లోక్‌సభ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు

21 Dec, 2018 04:50 IST|Sakshi
స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌

ఎంపీలపై స్పీకర్‌ ఆగ్రహం

రూల్స్‌ కమిటీతో సమావేశం

ఉభయ సభల్లో ఆందోళనలు

న్యూఢిల్లీ: ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేస్తూ లోక్‌సభలో గందరగోళం సృష్టిస్తున్న ఎంపీలపై స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీల ప్రవర్తనను పరిశీలించేందుకు రూల్స్‌ కమిటీతో సమావేశం అవుతానని ఆమె పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం సభా కార్యకలాపాలకూ పలు పార్టీల ఎంపీలు ఆటంకం కలిగించారు. విపక్ష సభ్యులు వివిధ అంశాలపై నిరసనలు, ఆందోళనలు కొనసాగించారు. ఎంతకీ ఆందోళనలు నియంత్రణలోకి రాకపోవడంతో దీనిపై అఖిలపక్ష నేతలతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సమావేశమయ్యారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభ నడుస్తున్న తీరుపై స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారని సమాచారం.

రూల్స్‌ కమిటీకి స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. ఈ కమిటీ సభ్యులు సభలో నిబంధనలు, సభ్యుల ప్రవర్తన, సభా కార్యక్రమాలు జరగాల్సిన తీరుపై స్పీకర్‌కు సలహాలు, సూచనలు చేస్తారు. అవసరమైతే సభా నిబంధనలు, ప్రవర్తనా నియమావళిలో సవరణలు కూడా ప్రతిపాదిస్తారు. కాగా, ఈ ఆందోళనల నడుమనే లోక్‌సభలో రెండు బిల్లులకు ఆమోదం లభించింది. ఉభయసభల్లోనూ రఫేల్, కావేరీ డ్యాం వివాదాలపై కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీ ల సభ్యులు ఆందోళనలు చేపట్టారు. కాగా, లోక్‌సభలో వినియోగదారుల హక్కుల రక్షణ బిల్లు, నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఆటిజం, సెరెబ్రల్‌ పాల్సీ, మెంటల్‌ రిటార్డేషన్, మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌ (సవరణ) బిల్లులకు ఆమోదం లభించింది. దివ్యాంగుల బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించింది.

మరిన్ని వార్తలు