వారిపై అనర్హత సబబే

26 Oct, 2018 04:03 IST|Sakshi
తీర్పు విన్నాక మిఠాయిలు పంచుకుంటున్న తమిళనాడు సీఎం, డెప్యూటీ సీఎం, అన్నాడీఎంకే నేతలు

18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు సక్రమమేనన్న మద్రాసు హైకోర్టు

అన్నాడీఎంకేలో ఆనందం

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలోని టీటీవీ దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్‌ ధనపాల్‌ అనర్హులుగా ప్రకటించటాన్ని మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సత్యనారాయణన్‌ గురువారం ఈ తీర్పు వెలువరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లుగా గత ఏడాది గవర్నర్‌కు 19 మంది ఎమ్మెల్యేలు లేఖ అందజేశారు. అయితే వారిలో ఒకరు తిరిగి పళనిస్వామి పక్షాన చేరగా మిగతా 18 మందిపై స్పీకర్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో అనర్హత వేటు వేశారు.

స్పీకర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేటుపడిన ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టులో పిటిషన్‌  వేశారు. ఈ పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. స్పీకర్‌ నిర్ణయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోజాలదని జూన్‌ 14వ తేదీన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరాబెనర్జీ తీర్పు చెప్పగా, జస్టిస్‌ సుందర్‌ మాత్రం స్పీకర్‌ నిర్ణయం చెల్లదని పేర్కొన్నారు. భిన్నమైన తీర్పులు వెలువడడంతో ఈ కేసు జస్టిస్‌ సత్యనారాయణన్‌ ముందుకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్‌ సత్యనారాయణన్‌ స్పీకర్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవడం కుదరదని ఆయన స్పష్టం చేశారు.

దినకరన్‌ వర్గానికి షాక్‌
కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వెలువడటంతో అధికార అన్నాడీఎంకే శ్రేణులు ఆనందంలో మునిగిపోగా, టీటీవీ దినకరన్‌ వర్గం షాక్‌కు గురైంది. హైకోర్టు తీర్పు వెలువడగానే ఏఐఏడీఎంకే పార్టీ నేతలు మిఠాయిలు పంచుకుని సందడి చేశారు. పలువురు నేతలు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి అభినందించారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం, గెలుపు ఖాయమని సీఎం పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, మరో ఎమ్మెల్యే మరణంతో ఏర్పడిన రెండు అసెంబ్లీ స్థానాలను కలుపుకుని మొత్తం 20 నియోజకవర్గాల్లో వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుచేసే విషయం, తదుపరి కార్యాచరణపై 18 మంది ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని టీటీవీ దినకరన్‌ తెలిపారు. ఉప ఎన్నికలు వస్తే పోటీకీ తాము సిద్ధమని దినకరన్‌ ప్రకటించారు.

2019లోనే అసెంబ్లీకి ఎన్నికలా?
మద్రాస్‌ హైకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో కీలక మార్పులు జరగనున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 234 కాగా, జయలలిత, కరుణానిధి మరణంతో సభ్యుల సంఖ్య 232కి పడిపోయింది. ఒక సభ్యుడిని స్పీకర్‌గా పక్కనపెడితే 231 అవుతుంది. 18 మంది అసమ్మతి ఎమ్మెల్యేలను కోర్టు అనర్హులుగా ప్రకటించడంతో మిగిలింది 213 మంది. 20 సీట్లకు ఎన్నికలు జరిగే వరకు బలనిరూపణకు కావాల్సిన ఎమ్మెల్యేలు 107 మంది. పళనిస్వామికి కచ్చితంగా మద్దతు పలికేది 102 మంది ఎమ్మెల్యేలే అని పరిశీలకుల అంచనా. ఏఐఏడీఎంకేలో ఎంతమంది తిరుగుబాటుదారులున్నారో స్పష్టత లేదు. ఇప్పటికిప్పుడు బలపరీక్ష జరిగితే పాలకపక్షం నెగ్గడంపైనా అనుమానాలున్నాయంటున్నారు.

బలపరీక్షలో స్పష్టత రాని పరిస్థితుల్లో అసెంబ్లీ రద్దు ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలోని చాలామంది నేతలు ఆశిస్తున్న విధంగా 2019 లోక్‌ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాగే, తక్షణం బలనిరూపణలో పళని స్వామి ప్రభుత్వం నెగ్గినా ఖాళీ అయిన 20 అసెంబ్లీ స్థానాల ఎన్నికల తర్వాత బలాబలాలు మళ్లీ మారే అవకాశం ఉంది. ఉప ఎన్నికల అనంతరం అసెంబ్లీలో స్పీకర్‌ను మినహాయిస్తే 233 మంది సభ్యులుంటారు. అప్పుడు మెజారిటీకి 117 సీట్లు అవసరం ఉంటుంది.

ప్రస్తుతం 97 మంది సభ్యుల బలమున్న డీఎంకే.. ఉప ఎన్నికల్లో అన్ని సీట్లనూ గెలుచుకోగలిగితే మెజారిటీ రావచ్చు. లేదంటే మెజారిటీకి దగ్గరిగా వెళ్లొచ్చు. ఆర్‌కే నగర్‌లో దినకరన్‌ విజయం ద్వారా జయలలితకు బలమైన వారసుడిగా ప్రజలు గుర్తించినట్టయింది. డీఎంకే గెలవకపోయినా లేదం టే దినకరన్, అతని అనుచరులు తమ సీట్లను దక్కించుకోగలిగినా పళని ప్రభుత్వం ప్రమాదంలో పడ్డట్టే. ఉప ఎన్నికలు జరిగే 20 సీట్లు అన్ని పార్టీల మధ్య చీలినా కూడా రాజకీయ అనిశ్చితి వెంటాడే ప్రమాదముంది. ఇది కూడా తమిళనాట సత్వర ఎన్నికలకు దారితీస్తుంది. 20 సీట్లకు జరిగే ఉప ఎన్నికలను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్, కమల్‌హాసన్‌లు కూడా ప్రభావితం చేయనున్నారు.

మరిన్ని వార్తలు