115వ రోజు పాదయాత్ర డైరీ

20 Mar, 2018 02:13 IST|Sakshi

19–03–2018, సోమవారం
పెదనందిపాడు శివారు, గుంటూరు జిల్లా

కోట్ల కంఠాలు ఒక్కటై హోదా ఆకాంక్షను ఎలుగెత్తి చాటడం స్ఫూర్తిదాయకం
కాకుమాను దగ్గర రోషన్‌బీ అనే అక్క వచ్చి కలిసింది. ఆమెతో పాటు మరో 50 మంది అక్కచెల్లెమ్మలొచ్చారు. వారంతా రోజూ కూలీలుగా వెళతారట. వారి మేస్త్రిని నేనే అని చెప్పిన రోషన్‌బీ అక్క.. రోజుకు మాకు రూ.200 కూలీ అని, ఈ రోజు దాన్ని వదులుకుని మిమ్మల్ని చూడ్డానికి వచ్చామన్నా.. అని చెప్పింది. ఆ ఆప్యాయతకు మనసు చలించింది. ఆ అక్కచెల్లెమ్మలకు కూడా బాబుగారి సెగ తప్పలేదట. ఆయనగారి రుణ మాఫీ మాటలు నమ్మి మోసపోయామని చెప్పారు. కూలీనాలీ డబ్బుల్లో అంతోఇంతో మిగుల్చుకుని బ్యాంకుల్లో దాచుకుందామంటే.. ఆ డబ్బును వడ్డీల కింద బ్యాంకుల వాళ్లు జమ చేసుకుంటున్నారట. చంద్రబాబుగారిని నమ్మాలేగానీ.. నమ్మిన వారిని నట్టేట ముంచడంలో వారూవీరనే తేడానే లేదు. 

అక్కడే గాయత్రీ అనే చిన్నారి ఎంతో ఉత్సాహంతో పరుగులు పెడుతూ కన్పించింది. జగనన్నా.. అంటూ గట్టిగా నినాదాలు చేస్తోంది. కాసేపయ్యాక చుట్టూ ఉన్న జనాన్ని తోసుకుని వచ్చి నా చెయ్యి పట్టుకుంది. నాతో పాటు దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచింది. నన్ను కలుస్తున్న వారందరితో.. మనందరి కష్టాలూ పోవాలంటే అన్నను గెలిపించాలంటూ పెద్ద ఆరిందలా.. ఆ చిట్టితల్లి చెబుతుంటే ఎంతో ముచ్చటేసింది. 
పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంఘీభావంగా కొమ్మూరు గ్రామంలో చేయిచేయి కలిపి అక్కచెల్లెమ్మలు, సోదరులు, పార్టీ శ్రేణులతో మానవహారంగా ఏర్పడ్డాము. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వారు నినదిస్తుంటే.. నేనూ స్వరం కలిపాను. పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మానవహారాలుగా ఏర్పడి ప్రత్యేక హోదా ఆకాంక్షను.. కోట్ల కంఠాలు ఒక్కటై ఎలుగెత్తి చాటడం నిజంగా స్ఫూర్తిదాయకం. 

కొమ్మూరు గ్రామంలో ప్రవేశించింది మొదలు.. కడదాకా.. పిల్లలు మొదలుకుని వృద్ధుల దాకా ప్రతి ఒక్కరూ తాగునీటి సమస్యపై ఫిర్యాదులు చేశారు. అన్నా.. మండల ప్రసిడెంట్, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఇద్దరూ మా ఊరి నుంచే ఎన్నికయ్యారు. ఊరికి ఎంతోకొంత మేలు జరగకపోదా.. అని ఆశపడ్డాం. కానీ మా పరిస్థితిని మంచినీటికి కూడా గతిలేని, దయనీయ స్థితికి తీసుకొచ్చారు. ఇంతకుమునుపు తాగునీటికి ఇబ్బందులుండేవి కావు. ఈ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు అప్పటి దాకా ఉన్న వాటర్‌ ప్లాంట్‌ను తీసేశారు. తమ అవినీతి సంపాదన కోసం నీరు – చెట్టు పథకమంటూ చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వేయడంతో ఉప్పునీటిమయమై నిరుపయోగమైపోయాయి. ఇప్పుడు పక్క గ్రామాలకు పోయి తాగునీరు తెచ్చుకునే పరిస్థితి దాపురించింది. ఊరిలో రెండు చెరువులున్నా, పక్కనే సాగర్‌ జలాలు పారుతున్నా.. గుక్కెడు మంచినీటికి గతిలేని పరిస్థితి మాది. అన్నీఉన్నా అల్లుడి నోట్లో శనిలా తయారైంది.. అని బాధగా చెప్పారు. ప్రజలకు తాగడానికి గుక్కెడు నీరు అందివ్వలేని ప్రజా ప్రతినిధులు ఎందరుంటే మాత్రం ఏం ప్రయోజనం.. అనిపించింది. పదవులనేవి ప్రజా సేవకు కాకుండా దోపిడీకి సాధనాలుగా మారడం బాధనిపించింది. 

‘నేను బలహీనపడితే.. ఆంధ్రప్రదేశ్‌ బలహీనపడుతుంది.. ప్రజలకు నష్టం జరుగుతుంది’ అంటూ చంద్రబాబుగారు తెగ బాధపడిపోయినట్లు ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్త చూడగానే చాలా విడ్డూరం అనిపించింది. నిజమే.. ఓటుకు కోట్లు లాంటి అనేక అవినీతి కేసులతో ఆయన బలహీనపడ్డారు. ఆయనగారు కేసుల్లో ఇరుక్కుని తన ఒక్కడి స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టడంతో నిజంగా రాష్ట్రమూ బలహీనపడింది. తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దగ్గర అడ్డంగా దొరికిపోయి.. బయట పడటం కోసం సాగర్‌ జలాలు మొదలుకుని.. ప్రత్యేక హోదా వరకూ రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ తాకట్టుపెట్టారు. బాబుగారి పాపాలు ప్రజలకు శాపాలుగా మారుతుంటే రాష్ట్రం బలహీనపడక మరేమవుతుంది? ఆయన చేసిన తప్పుడు పనులను నిలదీస్తే.. తెలుగు జాతిపై దాడి.. అంటున్నారు. ‘ఓటుకు కోట్లు’ చేయాలని ఆయనకేమైనా తెలుగు జాతి చెప్పిందా? తప్పుడు పనులేమైనా చేయాలని రాష్ట్ర ప్రజలేమైనా పురమాయించారా?!

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఓటుకు కోట్లు వంటి అవినీతి కేసుల్లో సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి వాటి నుంచి బయట పడేందుకు.. కేవలం మీ ఒక్కరి స్వార్థం కోసం తెలుగు జాతి ప్రయోజనాలను తాకట్టుపెట్టడం నిజం కాదా? రాష్ట్రానికి న్యాయ సమ్మతంగా రావాల్సినవాటిని కూడా అడగలేని బలహీన స్థితిలోకి మీరు పడిపోయి.. తద్వారా రాష్ట్రం బలహీనం అవడానికి కారణం మీరు కాదా? 
-వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు