84.75 శాతం పోలింగ్‌

22 Oct, 2019 04:18 IST|Sakshi
మఠంపల్లిలో ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళా ఓటర్లు 

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రశాంతం

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 84.45 శాతం పోలింగ్‌ నమోదైంది. నియోజకవర్గంలో 2,36,842 ఓట్లు ఉండగా.. 2,00,726 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషుల ఓట్లు 99,023, మహిళల ఓట్లు 1,01,703 ఉన్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 81.18%, 2018 ఎన్నికల్లో 86.38% పోలింగ్‌ నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 11న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 78.85% పోలింగ్‌ నమోదైంది.

50 శాతం పైగా నమోదు.. 
ఉప ఎన్నిక జరిగిన సోమవారం ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం, 11 గంటల వరకు 31.34 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 52.89 శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకు 69.95 శాతం, సాయంత్రం పోలింగ్‌ ముగిసే సమయానికి 84.75 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నానికే 50 శాతం పైగా పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్‌ కేంద్రం లోపలికి వచి్చన వారంతా ఓటేశారు. గరిడేపల్లి మండలం కల్మల చెరువలో రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. హుజూర్‌నగర్‌ అంబేడ్కర్‌నగర్‌ పోలింగ్‌ కేంద్రంలో, మేళ్లచెరువు మండలం కప్పలకుంట తండా, గరిడేపల్లి మండలం వెల్దండలో సాయంత్రం 6 గంటల వరకు ఓటేశారు.

గరిడేపల్లి మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలోని 252 పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో 40 నిమిషాల పాటు పోలింగ్‌ నిలిచింది. ఆ తర్వాత సాంకేతిక నిపుణులు దాన్ని సరిచేయడంతో మళ్లీ యథావిధిగా ఓట్లు వేశారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు జీకే.గొక్లానీ, సచింద్రప్రతాప్‌సింగ్, కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్, ఎస్పీ ఆర్‌.భాస్కరన్, జేసీ సంజీవరెడ్డిలు పరిశీలించారు. నియోజకవర్గంలోని 79 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదు. కృష్ణపట్టె ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ భాస్కరన్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు ప్రత్యేకంగా పరిశీలించారు.

ఓటేసిన అభ్యర్థులు.. 
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి.. మఠంపల్లి మండలం గుండ్లపల్లి, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి హుజూర్‌నగర్‌లోని ఎన్‌ఎస్పీ క్యాంపు పాఠశాలలో, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి మేడి రమణ హుజూర్‌నగర్‌ మండలంలోని లింగగిరి గ్రామంలో, తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థి దేశగాని సాంబశివగౌడ్‌ హుజూర్‌నగర్‌ మండ లం బూరుగడ్డలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటే శారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి ఓటు నియోజకవర్గంలో లేకపోవడంతో ఆమె ఓటేయలేదు.

24న ఓట్ల లెక్కింపు.. 
ఈ నెల 24న సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 14 టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుజూర్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌ గోదాం నుంచి ఈవీఎంలను సూర్యాపేట మార్కెట్‌ గోదాంలోకి చేర్చి స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచారు.

మెజారిటీతో గెలుస్తున్నాం: కేటీఆర్‌ 
సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ గౌరవప్రదమైన మెజారిటీతో వి జయం సాధిస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పోలింగ్‌ ముగిసిన తర్వాత సామాజిక మాధ్యమం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించారు.

మరిన్ని వార్తలు