143వ రోజు పాదయాత్ర డైరీ

24 Apr, 2018 01:31 IST|Sakshi

23–04–2018, సోమవారం 
గోపవరపుగూడెం, కృష్ణా జిల్లా

చంద్రబాబు మాకంటే పెద్ద పిట్టలదొర.. అన్నప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాను
ప్రకృతిని మనం కాపాడితే.. ప్రకృతి మనల్ని కాపాడుతుందన్న ధర్మ సూక్తిని విస్మరించి ఈ పచ్చ పాలకులు నీరు–చెట్టు పేరుతో పుడమి తల్లిని దోచుకుంటున్నారనడానికి నిదర్శనంగా నిలిచింది బ్రహ్మయ్యలింగం చెరువు. గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించిన వెంటనే ఆ ప్రాంత ప్రజలు నన్ను తీసుకెళ్లి.. ఆ చెరువును చెరబట్టిన దుశ్శాసన పర్వాన్ని కళ్లకు కట్టారు. ఎలాంటి అనుమతుల్లేకుండా, నిబంధనలు పాటించకుండా చెరువును తవ్వేసి, వేలాది లారీల మట్టిని అమ్మేసి, కోట్లు కొల్లగొడుతూ.. మరోవైపు, తవ్విన దానికి బిల్లులు చేసుకుంటూ ప్రజాధనాన్ని లూటీ చేయడం తెలుగుదేశం నాయకుల దోపిడీ తంతుకు పరాకాష్ట. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ ప్రకృతి వనరుల దోపిడీ తంతులో టీడీపీ నాయకులు, అధికారులతో పాటు ప్రభుత్వ పెద్దలే ప్రధాన భాగస్వాములు కావడం రాష్ట్ర దౌర్భాగ్యం.

నాన్నగారి హయాంలో ఏటా సాగర్‌ నీటితో జలకళ సంతరించుకుని, చుట్టుపక్కల ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన ఆ చెరువును.. బాబుగారి పాలనలో ఎండబెట్టి, అడ్డగోలుగా తవ్వేసి, ఎందుకూ పనికిరాకుండా చేయడం చూసి చాలా బాధేసింది. ఈ తెలుగుదేశం నాయకులకు అధికార మదం ఎంతగా తలకెక్కిందో తెలిపే మరో ఘటనను వివరించారు ఈ ప్రాంత ప్రజలు. ఈ చెరువు గట్టున శ్రీవిజయేంద్ర సరస్వతి గారిచే పునఃప్రతిష్టితమైన శివాలయం ఉంది. అందులోని పురాతన శివలింగాన్ని.. చుట్టుపక్కల గ్రామాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా, భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా.. రాత్రికి రాత్రి పొక్లెయిన్‌లతో పెకిలించి తరలించారంటే.. వీరి అరాచకాలకు అంతే లేదా అనిపించింది. 

‘అన్నా.. మేం గత పదేళ్లుగా చాలీచాలని జీతాలతో ఆరోగ్యమిత్రలుగా పనిచేస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకం జాతీయ అవార్డును సాధించడంలో మా పాత్ర కూడా ఎంతో ఉంది. మీ నాన్నగారి హయాంలో మాకు ఉద్యోగాలొచ్చాయని, మేమంతా వైఎస్సార్‌ అభిమానులమనే సంకుచితత్వంతో మమ్మల్ని ఉద్యోగాల్లోంచి తొలగించే ప్రయత్నం చేస్తోందీ దుర్మార్గపు ప్రభుత్వం’ అంటూ బాధలు పంచుకున్నారు తోటపల్లి వద్ద కలిసిన ఆరోగ్య మిత్రలు. కాస్త దూరం నడవగానే నన్ను కలిసిన 108 సిబ్బంది.. అయిదు నెలలుగా తమకు జీతాల్లేవని, 108 వాహనాల సంఖ్యా తగ్గిపోయిందని, ఉన్న వాహనాలు కండిషన్‌లో లేవని, వాటిలో ప్రథమ చికిత్సకు సైతం సౌకర్యాలు కరువని.. పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీబట్టి.. రాష్ట్ర ప్రజారోగ్య పరిస్థితి అవగతమవుతోంది. 

జీతాలు పెంచాలని వేడుకుంటే.. ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నారంటూ ఆవేదన చెందారు నూజివీడు మున్సిపాలిటీ కాంట్రాక్టు కార్మికులు. చంద్రబాబుగారు మమ్మల్ని పర్మినెంట్‌ చేస్తామన్న హామీని నిలబెట్టుకోకపోగా.. 279 జీవోతో వేలాది మంది కార్మికులకు మనుగడే లేకుండా చేస్తున్నారని వాపోయారు ఆ సోదరులు, అక్కచెల్లెమ్మలు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలోని పారిశుద్ధ్య విభాగాన్ని కాసుల కోసం తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పారిశుద్ధ్య వృత్తినే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న వేలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్మికులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఉపాధి లేకుండా చేసి, ఆ కుటుంబాలను వీధినపడేసే ప్రయత్నాలు చూస్తుంటే.. ఈ ప్రభుత్వానికి కనికరమే ఉండదా.. అనిపించింది. 

‘తప్పుకోండి తప్పుకోండి.. ఇప్పుడే విమానంలోంచి దిగాం’ అంటూ మొదలెట్టి, చేతిలో చెక్కతుపాకీతో, పలు రకాల హావభావాలతో చిత్రమైన విన్యాసాలు చేస్తూ.. ఇద్దరు పిల్ల పిట్టదొరలు చెప్పిన పిట్టకథలు కడుపుబ్బ నవ్వించాయి. పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లుగా పెద్ద పెద్ద మాటలతో, హాస్యోక్తులతో కథలు చెబుతున్న ఆ చిన్నారులను కళ్లప్పగించి చూస్తూ నడక సాగించాను. పిట్టకథలు బాగా చెబుతున్నారంటూ ఆ పిల్లల భుజం తట్టి మెచ్చుకుంటున్న సమయంలో ముక్తాయింపుగా ‘అన్నా.. మాకన్నా పెద్ద పిట్టలదొర మన ముఖ్యమంత్రిగారు. ఆయన చెప్పే పిట్టకథల ముందు మావెంత?’ అనడంతో నవ్వు ఆపుకోలేకపోయాను. వారి సమయస్ఫూర్తికి అచ్చెరువొందాను. చదువుకుంటూ.. ఆడుకుంటూ.. ఆనందంగా బాల్యం గడపాల్సిన వయసులో ఊరూరా తిరుగుతూ.. పిట్టకథలు చెప్పుకొంటూ.. పొట్టనింపుకోవాల్సిరావడం ఎంత దయనీయం?

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికల వేళ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తానని హామీ ఇచ్చి.. మేనిఫెస్టోలో పెట్టి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కి, ఉన్న ఉద్యోగాలను సైతం తీసివేయడం.. నమ్మించి మోసం చేయడం కాదా? 
- వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు