మా పాలనకు ప్రజామోదం

27 May, 2018 03:17 IST|Sakshi
శనివారం కటక్‌లో జరిగిన సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మోదీ

20 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగడమే అందుకు నిదర్శనం

అవినీతిపై పోరుతో విపక్షాల వణుకు

రూ. 53 వేల కోట్ల అక్రమాదాయం వెలికితీశాం

10 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం

ఎన్డీఏ నాలుగో వార్షికోత్సవ సభలో ప్రధాని మోదీ

కటక్, భువనేశ్వర్‌: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరైన దారిలోనే పయనిస్తోందని, ప్రజలు తమకు ఆమోద ముద్ర వేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగడమే అందుకు నిదర్శమని ఆయన చెప్పారు. దేశం దుష్పరిపాలన నుంచి సుపరిపాలనకు, నల్లధనం నుంచి ప్రజాధనం వైపుగా అడుగులు వేస్తోందని అన్నారు. ఈ నాలుగేళ్ల పాలన అనంతరం.. దేశం మారగలదన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఒడిశాలోని కటక్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ.. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక పోరాటం అనేకమంది వెన్నులో వణుకు పుట్టించిందని, దాంతో విపక్షాలు ఒకే వేదికపైకి చేరాయని విమర్శించారు.

‘సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయడాన్ని అందరూ గమనించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడే ప్రభుత్వం మాది కాదు. సర్జికల్‌ దాడులు నిర్వహించగల సత్తా ఎన్డీఏ సర్కారుకు ఉంది అలాగే అక్రమ ఆదాయం, ఆస్తులపై వివిధ దర్యాప్తు సంస్థలు మూడు వేల దాడులు నిర్వహించాయి. రూ. 53 వేల కోట్ల అక్రమాదాయం బయటపడింది. బినామీ చట్టం కింద రూ. 3500 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నాం. అవినీతి కేసుల్లో నలుగురు మాజీ సీఎంలు జైళ్లలో ఉన్నారు. 2.26 లక్షల డొల్ల కంపెనీల్ని రద్దు చేశాం. నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న కఠిన నిర్ణయాలతో వెన్నులో వణుకు పుట్టిన అనేకమంది.. ఒకే వేదికపైకి చేరారు’ అని ఇటీవల కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా విపక్షాల ఐక్యతను పరోక్షంగా విమర్శించారు.   

ప్రజానుకూల పథకాలు చేపట్టాం..
కాలం చెల్లిన చట్టాల్ని పక్కనపెట్టామని, గత నాలుగేళ్లుగా ప్రపంచం ఒక కొత్త భారతదేశాన్ని చూస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ దేశంలో 6 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తే.. ఈ నాలుగేళ్ల కాలంలో 7.5 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాం. ఎన్డీఏ హయాంలో ప్రతి ఇంటికీ విద్యుత్‌ వెలుగులు అందాయి. 25 కోట్ల జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాల్ని ఇచ్చాం. 10 కోట్ల మంది గ్యాస్‌ కనెక్షన్‌లు అందచేశాం. మా హయాంలో పారిశుద్ధ్య సౌకర్యాల్ని రెండింతలు మెరుగుపర్చాం. గత నాలుగేళ్లలో భారీగా నక్సలైట్లు లొంగిపోయారు. దేశ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. అందుకే మా విధానాలు కూడా ప్రజానుకూలంగా ఉన్నాయి’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన పలు పథకాల్ని మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్‌ పార్టీది ఎప్పుడూ అధికార యావ అని మోదీ విమర్శించారు.  
శనివారం కటక్‌లో జరిగిన సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మోదీ

ప్రజా ఉద్యమంగా ఎన్డీఏ అభివృద్ధి పనులు
గత నాలుగేళ్లలో ఎన్డీఏ చేపట్టిన అభివృద్ధి ఉత్సాహపూరిత ప్రజా ఉద్యమంగా మారిందని ట్విట్టర్‌లో మోదీ పేర్కొన్నారు. ‘2014లో ఇదే రోజున దేశ పరివర్తన కోసం మన ప్రయాణాన్ని ప్రారంభించాము. దేశం వృద్ధి పథంలో ప్రతి పౌరుడు భాగస్వామి అయ్యాడు. 125 కోట్ల మంది భారతీయులు దేశాన్ని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తున్నారు’ అని అన్నారు. ‘సాఫ్‌ నియత్, సహీ వికాస్‌’(మంచి ఉద్దేశం, సరైన అభివృద్ధి) హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రభుత్వ విజయాల్ని ప్రస్తావిస్తూ పలు చార్ట్‌లు, గ్రాఫిక్స్, వీడియోల్ని పోస్టు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల దృఢమైన నమ్మకానికి నేను నమస్కరిస్తున్నా. మీ మద్దతు, వాత్సల్యం ప్రభుత్వానికి ప్రేరణ, బలం’ అని ట్వీట్‌ చేశారు. ఉత్సాహం, అంకితభావంతో ప్రజలకు సేవచేయడాన్ని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని ప్రధాని నొక్కిచెప్పారు. ముందుచూపుతో ప్రజలకు సాయం చేసే నిర్ణయాలు తీసుకున్నామని సరికొత్త భారతావనికి అవి పునాదులు వేశాయని చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు