హామీలు లేవు బుజ్జగింపులే

3 Oct, 2018 00:52 IST|Sakshi

అసంతృప్తులతో కేటీఆర్‌ చర్చలు

అవకాశాలపై సీఎం నిర్ణయిస్తారని వెల్లడి

ఉమ్మడి వరంగల్‌ నేతలకు బుజ్జగింపులు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాతో కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు, అసమ్మతులు మొదలయ్యాయి. జాబితా వెల్లడించి నెల రోజులైనా పరిస్థితిలో పెద్దగా మార్పులు ఉండటం లేదు. 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటన తో టికెట్‌ ఆశించిన కొందరికి ఆశాభంగం కలిగింది. వీరిలో కొందరు ఏకంగా సొంతంగా ప్రచారం మొదలుపెట్టారు. మరికొందరు అభ్యర్థులను మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమకే అవకాశం ఇవ్వాలని ఇంకొందరు పట్టుపడుతున్నారు. ఇలా టీఆర్‌ఎస్‌లో నెలకొన్న అసమ్మతి, అసంతృప్త నేతలను అను నయించే బాధ్యతలను సీఎం కేసీఆర్‌ పూర్తిగా మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు.

కేటీఆర్‌ ప్రతి రోజూ పలు నియోజకవర్గాల వారీగా నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన వరంగల్‌ ఉమ్మడి జిల్లా నేతలు సత్యవతి రాథోడ్‌ (డోర్నకల్‌), మాలోతు కవిత (మహబూబాబాద్‌), తక్కళ్లపల్లి రవీందర్‌రావు (పాలకుర్తి)లను కేటీఆర్‌ తన క్యాంపు కార్యాలయానికి పిలిచి వేర్వేరుగా మాట్లాడారు. అవకాశాల విషయంలో అన్యాయం జరిగిందని ముగ్గురు నేతలు కేటీఆర్‌కు వివరించారు. నాలుగేళ్లుగా ప్రభుత్వపరంగా, పార్టీలో, నియోజకవర్గాల్లో తమ విషయంలో జరిగిన సంఘటనలను వివరించారు. గెలుపు అవకాశాలు ఉన్న వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని వాపోయారు.

అన్ని విషయాలను సావధానంగా ఆలకించిన మంత్రి కేటీఆర్‌.. ‘మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుంది. అందరికీ అవకాశాలు వస్తాయి. అనివార్య పరిస్థితుల్లోనే మీకు టికెట్‌ ఇవ్వలేకపోయాం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు అనే విధానంతో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్లలో మీకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదనే విషయం వాస్తవమే. మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై కేసీఆర్‌ గారితో మాట్లాడతా. రెండు రోజుల్లో మళ్లీ విషయం తెలియజేస్తా. అందుబాటులో ఉండండి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలి’ అని కోరారు.  

కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్మేలు..
చేవెళ్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలె యాదయ్య నియోజకవర్గంలోని అసంతృప్త నేతలను తీసుకుని వచ్చి కేటీఆర్‌ను కలిశారు. అందరూ కలిసి పని చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్‌ వారికి సూచించారు. మేడ్చల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా కేటీఆర్‌ను కలిశారు. మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. మేడ్చల్‌ అసెంబ్లీ స్థానానికి టీఆర్‌ఎస్‌ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. సత్తుపల్లి టికెట్‌ ఆశించి భంగపడిన మట్టా దయానంద్‌ సైతం కేటీఆర్‌ను కలిశారు.

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలి సి వచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లో టికెట్‌ ఇవ్వలేకపో యామని, భవిష్యత్‌లో అవకాశాలుంటాయని దయా నంద్‌కు కేటీఆర్‌ సూచించారు. అవకాశాల విషయం లో స్పష్టమైన హామీ లేకపోవడంతో దయానంద్‌ అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ రాకపోవడంతో స్థానికత నినాదంతో ఆయన సొంతంగా ప్రచారం చేస్తున్నా రు. దీన్ని కొనసాగిస్తారా? టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

మళ్లీ కలిసిన కడియం..
స్టేషన్‌ ఘన్‌పూర్‌లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకుని స్పష్టత ఇచ్చినా అక్కడి అసంతృప్తులు తొలిగే పరిస్థితి ఉండటం లేదు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి టి.రాజయ్యను మార్చడం కుదరదని కేటీఆర్‌ ఆ నియోజకవర్గ నేతలకు సోమవారం స్పష్టం చేశారు. అభ్యర్థిని మార్చకుంటే కుదరదని, తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని స్టేషన్‌ ఘన్‌పూర్‌ అసంతృప్త నేతలు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం సైతం కేటీఆర్‌ను కలిశారు. అనంతరం వరంగల్‌లోని అసంతృప్త నేతలు తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటనను కొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు