111వ రోజు పాదయాత్ర డైరీ

14 Mar, 2018 01:28 IST|Sakshi

13–03–2018, మంగళవారం
ఈతేరు,గుంటూరు జిల్లా

ఆ అక్కచెల్లెమ్మల ఆప్యాయత చూసి కళ్లు చెమర్చాయి
కొండుభొట్లవారిపాలెం ఊరు దాటేప్పటికే సూర్యుడుకాస్తా చురుక్కుమంటున్నాడు. ఆ ఎండలోనూ అడుగులు వడివడిగా పడుతున్నాయి. చుట్టూ పొలాలే కావడంతో నడక స్పీడు పెరిగింది. ఆ సమయంలో కనిపించిన దృశ్యం ముందుకు కదలనీయలేదు. కనుచూపుమేరలో పొలాల గట్లమీద అక్కచెల్లెమ్మలు పరుగులుదీస్తూ వస్తున్నారు.. చేతులూపుతూ ఏదో చెబుతున్నారు.. అక్కడే ఆగిపోయాను. వాళ్ల పరుగు వేగం మరింత పెరిగింది. నేను నిలబడ్డ రోడ్డుకు, వాళ్లు వస్తున్న పొలాలకూ మధ్య నీళ్లతో నిండిన మోకాళ్లలోతు కాలువ ఉంది. అయినా వాళ్లు లెక్కచేయలేదు. రొప్పుతూ, ఆయాస పడుతూ, హమ్మయ్యా.. అనుకుంటూ వచ్చారు. ‘అన్నా..’ అంటూ ఆప్యాయంగా చుట్టుముట్టారు. ఆత్మీయంగా చేతులు పట్టుకుని ముచ్చట్లు చెప్పారు. వాళ్లంతా అక్కడ మినుము చేలో కూలికి వచ్చారట. దగ్గర్లోని మర్రిపూడి గ్రామానికి చెందినవారట. ‘అన్నా.. మాకెంత ఆనందంగా ఉందో’ అందో చెల్లెమ్మ. ‘మాకిది మరిచిపోలేని రోజు’ అంది ఓ అక్క. ‘మీ నాన్నే మాకు నీడనిచ్చాడు.. ఆయన పాలన వచ్చాకే కడుపునిండా అన్నం తిన్నాం.. అందుకే నువ్వు వస్తున్నది చూసి.. తినే తిండిని కూడా పక్కన పెట్టి ఇదిగో చేతులు కూడా కడుక్కోకుండా వచ్చాం..’ అంటూ చేయి చూపింది వాలి లక్ష్మి.

ఆ అక్కచెల్లెమ్మల ఆప్యాయత చూసి కళ్లు చెమర్చాయి. మరో ఫర్లాంగు దూరం వెళ్లానో లేదో.. ఇదే సన్నివేశం. కేవీపాలేనికి చెందిన మహిళా కూలీలు పరిగెత్తుకొచ్చి నాతో కష్టసుఖాలు చెప్పుకొన్నారు. మీ నాన్న మాకు దేవుడి తర్వాత దేవుడు లాంటివాడు.. అన్ని రకాలుగా ఆదుకున్నాడు.. అందో అమ్మ. ఆమె చెప్పడం పూర్తికాక ముందే.. సోదరి జ్యోతి కడుపులోంచి పొంగుకొస్తున్న ప్రేమను నాముందుంచింది.. నాన్నగారి హయాంలో ఆ తల్లికి జరిగిన మేలును గుర్తుచేసుకుంది. ‘అప్పట్లో నా భర్త కాలు విరిగిందన్నా.. మీ నాన్నగారిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని గుంటూరులోని ప్రయివేటు ఆస్పత్రిలో పైసా ఖర్చుపెట్టకుండా వైద్యం చేయించుకున్నాం. ఇప్పుడు పనికెళ్తున్నాడన్నా. ఆయన బయటపడతాడని నేనస్సలు అనుకోలేదు. మీ నాన్నగారే లేకపోతే.. అన్ని లక్షల రూపాయలు ఎక్కడ తెచ్చి వైద్యం చేయించేవాళ్లం?’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. మరో అక్క జంగం మల్లేశ్వరి మాటలు విని ఆప్యాయతతో తబ్బిబ్బయ్యాను. ‘నిన్ను చూడ్డానికి వస్తుంటే మా రైతు వెళ్లొద్దన్నాడయ్యా.. కూలి డబ్బులు అక్కర్లేదని చెప్పిమరీ వచ్చాను.. అసలు నువ్వు వచ్చేదే తెలియదు. తెలిస్తే ఈ రోజు కూలికి పోకుండా నీతోటే నడిచేవాళ్లం. మా లాంటోళ్ల కోసం నువ్వు ఎండనపడి నడిచొస్తుంటే ఏడుపొస్తుందయ్యా..’ అంటూ భోరుమంది. స్వార్థమే పరమావధిగా.. చేసిన మేలు మరిచిపోయేవాళ్లున్న ఈ రోజుల్లో నాన్నగారు ఎప్పుడో చేసిన మేలును ఇప్పటికీ గుండెల్లో పదిలంగా దాచుకున్న ఈ అక్కచెల్లెమ్మల ఆప్యాయతలకు మనసారా కృతజ్ఞతలు చెప్పాను. ఇలాంటి వారికి ఎంత చేసినా తక్కువే అనిపించింది. 


కాస్త ముందుకెళ్లగానే దాదాపు వందమందికి పైగా దివ్యాంగులు కలిశారు. ‘అన్నా.. ఈ పాలనలో మాకు న్యాయం జరగడంలేదు. మీ నాన్నగారి హయాంలో సదరం క్యాంపు సర్టిఫికెట్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్‌ వచ్చేది. కానీ ఇప్పుడు జన్మభూమి కమిటీల సిఫారసు లేనిదే.. వందశాతం వైకల్యం ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు. వాళ్ల సిఫారసు కావాలంటే చేయి తడపాల్సిందే. మాలో 90 శాతం మందికి పింఛన్‌ రూ.1000 మాత్రమే ఇస్తున్నారు. కొద్ది మందికి మాత్రమే రూ.1500 వస్తోంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం దివ్యాంగులందరికీ రూ.1500 ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోంది. ఈ పాలనలో దివ్యాంగుల సమైక్య సంఘాలన్నీ నిర్వీర్యమైపోయాయి. మా ఉద్యోగాలు, ఇళ్ల విషయంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేసింది..’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. దివ్యాంగుల పట్ల ఎంతో ఉదారంగా ఉండాల్సిన ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో వారికి అందాల్సిన సంక్షేమ పథకాలలో కోత విధించడం, వివక్ష చూపించడం అమానుషం కాదా? 
-వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు