85వ రోజు పాదయాత్ర డైరీ

13 Feb, 2018 03:10 IST|Sakshi

12–02–2018, సోమవారం
పెద్దకొండూరు శివారు, 
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

ఎవరినైనా మోసం చేయగల నైపుణ్యం బాబుగారికే సాధ్యమేమో! 
ఈ రోజు కోదండాపురం వద్ద వేములపాడుకు చెందిన అనేక పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు తమ ఆవేదనను, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. చంద్రబాబు తమకు చేసిన మోసాన్ని ఆ సంఘాలకు చెందిన లీడర్లు, సభ్యులు ఎండగట్టారు. బాబుగారి రుణమాఫీ మోసంతో తామంతా డిఫాల్టర్లుగా మారిన వైనాన్ని వివరించారు. మాఫీ అవుతుంది కదా అని బ్యాంకులకు కిస్తీలు కట్టకపోవడం వల్ల వడ్డీల మీద వడ్డీలు, అపరాధ వడ్డీలు పెరిగి.. ఇప్పుడా అప్పు కట్టుకోలేనంతగా పెరిగిపోయిందన్నారు. ఆ అప్పు కట్టకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రైవేటు బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు అప్పుల వసూళ్లకు రికవరీ ఏజెంట్లను పెట్టుకున్నట్లు.. ఈ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలపైకి గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్‌) ఉద్యోగులను ఉసిగొల్పుతోందట. ఆ ఉద్యోగులకు ఇచ్చిన టార్గెట్ల ప్రకారం వసూళ్లు చేయకపోతే.. వారి ఉద్యోగాలు గల్లంతయ్యే పరిస్థితట. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు సిగ్గుపడాల్సిందిపోయి, బాధితులను బెదిరిస్తుంటే.. ఈ పాలన తీరును ఏమనాలో అర్థంకావడంలేదు. 

‘సేవ్‌ ఆయుష్‌’ అంటూ నినాదాలిచ్చి.. బాబు చేసిన నమ్మక ద్రోహాన్ని నిరసిస్తూ.. తమను కాపాడాలని నా వద్దకొచ్చారు ఆయుష్‌ విభాగంలో పనిచేసే పారామెడికల్‌ సిబ్బంది. వారి రాష్ట్ర సంఘం నేతలు వారికి జరిగిన మోసాన్ని వివరించారు. ‘సార్‌.. 2012లో మా జీతాలు పెంచాలని, మమ్మల్ని రెగ్యులరైజ్‌ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి చంద్రబాబుగారు లేఖ రాశారు. మా కోర్కెలు న్యాయమైనవని, వాటిని వెంటనే తీర్చాలని డిమాండ్‌ చేశారు. మా పోరాటానికి పూర్తి మద్దతిస్తున్నానని ప్రకటించారు. ఆయన అధికారంలోకి వచ్చాక మా కోర్కెలు తీరుస్తారని ఆశించాం. కానీ మా ఉద్యోగాలకే ఎసరు పెడతారని ఊహించలేదు. అంతకు మునుపే నయం.. జీతం తక్కువయినా, కనీసం ఉద్యోగం ఉండేది. ఈయనగారు వచ్చాక మా సేవలు అవసరం లేదంటూ, మమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించి, మా బతుకులను బజారుపాల్జేశాడు. ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది మా పరిస్థితి’ అంటూ ఆవేదన చెందారు. ఎవ్వరినైనా వంచించి, మోసం చేయగల నైపుణ్యం బాబుగారికే సాధ్యమేమో. 

‘చెడిపోయిన వ్యవస్థపై సమరభేరీ మోగించిన మీతో కలిసి అడుగేయాలని ఉందన్నా’ అన్న సాయిదీప్తి భావోద్వేగం నాలోనూ ఆవేశాన్ని పెంచింది. ఇంటర్‌ పూర్తయి బీటెక్‌లోకి అడుగుపెట్టిన ఆ చిన్నారి.. ఓటు హక్కు నమోదు కోసం వెళుతోందట. చేతిలో ఓటరు నమోదు ఫారం, మాటల్లో చైతన్యం, మార్పు కోసం పడుతున్న తపన ఆ చిట్టి చెల్లెమ్మలో కనిపించాయి. ఆమె నోటి వెంట వచ్చిన మాటలు కట్టిపడేశాయి. ‘నాకూ ఓటు వస్తుందన్నా.. నా మొట్టమొదటి ఓటు మీకే వేస్తాను’ అంటూ గర్వంగా చెప్పింది. ‘నా చేతికొచ్చే ఓటు అనే ఆయుధాన్ని మీ అమ్ముల పొదికి చేరుస్తా’ అంటూ తన ఆకాంక్షను వెలిబుచ్చింది. ‘మీరొస్తే మార్పు వస్తుందన్నా.. పేదల బతుకుల్లో వెలుగులు వస్తాయన్నా.. యువత నైరాశ్యం వీడుతుందన్నా..’ అంటూ నాపై పెంచుకున్న నమ్మకాన్ని ఆ చిన్నారి వ్యక్తంచేసింది. ఆ చిట్టి తల్లి మనసు తెలిశాక.. వెల్లువెత్తే యువ చైతన్యానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్ష మరింత పెరిగింది. వాళ్ల నమ్మకాన్ని నిజం చేయాలన్న నా సంకల్పం రెట్టింపు అయింది.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలంటూ గతంలో అప్పటి ముఖ్యమంత్రికి మీరు లేఖ రాయడం వాస్తవం కాదా? సదరు ఉద్యోగుల ఆందోళనలో పాల్గొని, వారికి మద్దతునీయడం నిజం కాదా? మీ మేనిఫెస్టోలో వారి గురించి హామీ లిచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటి ని నెరవేర్చకపోగా.. ఉన్న ఉద్యోగాల ను సైతం పీకేయడం న్యాయమేనా? ఇది నమ్మక ద్రోహం కాదా?
-వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు