పురబరిలో..బస్తీమే సవాల్‌..!

17 Jan, 2020 04:05 IST|Sakshi

వార్డుకు నలుగురు వంతున పోటీ

80 మంది ఏకగ్రీవం–టీఆర్‌ఎస్‌కు సింహభాగం

తుది జాబితాను ప్రకటించిన ఎస్‌ఈసీ

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో సగటున ఒక్కో వార్డుకు నలుగురు వంతున అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నెల 22న 9 మున్పిపల్‌ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల్లో ప్రధానపార్టీలు, ఇతరపార్టీలు, స్వతంత్రులు కలుపుకుని మొత్తం 12,898 మంది బరిలో నిలిచినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) వెల్లడించింది.

వివిధ మున్సిపాలిటీల పరిధిలోని 80 వార్డులకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా (టీఆర్‌ఎస్‌ 77, ఎంఐఎం 3) ఎన్నికైనట్టుగా ఎస్‌ఈసీ ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న 9 కార్పొరేషన్లు (కరీంనగర్‌ మినహాయించి), 120 మున్సిపాలిటీలలో మొత్తం 3,052 వార్డులు ఉండగా... వాటిలో వివిధ మున్సిపాలిటీల పరిధిలోని 80 ఏకగ్రీవం కావడంతో... 2,972 వార్డులకు 12,898 మంది పోటీపడుతున్నారు. వీటన్నింటిలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు (2,972 మంది) పోటీచేస్తుండడంవిశేషం.

స్వతంత్ర అభ్యర్థుల జోరు...
సంఖ్యాపరంగా చూస్తే... ఈ ఎన్నికల్లో అత్యధికంగా 3,750 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఇక కాంగ్రెస్‌ నుంచి 2,616, బీజేపీ నుంచి 2,313, టీడీపీ నుంచి 347, ఎంఐఎం నుంచి 276, సీపీఐ నుంచి 177, సీపీఎం నుంచి 166, మంది పోటీ చేస్తున్నారు. ఎస్‌ఈసీ దగ్గర గుర్తింపు పొంది, గుర్తులు ఖరారు కాని గుర్తింపు పార్టీల నుంచి 281 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 3,750 మంది స్వతంత్రులు ఎన్నికల బరిలో మిగిలారు.

మొత్తం స్థానాలు: 3,052, ఏకగ్రీవాలు: 80, ఎన్నికలు జరిగే వార్డులు: 2,972

పార్టీల వారీగా...
టీఆర్‌ఎస్‌: 2,972
కాంగ్రెస్‌: 2,616
బీజేపీ: 2,313
టీడీపీ: 347
ఎంఐఎం: 276
సీపీఐ: 177
సీపీఎం: 166
ఇతర పార్టీలు: 281
స్వతంత్రులు: 3750
మొత్తం అభ్యర్థులు: 12,898

మరిన్ని వార్తలు