107వ రోజు పాదయాత్ర డైరీ

9 Mar, 2018 02:38 IST|Sakshi

08–03–2018, గురువారం
వేటపాలెం, ప్రకాశం జిల్లా

గంధపు చెట్లను కాపాడతానని గజదొంగ వీరప్పనే ముందుకొచ్చినట్టుంది..

కేంద్ర, రాష్ట్ర తాజా పరిణామాలు.. చంద్రబాబు హైడ్రామా ఆశ్చర్యం కలిగిస్తోంది. వరుస ఘటనలు చూస్తుంటే.. దిగజారుడు రాజకీయానికి చంద్ర బాబు మరోసారి తెరతీశాడనేది సుస్పష్టం. హోదా కోసం వెల్లువెత్తే  ప్రజాగ్రహం ఎక్కడ దహించి వేస్తుందోననే భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వం అని, ప్యాకేజీనే ఇస్తామని కేంద్ర మంత్రి జైట్లీ ఆయనకు ఇప్పుడే దో కొత్తగా చెప్పినట్టు.. దీంతో బీజేపీతో తెగతెంపులకు సిద్ధమైనట్టు టీడీపీ అధినేత తికమక రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు.

నిజంగా చంద్రబాబు నైజా న్ని చూస్తే.. ఊసరవెల్లి కూడా íసిగ్గుతో తల దించుకుంటుందేమో! అంతు లేని మోసాలకు, అడ్డూ అదుపూ లేని అబద్ధాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన బాబుతో దేశంలో మరెవ్వరూ పోటీపడలేరేమో! ఆయనేంటో, ఆయన డ్రామా లేంటో.. నాలుగేళ్లుగా జనానికి తెలిసిపోయింది. హోదాను ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన వంచనను జనం అర్థంచేసుకున్నారు. ప్యాకేజీతో కమీషన్‌లు బాగా వస్తా యని ప్యాకేజీకి సై అని, ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేంద్రం ముందు ఎలా సాగిలపడిందీ గమనిస్తూనే ఉన్నారు.

హోదాపై పూటకో మాట మార్చడాన్ని నిశితంగా పరిశీలి స్తూనే ఉన్నా రు. ఎన్నికలప్పుడు రాష్ట్రానికి హోదానే సంజీవని అంటాడు.. అధికారంలోకి రావడంతోనే నాలుక తిప్పేస్తాడు. హోదా ఏమైనా సంజీవనా? అంటాడు.. లేని ప్యాకేజీని చూపిస్తూ.. ప్యాకేజీనే మేలంటూ గొప్పగా చెబుతా డు. ప్యాకేజీ ప్రకటించిన జైట్లీని పొగడ్తలతో ఆకాశానికెత్తేస్తాడు. జైట్లీకి, వెంకయ్యకు సన్మానాలు, సత్కారాలు చేసి.. ఏదో సాధించానంటూ పోజులిస్తాడు.

ఇలా నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి, అవినీతితో కోట్లు కొల్లగొట్టి, హోదా కు సమాధి కట్టేందుకు అనుక్షణం ప్రయత్నించిన చరిత్ర బాబుదే! ఆయనే ఇప్పుడు హోదా కోసం పోరాటం చేస్తానంటే నయవంచన కాక ఇంకేంటి? గజదొంగ వీరప్పనే గంధపు చెట్లను కాపాడతానని ముందుకొచ్చినట్టుగా ఉంది చంద్రబాబు వైఖరి.హోదా విషయంలో వైఎస్సార్‌ సీపీది మొదటి నుంచీ ఒకే మాట. ఒకే బాట. ప్రత్యేక హోదానే ఆంధ్రావనికి సంజీవని అని భావించింది. నాలుగేళ్లుగా ప్రజల ను జాగృతం చేసింది. ఉద్యమ వేడి రగిల్చింది. హోదా కోసం గల్లీ మొదలు ఢిల్లీ వరకూ పోరాడింది. చంద్రబాబు భూస్థాపితం చేయాలనుకున్న హోదా నినాదానికి ఊపిరిపోసి బతికించింది.

దాన్నే జనాయుధంగా మలిచి.. పోరాట బాట పట్టించింది. ఈ ప్రయత్నంలో చంద్రబాబు చేయని కుయుక్తులు లేవు. ఉద్యమించిన ప్రతిసారీ వెన్నుపోటు పొడిచిన చరిత్రే ఆయనది. ఆందోళన చేసిన ప్రతి సందర్భంలోనూ పోలీసు లాఠీలతో అడ్డుకున్న వ్యక్తీ ఆయనే. గేలిచేయడం, ఎగతాళిగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది. అయినా వైఎస్సార్‌ సీపీ మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. ఈ పోరాటం నేపథ్యంతోనే తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. హోదా సాధించాలంటే  వైఎస్సార్‌ సీపీయే నమ్మకమైన పార్టీ అని జనం విశ్వసిస్తున్నారు.

చేయి చేయి కలపి ముందుకొస్తున్నారు. విద్యార్థి, యువజన, మహిళా లోకం ఏకమై కదలడంతో ఉద్యమం తారాస్థాయికి చేరింది. జన నినాదంలో ఎక్కడ కొట్టుకుపోతామోనన్న భయం బాబులో మొదలైంది. అందుకే హఠాత్తుగా కేంద్ర మంత్రులచే నామమా త్రపు రాజీనామాలతో కొత్త నాటకం మొదలు పెట్టాడు. ఇన్నాళ్లూ డ్రామాలాడి నా ఇకపై ప్రతిష్టకు పోకుండా అవిశ్వాసానికి మద్దతిస్తారని, ఆ తర్వాత రాజీనా మాలకు సహకరిస్తారని ఆశిస్తున్నా. అయితే.. అర్థం లేని డ్రామాలతో మోసం చేసే ప్రయత్నాలకు జనాగ్రహమే బుద్ధి చెబుతుందనేది నా విశ్వాసం.

ఎవరినై నా, ఎప్పుడైనా మోసం చేయొచ్చు.. ఎల్లకాలం కాదు. విశ్వసనీయత లోపించిన రాజకీయాలను ప్రజలు ఏనాడూ స్వాగతించరని చంద్రబాబుకు అర్థమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా తెచ్చేందుకు ఎంతకైనా తెగించి పోరాడాలన్నదే నా ఆశయం.  మీడియా సమావేశం ముగించుకుని బయటకొచ్చిన నన్ను అప్పటికే ఎదురు చూస్తున్న అక్క చెల్లెమ్మలు ఆప్యాయంగా పలకరించారు. ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా సోదర ప్రేమను పంచారు. కలువ పూలతో స్వాగతం పలికారు. వాళ్లందరి మధ్య మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం అన్నారు.. జాతీయ రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సీనియర్‌ని అన్నారు.. ఎంతోమందిని ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని చేసిన ఘనుడనన్నారు. అంతటి వ్యక్తివి.. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయించుకోలేకపోయారు? 29 సార్లు ఢిల్లీ పర్యటన చేశానంటున్నారు.. మీరు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ మీ పర్యటన ఉద్దేశాన్ని మీడియాకు వెల్లడించారు. ఏ ఒక్కసారైనా ‘హోదా కోసం ఢిల్లీకి వచ్చాను.. ఢిల్లీ పెద్దలతో హోదా విషయం చర్చించాను’ అన్న సందర్భం ఉందా? మీ భాగస్వాములైన బీజేపీ నేతలు.. మీరు ఒక్కసారి కూడా హోదా విషయం ప్రస్తావించలేదంటున్నారు. ఏం సమాధానం చెబుతారు? మీ 29 సార్ల ఢిల్లీ పర్యటన ఏం లాభం ఆశించి చేశారు?

మరిన్ని వార్తలు