ఎస్పీ కంచుకోటలో కమలం పాగా వేసేనా?

19 Mar, 2019 11:52 IST|Sakshi

లక్నో : దేశానికి స్వాతంత్ర్యం వ‍చ్చిన నాటి నుంచి నేటి వరకూ 16 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్ని ఎన్నికలు వచ్చినా కొన్ని నియోజకవర్గాల ఫలితాల్లో మాత్రం మార్పుండదు. ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన మైన్‌పూరి నియోజక వర్గం గురించి. సమాజ్‌వాద్‌ పార్టీకి పెట్టని కోటగా నిలిచిన ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం జనసంఘ్‌, బీజేపీ దాదాపు 50 ఏళ్లుగా దండయాత్రలు చేస్తూనే ఉన్నాయి. ఆఖరికి 2014లో దేశవ్యాప్తంగా మోదీ హవా ప్రభంజనం సృష్టించినప్పటికి మైన్‌పూరి నియోజకవర్గ ఫలితాన్ని మాత్రం ప్రభావితం చేయలేకపోయింది.

ఓ సారి గతాన్ని పరిశీలించనట్లయితే.. 1967లో మైన్‌పూరి నియోజకవర్గంలో తొలిసారి జనసంఘ్‌ తరఫున జగ్దీష్‌ సింగ్‌ పోటీ చేసి 46, 627 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఆ తరువాత 1971, 1977, 1980, 1984, 1989 సంవత్సరాలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనసంఘ్‌, బీజేపీ తరఫున అభ్యర్థులేవరు ఇక్కడ పోటీ చేయలేదు. దాదాపు 24 ఏళ్ల తర్వాత 1991లో బీజేపీ తరఫున రామ్‌ నరేష్‌ అగ్నిహోత్రి మైన్‌పూరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ 1. 14 లక్షల ఓట్లు సంపాదించి రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత 1996లో ఉపదేశ్‌ సింగ్‌ చౌహన్‌ బీజేపీ తరఫున బరిలో నిలిచాడు. కానీ ములాయం సింగ్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఉపదేశ్‌ సింగ్‌ కూడా 2. 21 లక్షల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. ఇక 1998లో జరిగిన లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికల్లో మైన్పూర్‌ నియోజకవర్గంలో ఏకంగా 53 మంది అభ్యర్థులు పోటికి దిగారు. వారిలో బీజేపీకి చెందిన అశోక్‌ యాదవ్‌ ఒకరు. కానీ సమాజ్‌వాద్‌ పార్టీ తరఫున పోటీ చేసిన బలరాం సింగ్‌ యాదవ్‌నే విజయం వరించింది.

అయితే 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బలరాం సింగ్‌ యాదవ్‌ ఓటమి చవి చూశారు. కారణం ఏంటంటే 2004 ఎన్నికల సమయంలో ఆయన ఎస్పీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరడమే కాక ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ములయాం సింగ్‌ యాదవ్‌ చేతిలో ఓటమి చవి చూశారు. ఇక 2014లో దేశ వ్యాప్తంగా మోదీ గాలి వీచినప్పటికి మైన్‌పూరి నియోజకవర్గంలో మాత్రం బీజేపీ ఓటమి చవి చూడక తప్పలేదు. 2014లో మైన్పూర్‌లో పోటీ చేసిన బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు ములాయం చేతిలో ఓటమి పాలయ్యారు. మరి ఈ సారి ఇక్కడ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరో నెల రోజులు ఎదురు చూడాల్సిందే.

మరిన్ని వార్తలు