నాలుగేళ్లలో 39 కేసులు 

29 Nov, 2018 01:50 IST|Sakshi

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కేసీఆర్‌ అవినీతి, కుటుంబ పాలన, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని తనపై కత్తికట్టాడని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గిలో బుధవారం నిర్వహించిన ‘కొడంగల్‌ రణరంగం’సభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న నాపై ఈ నాలుగేళ్లలో కేసీఆర్‌ 39 కేసులు పెట్టించిండు. 40 రోజులు జైలులో పెట్టినా కూడా భయపడలేదు. ప్రజలు అండగా ఉన్నంత కాలం చివరి శ్వాస వరకు కేసీఆర్‌ను కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో వేయడానికి పోరాటం చేస్తా. ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదు.. కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురికి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పోరాటం.

ఈ కురుక్షేత్రంలో ధర్మమే గెలుస్తుంది. కేసీఆర్‌ వైపు ధనం ఉంటే.. కాంగ్రెస్‌ వైపు ధర్మం ఉంది. అంతేకాదు తల్లి సోనియా ఆశీర్వాదం ఉంది. ఆమె ఆశీర్వాదం ఉంటే కొండనైనా పిండి చేసే శక్తి మనకు లభిస్తుంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయకూడదు. ఒక్కసారి గెలిపిస్తేనే రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నడు. వందల ఎకరాల ఫాంహౌస్‌లు కట్టుకున్నడు. అలాగే కుటుంబం మొత్తానికి పదవులు ఇచ్చుకున్నడు. 1,200 మంది ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణ నీ కుటుంబం కోసమేనా? గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చావా అని కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నా. ఇయాల తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం నిలబడాలన్నా.. స్వయం పాలన జరగాలన్నా సామాజిక న్యాయం చేయాలన్నా కాంగ్రెస్‌ పార్టీ గెలవాలి’అని అన్నారు.  

తెలంగాణ అంటే ఒక కుటుంబం కాదు: కోదండరాం
ఏ ఒక్క హామీని సరిగా అమలు చేయలేని టీఆర్‌ఎస్‌కు పరిపాలన చేసే నైతిక అధికారం లేనే లేదని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. ‘కేసీఆర్‌ ఎలాగూ నడమంత్రానే దిగిపోయిండు. మళ్లీ పిలిచి పట్టం కట్టాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చినం. కేవలం ఒకే ఒక ఆలోచనతో ప్రజల బతుకులు మారాలి. తెలంగాణ అంటే కేవలం ఒక కుటుంబం కాదు.. ఇక్కడ నివసించే నాలుగు కోట్ల ప్రజలు. వారి బతుకులు మారాలనే ఆలోచనతో అన్ని పార్టీలు ఏకమయ్యాం. ఈరోజు ఈయన ఎందుకున్నడు? ఆయన ఎందుకున్నడు? అని కొందరు అంటున్నరు. రాష్ట్ర ఏర్పాటు కోసం అందరం కలసి కొట్లాడలేదా? ఇవాళా అంతే... తెలంగాణ అభివృద్ధి కోసం కలసి నడుస్తున్నం. ప్రభుత్వం వచ్చాక హామీల అమలు కోసం ప్రత్యేక డిపార్ట్‌మెంట్‌ పెట్టి దానిలో అన్ని పార్టీల వారు భాగస్వామ్యులం అవుతం. చెప్పినవన్నీ అమలు చేయించడానికి ప్రయత్నం చేస్తం. మా గత చరిత్రను చూసి విశ్వసించి పీఫుల్స్‌ ఫ్రంట్‌ను గెలిపించండి. కేసీఆర్‌ను మళ్లీ ఫాంహౌస్‌కే పంపాలని కోరుతున్నా’అని అన్నారు. 

పీపుల్స్‌ ఫ్రంట్‌దే ప్రభుత్వం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
డిసెంబర్‌ 12న పీపుల్స్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘నాలుగున్నరేళ్ల పాటు తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్న కేసీఆర్, కేటీఆర్‌ బట్టేబాజ్‌ మాటలతో మరోసారి తెలంగాణను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నరు. నీళ్లు తీసుకురాలే.. ఉద్యోగాలు ఇయ్యలే.. నిధులన్నీ వారి జేబుల్లోనే నింపుకున్నరు. రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతుంది. అలాగే పండే ప్రతీ పంటకు మంచి గిట్టుబాటు ధర ఇవ్వబోతున్నం. ప్రభుత్వంలో 1.07 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేసీఆర్‌ తన హయాంలో కేవలం 11వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిండు. అంటే కేసీఆర్‌ సన్నాసా.. దద్దమ్మనా? నాలుగున్నరేళ్లలో ఖాళీ ఉద్యోగాలను ఎందుకు నింపలేదు? రాబోయే ప్రజాఫ్రంట్‌ ప్రభుత్వంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నం. మెగా డీఎస్సీ నిర్వహించి 20వేల ప్రభుత్వ ఉపాధ్యాయులను భర్తీ చేస్తం. పింఛన్లు పెంచుతున్నం’అని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు