నాడు 6 పైసలు.. నేడు రూ.46

15 Apr, 2019 02:34 IST|Sakshi

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీలు, అభ్యర్థులు ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తోంటే, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోంది. మొదటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పార్టీలు పెరిగాయి. అభ్యర్థులూ పెరిగారు. దాంతో పాటే ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణ వ్యయం కూడా పెరుగుతోంది. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి రూ.10 కోట్లు ఖర్చయ్యాయి. అంటే ఒక ఓటరుకు 6 పైసలు ఖర్చయినట్టు. అదే 2014 నాటికి ఎన్నికల వ్యయం రూ.3,870 కోట్లకు చేరింది. అంటే ఒక ఓటరుపై రూ.46 వెచ్చిస్తున్నారు.

2009 ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఒక ఓటరుపై రూ.15 ఖర్చు చేసింది. అభ్యర్థుల ప్రచార వ్యయం, భద్రతా ఏర్పాట్ల ఖర్చు మినహా మిగతా ఖర్చు ఇది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల సంఘం ఓటరు నమోదు ప్రచారం చేపట్టడం, దాని కోసం భారీగా ప్రకటనలు జారీ చేయడం, ఎన్నికల జాబితాలను డిజిటలైజ్‌ చేయడం వంటి చర్యలతో ఇటీవల ఎన్నికల వ్యయం బాగా పెరిగింది. అలాగే, ఎన్నికల సిబ్బందికి ఇస్తున్న గౌరవ భృతి పెరగడం, వారికి శిక్షణ నివ్వడానికి రాకపోకల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల కొత్తగా రాజకీయ పార్టీల ప్రచారాన్ని, పోలింగ్‌ సరళిని వీడియో తీస్తున్నారు. దీని ఖర్చు కూడా ఎన్నికల సంఘం ఖాతాలోకే వెళుతుంది.

అమెరికా కంటే ఎక్కువ
దేశంలో ఎన్నికల నిర్వహణ భారీ వ్యయంతో కూడుకుందని అమెరికా నిపుణులు చెబుతున్నారు. 2019 ఎన్నికల వ్యయం దేశ చరిత్రలోనే అత్యధికంగా ఉండవచ్చని, బహుశా ప్రపంచంలో మరే ప్రజాస్వామ్య దేశంలోనూ ఇంత ఖర్చు ఉండదని వారంటున్నారు. 2016లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, కాంగ్రెస్‌ ఎన్నికలు కలిపి జరిగాయి. వీటికి మొత్తం 650 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. 2014లో మన దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు 500 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయని అంచనా. 2019 ఎన్నికల వ్యయం దీన్ని మించిపోతుందని కార్నేజ్‌ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ థింక్‌ ట్యాంక్‌కు చెందిన మిలన్‌ వైష్ణవ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు