బీజేపీ ఓటమి.. కాంగ్రెస్‌తో వైరం!

20 Apr, 2018 00:50 IST|Sakshi

సీపీఎం ముసాయిదా తీర్మానంపై 13 రాష్ట్రాల ప్రతినిధుల చర్చ

సాక్షి, హైదరాబాద్‌: మతోన్మాద బీజేపీని ఓడించటమే సీపీఎం పార్టీ ప్రధాన లక్ష్యంగా ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్‌ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై గురువారం చర్చ కొనసాగింది. ఇందులో 13 రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ముసాయిదాను సభలో ప్రవేశపెట్టడాని కంటే ముందే కేంద్ర కమిటీ దీనిపై చర్చించి పలు సవరణలు చేసింది. అనంతరం తీర్మానాన్ని సభ ముందుంచారు.

కాంగ్రెస్‌తో రాజకీయ వైరం పాటించాలని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. పొత్తులతో పార్టీకి నష్టం జరిగిందని ప్రకాశ్‌కారత్‌ పెట్టిన తీర్మానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చర్చలో పాల్గొన్న సభ్యుల్లో పి.రాజీవ్‌ (కేరళ), శాంతన్‌ ఝా (పశ్చిమబెంగాల్‌), తపన్‌ చక్రవర్తి (త్రిపుర), ఎంవీఎస్‌ శర్మ (ఆంధ్రప్రదేశ్‌), అర్ముగ నయనార్‌ (తమిళనాడు), ఉదయ్‌ నర్వేల్కర్‌ (మహారాష్ట్ర), అరుణ్‌ మిశ్రా (బిహార్‌), ఇంద్రజిత్‌సింగ్‌ (హరియాణా), రాకేశ్‌సింగా (హిమాచల్‌ ప్రదేశ్‌), ధూలీ చంద్‌ (రాజస్తాన్‌), కేఎం తివారీ (ఢిల్లీ), సుప్రకాశ్‌ (అస్సాం) తదితరులున్నారు.

సుప్రీం వ్యాఖ్యలు దురదృష్టకరం
సీపీఎం జాతీయ మహాసభ ప్రకటన
జస్టిస్‌ లోయా మృతిపై స్వతంత్ర దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని సీపీఎం జాతీయ మహాసభ అభిప్రాయపడింది. జస్టిస్‌ లోయా మృతిపై అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేసేందుకుగాను మరో ఉన్నత ధర్మాసనం చేత సమీక్ష జరిపించాలని డిమాండ్‌ చేస్తూ మహాసభ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయమై సీతారాం ఏచూరి విలేకరులతో మాట్లాడుతూ న్యాయాన్ని అందించాల్సిన వ్యవస్థలే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు