‘మహాకూటమికి 80+సీట్లు’

13 Oct, 2018 02:35 IST|Sakshi

మీడియా చిట్‌చాట్‌లో ఉత్తమ్‌ ధీమా

డిసెంబర్‌ 12 తర్వాత ఆరు నూరైనా కాంగ్రెస్‌దే అధికారం

టీఆర్‌ఎస్‌ 20 స్థానాలకే పరిమితమవుతుందని జోస్యం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి 80కిపైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాము ఇటీవల నిర్వహించిన సర్వేల్లో కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందన్న విషయం వెల్లడైందన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ 20 స్థానాలకు మించి గెలిచే అవకాశాలు లేవని పేర్కొన్నారు. రోజురోజుకూ టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతోందని, ముందస్తుకు వెళ్లడంతోనే ఆ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు.

శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. డిసెంబర్‌ 12 తర్వాత ఆరునూరైనా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే జోస్యం చెప్పారు. టీఆరెస్‌ నేతలు ఆశల పల్లకిలో తేలుతున్నారని, కానీ వారికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. తెలంగాణలో ఇటీవల పర్యటించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా టూర్‌ను డ్రామాగా అభివర్ణించారు. అమిత్‌ షా, కేసీఆర్‌ కలసి ప్రజలను మోసం చేసేందుకు డ్రామాలు చేస్తున్నారన్నారు.

బీజేపీపై ప్రేమ లేకుంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు బీజేపీకి అనుకూలంగా ఓటెందుకేశారని ఉత్తమ్‌ ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ రహస్య పొత్తును ప్రజలు అర్థం చేసుకున్నారని, వారికి ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి చాలా మంది ముఖ్య నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, వారంతా టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అతిత్వరలో కీలక నేతల చేరికలు ఉంటాయన్నారు.

సోనియాతో 3, రాహుల్‌తో 9 సభలు...
పార్టీ విధానాలు, మేనిఫెస్టో అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో 12 సభలు నిర్వహించనున్నట్లు ఉత్తమ్‌ తెలిపారు. సోనియా 3 సభల్లో, రాహుల్‌ 9 సభల్లో పాల్గొంటారని తెలిపారు. పది నియోజకవర్గాలను కలుపుకుంటూ ఓ బహిరంగ సభ ఉండేలా ప్రణాళిక రచిస్తున్నామన్నారు.

సెటిలర్స్‌ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారానికి ప్రణాళికలు ఉన్నాయన్నారు. టికెట్‌ల అంశం ఖరారు కాలేదని, ఆశావహులు అపోహలకు పోవద్దని ఉత్తమ్‌ సూచించారు. గెలుపు అవకాశాలు, సామాజిక న్యాయం ఆధారంగా టికెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఒక్క కుటుంబానికి ఒకే టికెట్‌ అంశం హైకమాండ్‌ పరిశీలనలో ఉందని, దీనిపై తమ అభిప్రాయాలను హైకమాండ్‌కు తెలియజేస్తామన్నారు.

ఉమ్మడిగానే ప్రచారం...
మహాకూటమి చర్చలు మంచి వాతావరణంలో జరుగుతున్నాయని ఉత్తమ్‌ తెలిపారు. టీజేఎస్‌ అధినేత కోదండరాంతో టికెట్ల పంపకం, మేనిఫెస్టో అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నామన్నారు. మహాకూటమి ఉమ్మడి మేని ఫెస్టో ముసాయిదా సిద్ధమైందని, త్వరలోనే దీన్ని ప్రజల ముందుకు తెస్తామన్నారు. 2 రోజు ల్లో సీట్ల పంపకంపై స్పష్టత వస్తుందన్నారు. మహాకూటమి పేరు మారుతుందని తెలిపిన ఉత్తమ్‌... కూటమి అభ్యర్థుల విజయం కోసం ఉమ్మడిగా ప్రచారం చేస్తామని వివరించారు. 

మరిన్ని వార్తలు