హుజూర్‌ బరిలో భారీగా నామినేషన్లు

1 Oct, 2019 05:13 IST|Sakshi

మొత్తం 76 మంది అభ్యర్థులు.. 119 నామినేషన్లు దాఖలు

చివరి రోజు 106 నామినేషన్లు

సాక్షిప్రతినిధి, సూర్యాపేట: హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 76 మంది అభ్యర్థులు 119 నామినేషన్లు వేశారు. చివరి రోజైన సోమవారం ఒక్క రోజే 67 మంది అభ్యర్థులు 106 నామినేషన్లు వేశారు. ఈ నెల 3న నామినేషన్ల ఉప సంహరణలతో ఎంత మంది బరిలో ఉంటారో తేలనుంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులతోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ సర్పంచ్‌ల ఫోరం నుంచి కొం దరు నామినేషన్లు వేశారు. ఇద్దరు సర్పంచ్‌ల నామినేషన్లు మాత్రమే తీసుకున్నారని, తమను నామినేషన్‌ వేయనివ్వలేదని కొందరు సర్పంచ్‌లు మీడి యాకు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల పరిశీలకుడు సచింద్ర ప్రతాప్‌సింగ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పరిశీలించారు. ఉదయం 11 గంటల నుంచే హుజూర్‌నగర్‌లోని నామినేషన్‌ కేంద్రం వద్ద కోలాహలం కనిపించింది. ప్రధాన పారీ్టల అభ్యర్థులు మధ్యాహా్ననికే నామినేషన్లు వేయడం పూర్తి అయింది. తొలుత కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పద్మావతిరెడ్డి స్థానిక నాయకులతో కలసి వెళ్లి నామినేషన్‌ వేశారు. అలాగే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావుతో కలసి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కోటా రామారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో వెళ్లి నామినేషన్‌ వేశారు. సీపీఎం నుంచి పారేపల్లి శేఖర్‌రావు, టీడీపీ అభ్యరి్థగా చావా కిరణ్మయి నామినేషన్‌ వేశారు. బీఎల్‌ఎఫ్‌ అభ్యరి్థగా మేడి రమణ, తెలంగాణ ఇంటి పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యరి్థగా తీన్మార్‌ మల్లన్నలు నామినేషన్‌ వేసిన వారిలో ఉన్నారు.  

నామినేషన్‌ వేయనివ్వలేదు..
సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు «జూలూరి ధనలక్ష్మి ఆధ్వర్యంలో 30 మంది సర్పంచ్‌లు నామినేషన్‌ కేంద్రానికి వెళ్లారు. అయితే తమకు టోకెన్లు ఇచ్చినా నామినేషన్లు వేయనివ్వలేదని వారు మీడియా ముందు అధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. ఆరుగురు నామినేషన్లు వేస్తే అందులో నలుగురివి తిరస్కరించి, ఇద్దరివి తీసుకున్నారని సంఘం నేత ధనలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. అధికారుల తీరుపై సర్పంచ్‌ల సంఘం నేతలు నామినేషన్‌ కేంద్రం బయట నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అక్కడే ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు