు కదలడం లేదు. భవనాశి, యర్రం చిన్నపోలిరెడ్డి పథకాలను పూర్తిగా గాలికొదిలేశాడు. చాలా బాధనిపించింది. కాసుల కక్కుర్తిని కాస్త పక్కన పెడితే.. ఎంతమంది రైతన్నల కళ్లలో ఆనందం కనిపిస్తుందో కదా. మన ప్రభుత్వంలో ఇలాంటి పెండింగ్‌ ప్రాజెక్టులకు జీవం పోయాలన్నదే నా తపన. 

పేద బ్రాహ్మణులపైనా చంద్రబాబుకు ఇంత కసేంటయ్యా.. అంటూ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు ఒకింత కలవరపడ్డారు. రూ.500 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి ప్రతి పేద బ్రాహ్మణుడినీ ఆదుకుంటానని ఆశలు కల్పించాడట. అధికారం చేజిక్కింది.. ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది.. అన్నారు. అరకొర నిధులు విదిల్చాడట. ఆ నిధుల వినియోగంలో కూడా అక్రమాలు, పక్షపాతమేనట. పారదర్శకత మచ్చుకైనా కన్పించడం లేదన్నారు. పచ్చ చొక్కా వేసుకుంటేనే.. కార్పొరేషన్‌ ద్వారా లబ్ధిపొందే పరిస్థితి ఉందన్నారు. ఇదేం అన్యాయం.. ఇదెక్కడి మోసం.. అని ప్రశ్నించిన కార్పొరేషన్‌ చైర్మన్‌ను అర్ధాంతరంగా, అవమానకరంగా గెంటివేయడం అన్యాయం కాదా.. అని ప్రశ్నించారు. అర్హులైన పేద బ్రాహ్మణులందరికీ న్యాయం చేయాల్సిందిపోయి.. కొద్దిమంది అధికార పార్టీ నాయకుల అనుయాయులకు మాత్రమే పరిమితం చేయడం శోచనీయమన్నారు. నాన్నగారి హయాంలో 13 వేల దేవాలయాలకు.. ఒక్కో దానికి రూ.3,000 చొప్పున ధూపదీప నైవేద్యాల కింద నిధులిచ్చారని, కానీ చంద్రబాబు ఆ దేవాలయాల సంఖ్యను 3000కు కుదించారని వాపోయారు. ఆ పేద బ్రాహ్మణుల గోడు విన్నాక నాకు అన్పించింది.. గెలవడం కోసం ఇన్ని అడ్డదారులు తొక్కాలా.. ఇన్ని అబద్ధాలాడాలా.. కులానికో పేజీ పెట్టి, నయ వంచనకు ప్రణాళికలు వేయాలా.. అని.

మా కష్టం వినండన్నా.. అంటున్న భవన నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించాను. నాన్నగారు వారి కోసం కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, భరోసా కల్పించారట. ప్రభుత్వ, ప్రయివేటు నిర్మాణాల్లో ఒక శాతం వాటా సెస్‌ రూపంలో ఆ బోర్డుకు వెళ్లేదట. ఆపదొస్తే ఆ నిధులు అందేవన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు.. పరిస్థితి అంతా మారిపోయిందని చెప్పారు. దాదాపు రూ.350 కోట్లు చంద్రన్న బీమాకు మళ్లించారని తెలిపారు. కార్మిక శాఖలో అధికారులు తిరిగే వాహనాలకూ మా డబ్బే ఇస్తున్నారయ్యా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రన్న బీమా ఏ కార్మికుడి కన్నీళ్లూ తుడవకపోయినా.. ఆ పథకం ప్రచార డబ్బులన్నీ మా నిధుల నుంచే ఖర్చుచేస్తున్నారు.. అంటూ వాపోయారు. సొమ్మొకరిది.. సోకొకరిదా సార్‌.. అంటూ ఆవేదనగా అన్నారు. నిజమే.. చెమటోడ్చి పోగేసుకున్న వాళ్ల సంక్షేమ నిధితోనూ సర్కారు సోకులు చేయడం చాలా అన్యాయం అనిపించింది. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. కేవలం నాలుగున్నర సంవత్సరాల వ్యవధిలో నాన్నగారు రూ.579 కోట్లు ఖర్చుపెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టును దాదాపు పూర్తిచేయగా.. అదే నాలుగేళ్ల మీ పాలనలో కేవలం రూ.13 కోట్లు ఖర్చుచేస్తే పూర్తయ్యే మిగిలిన ఐదు శాతం పనులను ఎందుకు పూర్తిచేయలేకపోయారు? నాన్నగారికి పేరొస్తుందన్న దుర్బుద్ధితో పేద ప్రజలను బలిపెట్టడం ధర్మమేనా? మిగిలిన ఆ కొద్దిపాటి పనులను కూడా మీ అక్రమార్జనకు మార్గంగా వాడుకోవడం అన్యాయం కాదా? మీ అక్రమార్జన కోసం రూ.13 కోట్ల విలువ చేసే ఐదు శాతం పనుల విలువల్ని రూ.161 కోట్లకు పెంచడం ప్రజా ధనాన్ని దోచుకోడానికే కాదా?
-వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు