‘నాలుగో విడత’లో హింస

30 Apr, 2019 02:51 IST|Sakshi
ముంబైలో ఓటు వేసిన అమితాబ్, జయాబచ్చన్‌

8 రాష్ట్రాల్లో 64 శాతం పోలింగ్‌ నమోదు

పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ శ్రేణుల ఘర్షణ, ఒడిశాలో హత్య

ముంబైలో 51.11 శాతం పోలింగ్‌

న్యూఢిల్లీ/కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌ హింసాత్మకంగా ముగిసింది. 8 రాష్ట్రాల్లోని 71 లోక్‌సభ స్థానాలకు సోమవారం జరిగిన ఈ ఎన్నికల్లో 64 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. నాలుగో విడత పోలింగ్‌లో పశ్చిమ బెంగాల్‌ అగ్రస్థానంలో నిలవగా, రాజస్తాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, బిహార్‌ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బెంగాల్‌లోని ననూర్, రామ్‌పుర్హత్, నల్హటి, సురి ప్రాంతాల్లో పోలింగ్‌ సందర్భంగా అధికార తృణమూల్, విపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

దీంతో పలువురు గాయపడ్డారు. ఈ సందర్భరంగా 145 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌చేశారు. అసన్‌సోల్‌ లోక్‌సభ స్థానంలోని బర్బానీలో కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో కారును టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సుప్రియో సురక్షితంగా బయటపడ్డారు. అలాగే దుర్బాజ్‌పూర్‌ ప్రాంతంలో కొందరు దుండగులు సెల్‌ఫోన్లతో పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి తమపై దాడికి యత్నించడంతో కేంద్ర బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి.

మొరాయించిన ఈవీఎంలు..
మధ్యప్రదేశ్‌లో మాక్‌పోలింగ్‌ సందర్భంగా 207 ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎం) మొరాయించాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వీఎల్‌ కాంతారావు తెలిపారు. వీటిని వెంటనే మార్చామన్నారు. ఆ తర్వాత పోలింగ్‌ సందర్భంగా ఇబ్బందులు తలెత్తడంతో మరో 107 ఈవీఎంలను సమకూర్చామని వెల్లడించారు. ఇక రాజస్తాన్‌లోని బన్స్‌వారాలో అత్యధికంగా 72.34 శాతం పోలింగ్‌ నమోదుకాగా, బర్మర్‌లో 72.21 శాతం నమోదైనట్లు అక్కడి ఎన్నికల అధికారులు చెప్పారు. భారత ఆర్థిక రాజధాని ముంబైలోని ఆరు నియోజకవర్గాల్లో 51.11 శాతం పోలింగ్‌ నమోదయింది. కశ్మీర్‌లోని అనంతనాగ్‌ నియోజవకర్గంలో రెండో విడత ఎన్నికల్లో 10.5 శాతం పోలింగ్‌ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.  

ఒడిశాలో కాంగ్రెస్‌ కార్యకర్త హత్య..
ఒడిశాలోని బలికుడా–ఎరసమా పోలింగ్‌ కేంద్రం నుంచి తిరిగివెళ్తున్న కాంగ్రెస్‌ కార్యకర్త లక్ష్మణ్‌ బెహరాపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడిచేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. జాజ్‌పూర్‌–కేంద్రపరా, బాలాసోర్‌ లోక్‌సభ స్థానాల్లో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ బీజేడీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మరోవైపు తన భార్య డింపుల్‌ యాదవ్‌ పోటీచేస్తున్న కన్నౌజ్‌లో ఈవీఎంల్లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు.

యూపీలోని జమ్‌కారా పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల అధికారి తనకు బదులుగా ఈవీఎం బటన్‌ నొక్కేశాడని ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేయడంతో సదరు అధికారిని విధుల నుంచి తప్పించి పోలీసులకు అప్పగించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత బబూల్‌ సుప్రియోపై సోమవారం కేసు నమోదయింది. పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న సుప్రియో బర్బానీలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ బూత్‌లోకి దూసుకెళ్లారు. అనంతరం అక్కడి ఎన్నికల అధికారితో పాటు ప్రత్యర్థి పార్టీ ఏజెంట్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు సుప్రియోపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. అయితే ప్రజలను ఓటేయకుండా అడ్డుకున్నట్లు సమాచారం రావడంతోనే తాను బర్బానీకి వచ్చానని సుప్రియో వివరణ ఇచ్చారు.


ఆమిర్‌ ఖాన్‌ దంపతులు, సల్మాన్‌ ఖాన్‌, ఊర్మిళ


ప్రియాదత్‌, సంజయ్‌ దత్‌, కంగనా రనౌత్‌


దీపికా పదుకొణె, మాధురీ దీక్షిత్‌, అభిషేక్, ఐశ్వర్య

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు