‘109 మంది ఎమ్మెల్యేలు మా వెంటే’

13 Jul, 2020 09:31 IST|Sakshi
‍సచిన్‌ పైలట్, అశోక్‌ గహ్లోత్‌ (ఫైల్‌ ఫొటో)

జైపూర్‌/న్యూఢిల్లీ: సంక్షోభం దిశగా పయనిస్తున్న రాజస్తాన్‌ రాజకీయాల్లో ఎవరి బలాన్ని వారు ప్రకటిస్తున్నారు. తన వెంట 30 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారని పార్టీ యువ నాయకుడు, ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ ఆదివారం తిరుగుబాటు జెండా ఎగరేసిన సంగతి తెలిసిందే. కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతిస్తున్నారన్నారు. ప్రస్తుతం అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం మైనారిటీలో ఉందని స్పష్టం చేశారు. పైలట్‌ వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఆదివారం ఈ ప్రకటన వెలువడింది. అయితే, తాజాగా కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి, రాజస్తాన్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అవినాష్‌ పాండే సీఎం అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని అంటున్నారు. ముఖ్యమంత్రికి 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సోమవారం తెల్లవారుజాము 2.30 గంటలకు పాండే వెల్లడించారు.
(చదవండి: రెబల్‌ పైలట్‌)

సీఎం గహ్లోత్‌ నివాసంలో ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో గహ్లోత్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ వారంతా సంతకాలు కూడా చేశారని పేర్కొన్నారు. మరికొందరు ఇతర పార్టీల, స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారని తెలిపారు. నేడు జైపూర్‌లో 10.30 గంటలకు జరగనున్న కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ (సీఎల్పీ) భేటీకి ఎమ్మెల్యేలంతా హాజరుకాలని విప్‌ జారీ చేసినట్టు ఆయన చెప్పారు. మీటింగ్‌కు గైర్హాజరు అయినవారిపట్ల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. నేటి కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ భేటీలో తాను పాల్గొనటం లేదని ఆదివారం వెలువడిన వాట్సాప్‌ సందేశంలో సచిన్‌ పైలట్‌ పేర్కొన్నారు. దీంతో పైలట్‌ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా, 200 మంది రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మం ది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. 
(రాజస్తాన్‌ సంక్షోభం : సింధియా ట్వీట్‌)

>
మరిన్ని వార్తలు