కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌

6 Mar, 2020 06:15 IST|Sakshi

స్పీకర్‌ టేబుల్‌పైనున్న కాగితాలను లాగేసి, ఆ స్థానాన్ని అవమానించారన్న ప్రభుత్వం

న్యూఢిల్లీ: బడ్జెట్‌ మలి దశ సమావేశాలు ముగిసేవరకు ఏడుగురు కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేస్తూ లోక్‌సభలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ టేబుల్‌ పై నుంచి కాగితాలను లాగేసి, విసిరేసిన అనుచిత చర్యకు పాల్పడినందుకు గానూ కాంగ్రెస్‌ సభ్యులైన గౌరవ్‌ గొగొయి, టీఎన్‌ ప్రతాపన్, దీన్‌ కురియకోస్, మనీకా ఠాగోర్, రాజ్‌మోహన్‌ ఉన్నిథన్, బెన్నీ బెహనన్, గుర్జీత్‌సింగ్‌ ఔజ్లాలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఒక తీర్మానాన్ని గురువారం లోక్‌సభ  ఆమోదించింది.

ఈ దుష్ప్రవర్తన సహించం
పలు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ  సమావేశమైంది. అనంతరం ఏడుగురు కాంగ్రెస్‌ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ స్థానంలో ఉన్న మీనాక్షి లేఖి ప్రకటించారు. ‘ఖనిజ చట్టాలు(సవరణ) బిల్లు, 2020’ పై సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఈ సభ్యులు స్పీకర్‌ పోడియం నుంచి సంబంధిత కాగితాలను లాగేసి, విసిరేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని ఆమె పేర్కొన్నారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఆ తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఆ తరువాత,  సభ  శుక్రవారానికి వాయిదా వేశారు.  

ఎంపీని సస్పెండ్‌ చేయాలంటూ లోక్‌సభలో.: రాజస్తాన్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ ఎంపీ హనుమాన్‌ బెణివాల్‌  కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాపై  అనుచిత వ్యాఖ్యాలు చేశారని, ఆయనను సస్పెండ్‌ చేయాలంటూ కాంగ్రెస్‌ సభ్యులు చేసిన ఆందోళనలతో సభ మూడు సార్లు వాయిదా పడింది. నాలుగో సారి సమావేశమైన తరువాత ..ఢిల్లీ అల్లర్ల అంశాన్ని కూడా లేవనెత్తుతూ.. వెల్‌లోకి వచ్చి ‘సస్పెండ్‌ ఎంపీ.. మోదీ సర్కార్‌ షేమ్‌ షేమ్‌’ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియంపై ఉన్న కాగితాలను గౌరవ్‌ గొగొయి తీసుకుని చించి, గాల్లోకి విసిరేయడం కనిపించింది. దాంతో, సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేస్తూ స్పీకర్‌ స్థానంలో ఉన్న రమాదేవి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, మూడు రౌండ్ల బుల్లెట్లతో పార్లమెంటు కాంప్లెక్సులో ప్రవేశించబోయిన ఘజియాబాద్‌కు చెందిన అక్తర్‌ ఖాన్‌ (44)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి లైసెన్సు కలిగిన ఆయుధం ఉండటంతో అనంతరం విడిచిపెట్టారు.  జేబులో నుంచి బుల్లెట్లను తీయడం మరిచిపోయినట్లు అతడు తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు