114వ రోజు పాదయాత్ర డైరీ

18 Mar, 2018 02:34 IST|Sakshi

17–03–2018, శనివారం
కాకుమాను,గుంటూరు జిల్లా

మీ నయవంచనకు పరాకాష్ట కాదా?
సామాజిక బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలగి, గ్రామ పంచాయతీలను అంధకారంలోకి నెట్టివేసిందని.. పాదయాత్రలో నన్ను కలిసిన పలువురు మైనర్‌ పంచాయతీల సర్పంచులు వాపోయారు. ‘సార్‌.. పంచాయతీలు కరెంటు బిల్లులు చెల్లించలేకపోవడంతో గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాను నిర్దాక్షిణ్యంగా నిలిపేస్తున్నారు. దీనివల్ల తాగునీటి సరఫరా నిలిచిపోయి, వీధిలైట్లు వెలగక గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎప్పుడూ పంచాయతీలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన చరిత్ర లేదు’అని సర్పంచులు చెబుతుంటే.. అన్ని వ్యవస్థల్లోనూ, అన్ని వర్గాల ప్రజలకు ఈ పాలకులు చుక్కలు చూపిస్తున్నారనిపించింది. 

గతంలో విద్యుత్‌ బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వాలు మైనర్‌ పంచాయతీలకు పూర్తి సహకారం అందించేవి. ప్రజలకు తాగునీటి ఇబ్బందులుగానీ, వీధిలైట్ల సమస్యగానీ తలెత్తేది కాదు. పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా తోడ్పాటునందివ్వకుండా.. వాటి అధికారాలన్నింటినీ పూర్తిగా హరించివేస్తూ.. వాటిని నిర్వీర్యం చేస్తూ.. ప్రాథమిక విధులను కూడా నిర్వహించలేని దుస్థితికి నెట్టివేసిన పాలకుడు.. నేడు బిల్లులు కట్టలేదనే నెపంతో కరెంటు సరఫరా నిలిపివేయడం అత్యంత దారుణం. ‘సార్‌.. మైనర్‌ పంచాయతీలకు ఆదాయం లేదు. నిధులూ లేవు. మేము విద్యుత్‌ బకాయిలు ఎలా కట్టాలి? బకాయిలు చెల్లించకపోతే చెక్‌ పవర్‌ రద్దు చేస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారు’అని ఆ ప్రతినిధులు చెబుతుంటే.. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ప్రభుత్వమే దగ్గరుండి తూట్లు పొడవటం అన్యాయమనిపించింది.

బీకేపాలెంలో ఐదుగురు మహిళలు కలిశారు. నిజంగా వారి జీవితాల్లో విధి నింపిన విషాదమెంత ఉందో.. పాలకుల కర్కశత్వమూ అంతే ఉంది. మరియమ్మ, రత్తమ్మ, సంతోషం, దయమ్మ, సామ్రాజ్యం అనే ఆ ఐదుగురి భర్తలూ వివిధ కారణాలతో చనిపోయారు. వారందరిదీ ఒకే రకమైన వ్యథ. ‘అన్నా .. మేమంతా నిరుపేద దళితులం. మాకు వితంతు పింఛన్‌ అందితే కొంత భరోసా ఉంటుందని ఆశించాం. ప్రతి జన్మభూమిలోనూ అర్జీలు పెడుతున్నాం. వారు తిరస్కరిస్తూనే ఉన్నారు. కారణాలడిగితే చెప్పరు. జన్మభూమి కమిటీలు మాపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నాయి’అని వారు చెబుతుంటే నిజంగా చాలా బాధనిపించింది. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాష్ట్రంలోని మైనర్‌ పంచాయతీలకు విద్యుత్‌ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పారు. కాగా.. నేడు బిల్లులు చెల్లించలేదనే నెపంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేసి.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం మీ నయవంచనకు పరాకాష్ట కాదా? 
-వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు