1.5 లక్షల జవాన్లు.. 600 ప్రత్యేక రైళ్లు

15 Mar, 2019 10:27 IST|Sakshi

దేశ వ్యాప్తంగా జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం లక్షా యాభై వేల మంది భద్రతా సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు. సరిహద్దు భద్రతా దళం, కేంద్ర రిజర్వు పోలీసు, ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసు, రైల్వే రక్షక దళాలకు చెందిన వీరిని దశల వారీగా వివిధ ప్రాంతాలకు తరలించేందుకు మొత్తం 600 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీరి కోసం రైల్వే శాఖ వెయ్యి బోగీలను కేటాయించింది. మొదటి విడతగా మార్చి 13వ తేదీన 12 ప్రత్యేక రైళ్లలో భద్రతా సిబ్బందిని 20 రాష్ట్రాలకు తరలించడం ఇప్పటికే మొదలైంది. బిహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాలకు వీరిని పంపుతున్నారు. ఒక రైల్లో 14 కంపెనీల భద్రతా సిబ్బందిని పంపుతున్నారు. ఒక కంపెనీలో 125 మంది ఉంటారు. మొదటి దశ పోలింగ్‌ జరిగే 20 రాష్ట్రాల్లో వీరి సేవల్ని ఉపయోగించుకుంటారు. తర్వాత వీరిని రెండో దశ పోలింగ్‌ జరిగే రాష్ట్రాలకు తరలిస్తారు. ఇలా మొత్తం ఏడు దశలకూ వీరి సేవల్ని వినియోగించుకుంటారు.

>
మరిన్ని వార్తలు