తెలంగాణలో 30లక్షల నకిలీ ఓట్లు

14 Sep, 2018 19:43 IST|Sakshi
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో 30లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఓటర్ల జాబితా అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ ఓట్లను సరిదిద్ది పాత షెడ్యూల్‌ ప్రకారమే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఓటర్ల జాబితా మొత్తంలో 12శాతం నకిలీ ఓట్లు ఉండటమంటే చిన్న విషయం కాదని పేర్కొన్నారు. డోర్‌ టూ డోర్‌ స్టెప్‌ కూడా వెరిఫై చేయాలని, దీనికి సమయం పడుతుందన్నారు. 2019 సవరణ ప్రక్రియ జనవరి 4న ప్రచురించాల్సి ఉన్నదని.. ఓటర్ల జాబితాపై అనుమానాలు నివృత్తి చేసి ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరామన్నారు.

ముందస్తు ఎన్నికల హడావిడి కోసం అవకతవకలు తెల్సికూడా సరిదిద్దకపోవటం సరికాదని చెప్పారు. ఓటర్ల జాబితాలోని పొరపాట్లు అన్నీ ఉద్దేశ్యపూర్వకంగా జరిగినట్లు భావిస్తున్నామని అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘తెలుగు రాష్ట్రాల్లో 18లక్షల కామన్‌ పేర్లు ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణలో వీరికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. మేము చెప్పిన అంశాలు ఈసీ దృష్టికి వచ్చినట్లు అధికారులు చెప్పారు. సీడాక్‌ ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం అన్నారు. ఎంత సమయం అంటే చెప్పలేమన్నార’’ని తెలిపారు.

మరిన్ని వార్తలు