110వ రోజు పాదయాత్ర డైరీ

13 Mar, 2018 02:24 IST|Sakshi

12–03–2018, సోమవారం
బాపట్ల.. మూర్తి రక్షణ నగరం గుంటూరు జిల్లా

ఆ సంకల్పమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీగా పురుడుపోసుకుంది 
మార్చి 12.. జీవితంలో మరిచిపోలేని రోజు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన పార్టీ పుట్టినరోజు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చరిత్రాత్మక అవసరంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిన రోజు. నాన్నగారి మహాభినిష్క్రమణ ఆంధ్రావనికి గుండె కోతగా మారింది. ఆ మహానేత హఠాన్మరణాన్ని తట్టుకోలేక వందలాది గుండెలు ఆగిపోయాయి. కోట్లాది మంది ప్రజల జీవితాలు కకావికలమయ్యాయి. అంతటి శోక సంద్రంలో మేమంతా ఉండగా.. నాన్నగారి కోసం పరితపించి ప్రాణాలొదిలిన ఆత్మబంధువుల కుటుంబాలను ఓదార్చరాదన్న ఆంక్షలు అంతులేని మానసిక క్షోభకు గురిచేశాయి. పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి తను నమ్మిన విలువల పట్ల నిజాయితీతో, నిబద్ధతతో, చిత్తశుద్ధితో ప్రజల కోసమే రాజకీయ ప్రస్థానం చేసిన నాన్నగారిని చూస్తూ పెరిగినవాడిని.

మనల్ని నమ్మినవారి కోసం, మన వెంట నిలిచిన వారి కోసం, ఇచ్చిన మాట కోసం ఎంత కష్టాన్నైనా, ఎన్ని నష్టాలనైనా భరించినా ఫర్వాలేదన్నది నాన్నగారి సిద్ధాంతం. అందుకే నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న జనం కోసం మరో ఆలోచన లేకుండా ముందడుగు వేశాను. భగవంతుడి సంకల్పమేమో.. నన్ను బలంగా కదిలించింది. ఆ సంకల్పమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీగా పురుడుపోసుకుంది. నాటి నుంచి నేటి వరకు పార్టీ సారథిగా నిరంతరం ప్రజలతో మమేకమై.. ప్రజల కష్టాలలో, కన్నీళ్లలో, బాధల్లో, బాధ్యతల్లో పాలుపంచుకుంటూ ముందుకు సాగుతున్నాను. అప్పటి నుంచి ఇప్పటి దాకా పార్టీని దెబ్బతీసేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, డబ్బుతో ప్రలోభాలు. నా వెంట నిలిచి నన్ను ముందుకు నడిపిస్తున్న నా సహచరుల, ప్రజల భరోసాతో అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ వస్తున్నా. విలువలు, విశ్వసనీయతలే ప్రాణంగా, ప్రజాసేవే పరమావధిగా.. దినదిన ప్రవర్థమానమై ఎనిమిదో ఏట అడుగిడిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 

హోదా కోసం గళమెత్తి, ఫ్లకార్డులు చేతబట్టి బాపట్ల ఇంజనీరింగ్‌ విద్యార్థులు నన్ను కలిశారు. హోదా విషయంలో బాబుగారివన్నీ పిల్లిమొగ్గలేనని, ఆయనను ఏమాత్రం విశ్వసించలేమని విమర్శించారు. ‘అన్నా.. మాకు ఉద్యోగమైనా, ఉపాధి అయినా హోదాతోనే సాధ్యం. మీ మీద మాకు నమ్మకముంది. హోదా సాధన కోసం మీ పోరాటంలో మేమందరం భాగస్వాములవుతాం’ అంటూ ఆ సోదరులు చెబుతుంటే ఆసక్తిగా ఆలకించాను. రాష్ట్ర భవిష్యత్తుపై ఆ పిల్లలకున్న పాటి స్పష్టమైన ఆలోచనలు, తపన మన రాజకీయ పెద్దలకుంటే ఎంత బావుండు.. అనిపించింది. 

బాపట్ల ప్రాంతం పూల తోటలకు ప్రసిద్ధి. కానీ ఈ రోజు కలిసిన పూల రైతులు ఎంత దయనీయ స్థితిలో ఉన్నారో బాధగా చెప్పుకొన్నారు. ‘సార్‌.. నాన్నగారి హయాంలో మాకు ఉచిత విద్యుత్‌ అందేది. పూలకు మార్కెట్టూ బావుండేది. కానీ ఈ ప్రభుత్వంలో వేలకు వేలు కరెంటు బిల్లులొస్తున్నాయి. పూలకు గిట్టుబాటూ లేదు..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైతు వ్యతిరేక పాలనలో రైతన్న కంట కన్నీరు తప్ప ఇంకేం ఊహించగలం!

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పగటి పూటే తొమ్మిది గంటల నాణ్యమైన, నిరంతరాయ ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చి.. ప్రమాణ స్వీకారం చేసి.. మాట తప్పి.. రైతుల ను నట్టేట ముంచడం భావ్యమేనా? 
-వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు