126వ రోజు పాదయాత్ర డైరీ

3 Apr, 2018 01:52 IST|Sakshi

02–04–2018, సోమవారం
శ్రీరామ్‌నగర్‌ గుంటూరు, గుంటూరు జిల్లా

పచ్చ విషనాగులు పేదల బతుకుల్ని కబళిస్తున్నాయి..
తమ పార్టీకి అనుకూలురు కాదని తెలిస్తే చాలు.. వారిని పీడించడానికి తెలుగుదేశం నాయకులు ఎంతటి దౌర్జన్యానికైనా తెగబడతారనడానికి తాడికొండ నియోజకవర్గంలోని లాం గ్రామానికి చెందిన మైనింగ్‌ పనులు చేసుకునే బాధితుల బతుకులే సాక్ష్యాలు. నిబంధనల ప్రకారం సంవత్సరాల తరబడి సక్రమంగా క్వారీ పనులు చేసుకుంటున్న వారిని సైతం.. ఏదో ఒక సాకు పెట్టి క్వారీలను మూసేయించి రోడ్డున పడేయడం పచ్చ నాయకుల బరితెగింపునకు నిదర్శనం. మరోవైపు అక్రమ సంపాదనకు అవకాశం ఉన్న చోటల్లా నిబంధనలకు నీళ్లొదిలి తమకు అనుకూలమైన వారికి దొడ్డిదారిన క్వారీలను అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారని నిస్సహాయులైన బాధితులు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. 

లాం లేబర్‌ కాంట్రాక్టు కోఆపరేటివ్‌ సొసైటీని 60 ఏళ్ల కిందట స్థాపించారు. దీనిమీద ఆధారపడి మైనార్టీ, ఎస్సీ, బీసీ కులాలకు చెందిన దాదాపు 600 కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ సొసైటీ పాలక మండలిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులున్నారన్న ఏకైక కారణంతో దానిని రద్దు చేయించాలని అధికార పార్టీ వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. గత 60 సంవత్సరాలుగా సజావుగా సాగిన ఆ పేద కార్మికుల జీవితాలు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చాక రోడ్డునపడ్డాయట. ఆ సంఘం వారు నాతో మాట్లాడుతూ ‘అన్నా.. మా సొసైటీని రద్దు చేయించాలన్న టీడీపీ వారి ప్రయత్నాలను కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాం. దాంతో కక్షగట్టి అధికారులను అడ్డం పెట్టుకుని క్వారీలను మూత వేయించారు. 600 కుటుంబాలకు ఉపాధి లేకుండా చేశారు. వేరే ఊళ్లకు వలసలు వెళ్లే దుస్థితిని తెచ్చిపెట్టారు. కానీ ఎమ్మెల్యే అనుచరులు మాత్రం అదే క్వారీలో.. ఏ అధికారిక అనుమ తులూ లేకున్నా మైనింగ్‌ చేసుకుంటున్నారు. మాలాంటి సామాన్యులను పీడించుకుతినడానికేనా వీరికి అధికారం వచ్చింది’ అని బాధపడ్డారు. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనట్లు.. పచ్చ విషనాగులు పేదల బతుకుల్ని కబళిస్తున్నాయి. నిజంగా మన రాష్ట్రంలో నడుస్తోంది ప్రజాస్వామ్యమేనా? పార్టీ వివక్షతో పేదవారి ఉపాధిని కాలదన్ని, కడుపుకొట్టడం దుర్మార్గం.. రాక్షసత్వం. 

అక్రమ క్వారీలకు అడ్డాగా మారిన పేరేచర్లలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ జరగనంత క్వారీయింగ్‌ ఈ నాలుగేళ్లలో జరిగిందంటే.. దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. అక్కడ జరుగుతున్న అక్రమ క్వారీయింగ్, బ్లాస్టింగ్‌ల వల్ల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దానివల్ల వస్తున్న కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందట. గతేడాది ఇదే నియోజకవర్గంలోని ఫిరంగిపురంలో ఏడుగురు కూలీలు క్వారీలో సజీవ సమాధి అయినా ఈ ప్రభుత్వానికి ఇంకా బుద్ధిరాలేదు. భద్రతా ప్రమాణాలు పాటించరు. జనావాసాల మధ్య బ్లాస్టింగ్‌లు.. దోపిడీ దొంగలకు కూడా లేని బరితెగింపు.. ఈ టీడీపీవాళ్లదంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. 

మొన్న పేరేచర్ల మీటింగ్‌లో వైఎస్సార్‌ సీపీ పోరాట పంథాను వివరిస్తూ.. పార్లమెంట్‌ చరిత్రలోనే ఇంతవరకు ఎవరూ చేయని పోరాటం మన ఎంపీలు చేస్తున్నారని చెప్పాను. రాజీనామాల తర్వాత వారు చేయ బోయే ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించాలని నేనిచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. అనేకమంది విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని హోదా నినాదాలు చేస్తూ.. పాదయాత్ర దారి వెంబడి నడుస్తుండటం గమనించాను. చిత్తశుద్ధితో తలపెట్టే సంకల్పానికి ప్రజల ఆశీస్సులు తప్పక ఉంటాయనే నా నమ్మకానికి మరింత బలం చేకూరింది. ఇంతకాలం హోదాకు సమాధి కట్టాలని విశ్వప్రయత్నం చేసిన బాబుగారు ఈ రోజు తన అనుకూల మీడియాతో.. తానొక్కడే వీరోచిత పోరాటం చేస్తున్నట్టు భ్రమలు కల్పించే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ప్రాణ సమానమంటూ హోదా ఆవశ్యకతను వివరించిన నన్ను.. గతంలో అసెంబ్లీలో మీరు హేళనచేసిన మాట నిజం కాదా? ఆ రోజు ‘హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి.. హోదాతో ప్రయోజనమే లేదు’ అంటూ అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రకటించడం నిజం కాదా? కాగా.. ఇప్పుడు అదే అసెంబ్లీలో హోదా మనకు ఊపిరి అంటూ మాటమార్చడం మీ అవకాశ వాదానికి పరాకాష్ట కాదంటారా? హోదా కోసం 25 మంది ఎంపీలు ఒకేసా రి రాజీనామాలు చేస్తే.. అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుందని తెలిసి కూడా.. రాజీనా మాల ఊసే ఎత్తకపోవడం మీ మోసకారితనానికి, చిత్తశుద్ధి లేమికి నిదర్శనం కాదా? 
-వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు