108వ రోజు పాదయాత్ర డైరీ

11 Mar, 2018 01:18 IST|Sakshi

10–03–2018, శనివారం
చీరాల, ప్రకాశం జిల్లా

పేదవాడి ప్రాణాలు గాలిలో దీపాలేనా?
చంద్రబాబు పాలనలో అథోగతి పాలైన ఆరోగ్యశ్రీ పేదవాడి ప్రాణాలను కాపాడలేకపోతోంది. ఈ రోజు కూడా వేటపాలెంలో సోదరి మహబీ ఆవేదన నా మనసును కదిలించింది. మగ దిక్కు లేని ఆ అక్క బీడీ కర్మాగారంలో పనిచేస్తూ ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది. బతకడానికి, కుటుంబాన్ని బతికించడానికి సరిపడా గుండె ధైర్యం అయితే కూడగట్టుకుంది కానీ, కాలు విరిగిన కొడుక్కు వైద్యం చేయించలేని పరిస్థితి ఆమెను కుంగదీస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేని ఆ తల్లి ‘ఆరోగ్యశ్రీ అప్పటిలా ఉంటే బాగుండేదయ్యా’అని చెప్పింది. నాలుగేళ్లుగా రేషన్‌ కార్డు కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయింది. కుటుంబ పరిస్థితి చెప్పి సాయం చేయమన్నా.. ఏ జన్మభూమి కమిటీ గోడు ఆలకించలేదని తెలిపింది.

వాళ్లనో, వీళ్లనో బతిమిలాడి గుంటూరు సర్కార్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించినా... కొడుకు కాలికి మళ్లీ వాపొస్తోందట. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం దాదాపు పది నెలలుగా నరకయాతన అనుభవిస్తోంది. ఇలాంటి దీనగాథే మరొకటి అంబేడ్కర్‌ నగర్‌లో నా దృష్టికొచ్చింది. వినోద్, జయ దంపతులు పుట్టెడు దుఃఖంతో కష్టాలు చెప్పుకున్నారు. కూలి పనితో పట్టెడు మెతుకులు తింటున్న ఆ దంపతుల ఒక్కగానొక్క కొడుక్కు కొన్ని నెలలుగా జ్వరం వస్తోందట. విరామమెరుగకుండా పీడించే ఆ జ్వరానికి కారణాలు తెలుసుకోవడానికే రూ.లక్షకు పైగా ఖర్చు పెట్టారట. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో గుండె పగిలే నిజం తెలిసిందన్నారు. కొడుక్కు బ్లడ్‌ కేన్సర్‌ అని తేలడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. వారి మనోధైర్యం పూర్తిగా దెబ్బతింది. కూతవేటు దూరంలో రాష్ట్ర రాజధాని ఉన్నా... అక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేన్సర్‌కు చికిత్స లేదట. పోనీ ప్రైవేటు ఆస్పత్రులకు వెళదామంటే రూ.8 లక్షలు అవుతుందట. ఆరోగ్యశ్రీలో అరకొర నిధులు మాత్రమే ఇస్తున్నారని, మిగతా డబ్బు తెచ్చుకుంటేనే పూర్తి వైద్యం చేస్తామంటున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. మనసుకు చాలా బాధనిపించింది. అంధకారం అలముకున్న ఆ చిన్న జీవితానికి వెలుగునిచ్చేది ఎవరు? ఇలాంటి బాధితుల కన్నీళ్లు తుడవటమే లక్ష్యంగా ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం తేవాలన్నదే నా తపన. అందుకే రూ.1,000 దాటిన ఏ వైద్యాన్ని అయినా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని సంకల్పించాను.
 
చీరాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు.. నాగరికతకే వన్నె తెచ్చిన చీరాల చేనేత ప్రాభవం పూర్తిగా కనుమరుగవుతుండటం బాధనిపించింది. మగ్గం విడిచి మట్టి పని కోసం పరుగులు పెడుతున్న నేతన్న దయనీయ పరిస్థితి చూసి జాలేస్తోంది. ఇప్పటిదాకా ఎంతోమంది నేతన్నలు నన్ను కలిశారు. చంద్రబాబు వచ్చాకే తమ పరిస్థితి తారుమారైందని బాధగా చెప్పారు. నిజమే.. నేతన్నను చంద్రబాబు సర్కార్‌ నిలువెల్లా దగా చేసింది. హిందూపురంలో పాదయాత్ర ప్రారంభించిన తొలిరోజే చంద్రబాబు వాళ్ల బతుకులు మారుస్తానని హామీ ఇచ్చాడు. మగ్గం పక్కనే నేత కార్మికుడితో ఫొటోకు పోజులిచ్చి ప్రచారం చేసుకున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయింది. ఇప్పటికీ రుణమాఫీ లేదు.. సబ్సిడీలూ లేవు. పావలా రుణాల మాట దేవుడెరుగు.. ఆర్టిజన్‌ కార్డులున్నా బ్యాంకు లోన్లు రావు.

ఇచ్చిన హామీలకు దిక్కులేదు. నరాల పోగులు లాగి బట్టలు నేస్తున్నా వాటిని కొనేందుకు ప్రభుత్వ ప్రోత్సాహమే కరువైంది. ఆదుకోవాల్సిన సర్కార్‌ నయవంచన చేసింది. అండగా ఉండాల్సిన ఆప్కో మొండిచేయి చూపింది. తయారైన వస్త్రాలు అమ్ముడుపోక, పెట్టిన పెట్టుబడే రాక చేనేత రంగం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇక నేతన్న సంక్షేమం నేతి బీరకాయ చందంగా మారింది. ఆరోగ్య బీమా కార్డులు అందడం లేదంట. బడ్జెట్‌లో నిధులు అరకొరగా కేటాయిస్తున్నారు. అడపాదడపా చంద్రబాబు మొసలి కన్నీరు కార్చడం తప్ప ఆయన పాలనలో ఒరిగిందేమీ లేదని నేత కార్మికులే చెబుతున్నారు. అప్పులు నేతన్నలకు మృత్యుపాశాలవుతున్నాయి. చితికిన చేనేతల వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఆగిపోయిన జీవన నాడిని కొత్త ఊపిరితో బతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే వాళ్ల కష్టాల్లో పాలుపంచుకుంటున్నాను. అధికారంలోకి వస్తే పరిస్థితిని మార్చాలనే నా సంకల్పం మరింత దృఢపడింది. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మన రాష్ట్రంలో అత్యాధునిక వైద్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకమునుపే హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ సేవలను తొలగించడంలో ఆంతర్యమేమిటి? మీ పాలనలో పేదవాడి ప్రాణాలు గాలిలో దీపాలేనా?
-వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు