133వ రోజు పాదయాత్ర డైరీ

11 Apr, 2018 02:30 IST|Sakshi

10–04–2018, మంగళవారం
మంగళగిరి అంబేడ్కర్‌ సర్కిల్, గుంటూరు జిల్లా

చేనేత వృత్తిని ఛిద్రం చేసిన బాబుగారిని ఏమనాలి?
ఈ రోజు ఆత్మకూరు పంచాయతీలోని పానకాలస్వామి కాలనీకి చెందిన చాలామంది అక్కచెల్లెమ్మలు వచ్చి తమ కష్టాలు చెప్పుకొన్నారు. ‘అన్నా.. నాలుగేళ్లుగా రోజూ వందలాది లారీలు రాత్రీపగలనే తేడా లేకుండా మట్టిలోడులతో మా వీధుల్లో దూసుకుపోతుంటే గుండెలు దడ దడలాడిపోతున్నాయ్‌. చెరువు మట్టిని తవ్వుకుపోతున్న ఆ లారీలు టీడీపీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయిగానీ.. మా బతుకుల్లో మాత్రం నిప్పులు పోస్తున్నాయి. రోడ్లన్నీ పాడైపోయాయి. ఇళ్లలో విపరీతమైన దుమ్ము, ధూళి. ఆ గాలి పీల్చలేకపోతున్నాం. అనారోగ్యాలపాలవుతున్నాం. ఎప్పుడు ఏ లారీ ఢీకొడుతుందోనని భయపడి చస్తున్నాం. లారీల శబ్దాలతో ఎవరికీ నిద్ర ఉండటం లేదు. పిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఇప్పుడేమో పరీక్షల సమయమాయె.

కనీసం రాత్రిపూట ఓ నాలుగు గంటలైనా తెరపివ్వాలని వేడుకున్నా కనికరించడం లేదు. రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ధర్నాలు చేసినా ఫలితం లేదు. పోలీసులు, ఇతర అధికారులు ఈ అక్రమ దందాను అడ్డుకోకపోగా.. రాజధాని అభివృద్ధికి అడ్డుతగులుతున్నారంటూ మాపైనే కేసులు పెడుతున్నారు’ అని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ తెలుగుదేశం నాయకులు నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తవ్వుకుని కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారట. మరోవైపు పంచాయతీకి వచ్చిన ఆదాయం మాత్రం వేలల్లోనే ఉందట. నిబంధనలను అతిక్రమించి చెరువును 15 మీటర్ల లోతు తవ్వుతున్నారంటే.. ఎంత బరితెగింపో అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మట్టి మాఫియాను ప్రోత్సహిస్తూ, పర్యావరణాన్ని దెబ్బతిస్తూ.. ప్రజలను ఇంత వేదనకు గురిచేసి కోట్లు దండుకుంటున్న ఈ ప్రభుత్వ పెద్దలకు మానవత్వం ఉందా? 

ఆత్మకూరులో చేనేత రంగుల అద్దకం కార్ఖానాను సందర్శించాను. ఆ కార్మికుల కష్టాలు మనసును కదిలించాయి. పొద్దస్తమానం పనిచేసినా పూటగడవని పరిస్థితి. పని ఉన్న రోజుల్లో రూ.250కన్నా గిట్టుబాటు కాదట. పనిలేని రోజుల్లో పస్తులుండాల్సిందే. నెలలో ఇరవై రోజులకన్నా పని ఉండదట. శంకరరావు అనే నేతన్న ‘అయ్యా.. నేను 40 ఏళ్ల నుంచి ఇదే పనిలో ఉన్నాను. రంగుల అద్దకంలో మంగళగిరే నంబర్‌వన్‌. ఒకప్పుడు 24 కార్ఖానాలుండేవి. ఇప్పుడు నాలుగే మిగిలాయి.

గిట్టుబాటుకాక, ప్రోత్సాహంలేక ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. ప్రభుత్వం ఆదుకోకుంటే ఈ నాలుగు కూడా మూతబడే సమయం ఎంతోదూరంలో లేదయ్యా’ అంటూ నిర్వేదంగా చెప్పాడు. అక్కడే గోపి అనే మరో సోదరుడు పనిచేస్తున్నాడు. అతను ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూసి.. ఉద్యోగం రాక, నిరుద్యోగ భృతిలేక.. కులవృత్తి అయిన రంగుల అద్దకంలోకి దిగాడు. చాలీచాలని ఆదాయంతో భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లి నిరాశలో మునిగిపోతున్నాడు. ఆ సోదరుడి పరిస్థితి చూసి జాలేసింది. ఈ పాలనలో చదువుకున్న వారికి ఉద్యోగం రాదు.. కులవృత్తి చేసుకుందామనుకుంటే ప్రోత్సాహం లేదు.. ఏమైంది ఇంటికో ఉద్యోగం? ఎక్కడికి పోయింది నిరుద్యోగ భృతి? చేనేత వృత్తిని ఛిద్రం చేసిన ఈ బాబుగారిని ఏమనాలి?

హోదా కోసం పదవుల్ని తృణప్రాయంగా త్యజించి, తమ ఆరోగ్యాలను కూడా లెక్కచేయకుండా, ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నా సహచరుల్ని అభినందించాను. మన ఐదుగురు ఎంపీల త్యాగం.. నాకే కాదు ఈ రాష్ట్రానికే గర్వకారణం. పార్టీ పిలుపు మేరకు ఎంపీలకు సంఘీభావంగా ఆందోళనల్లో పాల్గొంటున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నేతన్నల వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెట్‌ సదుపాయాలు కల్పిస్తానని, రుణాలు మాఫీ చేస్తానని, సంస్థాగత రుణాలిస్తానని, ఉచిత ఆరోగ్య బీమాలని, చేనేత పార్కులని, ఇళ్లని, షెడ్లని, అదని ఇదని.. మీ మేనిఫెస్టోలోని 21వ పేజీలో 23 హామీలిచ్చారు. నాలు గేళ్లవుతోంది.. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడం.. నేతన్నల ను నమ్మించి మోసం చేయడం కాదా?  
- వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు