ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరగాలి

21 May, 2019 05:02 IST|Sakshi

కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ కన్సల్టెంట్‌ భన్వర్‌లాల్‌

23న చేపట్టే ఓట్ల లెక్కింపుపై శిక్షణ కార్యక్రమాలు

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత పకడ్బందీగా నిర్వహించాల ని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ కన్సల్టెంట్‌ భన్వర్‌లాల్‌ ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న చేపట్టే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై జిల్లా ఎన్నికల ప్రధాన అధికారులకు, రిటర్నింగ్‌ అధికారులకు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు సోమవారం రెండవ విడత శిక్షణ, పునశ్చరణ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భన్వర్‌లాల్‌ పాల్గొన్నారు.

ఎన్నికల అధికారులకు పలు సలహా లు, సూచనలు ఇచ్చారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన చట్టపరమైన అంశాలతోపాటూ, కౌంటింగ్‌కు ముందు, తర్వాత దశలవారీగా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల అధికారులకు సవివరంగా తెలియజేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరిచే సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు, పరిశీలకులు తప్పనిసరిగా అక్కడ ఉండడం వంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ విమర్శలకు, ఆరోపణలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చూడాలని వారికి స్పష్టం చేశారు. లెక్కింపు ప్రక్రియకు తుది రూపం ఇవ్వడానికి మొదటి రెండు రౌండ్లు దశలవారీగా ఎలా లెక్కించాలో ఆ సమయంలో ఏఆర్‌ఓలు ఎలా అప్రమత్తం గా ఉండాలో వివరించారు.

రిటర్నింగ్‌ అధికారుల, పరిశీలకులకున్న పరిమితులు అలాగే వారికున్న అధికారాలు వాటిని ఎలా వినియోగించాలో వివరిస్తూ, కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటింగ్‌ యంత్రాల భద్రత, ఎన్నికల తాలూకు రికార్డులు, పత్రాలను ఎలా సీలు వేయాలి, ఫలితాల ప్రకటనను ఎన్నికల సంఘానికి నిర్దేశిత ఫారాల్లో ఎలా నింపి పంపాలన్న విషయాలపై కూడా అవగాహన కల్పించారు. ఈటీపీబీఎస్‌ వంటి అధునాతన టెక్నాలజీని మొదటిసారిగా వినియోగిస్తున్నందువల్ల దానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడం, ఎన్వలప్‌లమీద క్యూఆర్‌ కోడ్‌ వంటివి స్కాన్‌ చేయడం వంటి అంశాలను దానికి సంబంధించిన విషయ నిపుణులు వివరించారు.

ఓట్ల లెక్కింపులో సువిధ అనే అప్లికేషన్‌ను ఎలా ఉపయోగించాలో కూడా మాస్టర్‌ ట్రైనర్‌లు వివరించారు. సువిధ పోర్టల్‌లో డేటా ఎంట్రీ జరిగిన తర్వాతనే ఆ రౌండ్‌ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందని కూడా వారికి స్పష్టం చేశారు. 21వ తేదీన ఓట్ల లెక్కింపు సన్నద్ధతను పూర్తిస్థాయిలో పరీక్షించి చూసుకోవడానికి డ్రెస్‌ రిహార్సల్‌ నిర్వహించాలని భన్వర్‌లాల్‌ ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరుగుతున్న దృష్ట్యా అందరి దృష్టి ఈవీఎంల మీద ఉంటుందనీ, ఎక్కడా అజాగ్రత్తకు అవకాశం లేకుండా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని రజత్‌ కుమార్‌ ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణించి శిక్షలు విధిస్తుందని భన్వర్‌ లాల్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు