ఆరులో 63.48%

13 May, 2019 04:11 IST|Sakshi
ఢిల్లీలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు

59 స్థానాల్లో ముగిసిన ఆరో విడత పోలింగ్‌

ఓటేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

పశ్చిమ బెంగాల్లో అత్యధికం.. యూపీలో అత్యల్ప పోలింగ్‌

బెంగాల్‌లో తృణమూల్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ

న్యూఢిల్లీ: ఆరో విడత సార్వత్రిక ఎన్నికలు ఆదివారం ముగిశాయి. ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 63.48 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా సాగిందని వెల్లడించింది. పోలింగ్‌లో పశ్చిమబెంగాల్‌ మరోసారి అగ్రస్థానంలో నిలవగా, హరియాణా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బిహార్, యూపీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది.

తాజా పోలింగ్‌తో మొత్తం 543 స్థానాలకు గానూ 484 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయనీ, మిగతా 59 సీట్లకు మే 19న చివరి దశ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఢిల్లీలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఈసీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. 2014లో ఢిల్లీలో 65 శాతం పోలింగ్‌ నమోదుకాగా, ఈసారి అది 60 శాతానికి పడిపోయింది.

బీజేపీ నేత భారతిపై దాడి..
పశ్చిమబెంగాల్‌లోని 8 లోక్‌ సభ సీట్లకు పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఘటాల్‌ నియోజకవర్గంలోని కేశ్‌పూర్‌ ప్రాంతంలో పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్‌ అధికారిణి భారతీ ఘోష్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ)కి చెందిన మహిళా కార్యకర్తలు దాడిచేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన భారతి రిగ్గింగ్‌ జరుగుతోందన్న సమాచారంతో దొగాచియా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడ టీఎంసీ మద్దతుదారులు ఆమె కాన్వాయ్‌పై రాళ్లతో పాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలో భారతి భద్రతా సిబ్బంది ఒకరు గాయపడగా, కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా మనస్తాపానికి లోనైన ఆమె కన్నీరు పెట్టుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పశ్చిమ మిడ్నాపూర్‌ మెజిస్ట్రేట్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

యూపీలో బీజేపీ ఎమ్మెల్యే దౌర్జన్యం..
ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌పై బీజేపీ నేతలు దాడిచేశారు. ఔరాయ్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ప్రక్రియను నెమ్మదించేలా చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే దీననాథ్‌ భాస్కర్, ఆయన అనుచరులు ప్రిసైడింగ్‌ అధికారిని చితక్కొట్టారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ, మొత్తం వ్యవహారంపై నివేదిక సమర్పించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది.

మరోవైపు బిహార్‌లోని షియోహర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఓ హోంగార్డ్‌ పోలింగ్‌కు ముందు కాల్పులు జరపడంతో ఎన్నికల అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ సందర్భంగా ఈవీఎంలు మొరాయించగా, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మరోవైపు హరియాణాలోని రోహతక్‌లో బీజేపీ నేత మనీశ్‌ గ్రోవర్‌ పోలింగ్‌ కేంద్రాల్లోకి బలవంతంగా ప్రవేశించి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్‌ రోహతక్‌ అభ్యర్థి దీపేందర్‌ సింగ్‌ హుడా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను మనీశ్‌ ఖండించారు. హరియాణాలో ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదని ఎన్నికల సంఘం తెలిపింది.

ఈసీకి ఫిర్యాదు చేస్తాం: బీజేపీ
ఓడిపోతున్నామన్న ఆగ్రహంతోనే టీఎంసీ నేతలు భారతీ ఘోష్‌పై దాడిచేశారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాశ్‌ జవదేకర్‌ విమర్శించారు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు తమ నేత కదలికలపై నిషేధాజ్ఞలు విధించారని మండిపడ్డారు.

ఓటేసిన ప్రముఖులు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖులు ఢిల్లీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన భార్యతో కలిసి నిర్మాణ్‌ భవన్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఇక్కడే ఓటు వేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఔరంగజేబురోడ్డులోని పోలింగ్‌బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రాతో కలసి న్యూఢిల్లీ స్థానంలో ఓటేయగా, మాజీ సీఎం షీలా దీక్షిత్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ సందర్భంగా కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించగా, ఓట్లు గల్లంతయ్యాయని మరికొన్ని చోట్ల ఓటర్లు ఆందోళనకు దిగారు.


ఢిల్లీలో ఆదివారం ఓటేసిన అనంతరం వేలిపై సిరా గుర్తు చూపిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు


యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్


ప్రియాంక గాంధీ వాద్రా దంపతులు, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్


మాజీ సీఎం షీలా దీక్షిత్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

మరిన్ని వార్తలు