-

87వ రోజు పాదయాత్ర డైరీ

15 Feb, 2018 01:44 IST|Sakshi

14–02–2018, బుధవారం
జంగాలపల్లి,
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

అందుకే నవరత్నాల్లో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చా..
నీతి, నిజాయితీ, నిబద్ధతలతో రాజకీయ జీవితాన్ని నడిపిన దళిత నేత, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యగారి జయంతి సందర్భంగా.. ఆయనకు నివాళులర్పించి, ఈ రోజు పాదయాత్ర మొదలెట్టాను. ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించేందుకు నాన్నగారు మొదలుపెట్టి, దాదాపు పూర్తిచేసిన ఉత్తర కాలువను దాటి కృష్ణారెడ్డిపాళెంలోకి ప్రవేశించాను. కాళ్లు, చేతులు వంకర్లు పోయి, నడుం వంగిపోయిన ఒక వృద్ధురాలిని మోసుకుంటూ ఒకాయన నా దగ్గరికొచ్చాడు. ఆమెకు పళ్లు కూడా విరిగిపోయినట్లున్నాయి. ఏంటయ్యా.. అని అడిగాను. ‘ఇదంతా మా ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్‌ తెచ్చిపెట్టిన కష్టం సార్‌.. ఈమె నా భార్య. ఈమెకే కాదు, ఈమె కడుపుతో ఉన్నప్పుడు లోపల బిడ్డపై కూడా దాని ప్రభావం పడింది.

ఆ బిడ్డా ఇప్పుడు వికలాంగుడే’ అంటూ బాధగా చెప్పాడు. ఆమె పేరు అంకమ్మట. వయసు 35 సంవత్సరాలని చెప్పగానే ఆశ్చర్యపోయాను. ఇంత చిన్న వయసుకే ముసలితనాన్నిచ్చింది ఫ్లోరైడ్‌ దుష్ఫ్రభావమేనని అవగతమైంది. ఫ్లోరైడ్‌ దెబ్బకు తన రెండు కిడ్నీలూ పాడైపోయాయని ఆ గ్రామానికే చెందిన మస్తానన్న చెప్పాడు. ఆ ఊళ్లోనే పది మందికి పైగా కిడ్నీ బాధితులున్నారట. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సైతం ఫ్లోరైడ్‌ వల్ల కిడ్నీలు పాడైనవాళ్లు, వికలాంగులు, చిన్న వయసులోనే వృద్ధాప్యఛా యలు కమ్ముకున్నవారు ఎందరో ఉన్నారట. ఒక్కసారిగా మనసెంతో బరువెక్కింది. వీరేం తప్పు చేశారు? ఎందుకు వీళ్లకీ శిక్ష? ముమ్మాటికీ ఈ పాపం ఫ్లోరైడ్‌ది కాదు.. తీర్చగలిగే అవకాశం ఉండీ, నిర్లక్ష్యం వహిస్తూ.. మొద్దు నిద్ర నటిస్తున్న నేటి దుర్మార్గపు పాలకులది. పక్కనే ఉత్తర కాలువ పోతున్నా తాగునీరు అందించని ఈ తోలుమందం ప్రభుత్వానిది.

ఆ ఊరు దాటి ముందుకెళ్లగానే కుడుములదిన్నెపాడు వద్ద రోడ్డు పక్కనే ఓ చలివేంద్రం కనిపించింది. ఆ పక్కనే ఉన్న దంపతులిద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటూ నా వద్దకొచ్చారు. ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న వారి పెద్ద కుమారుడు అంకమ్మరావు జ్ఞాపకార్ధం ఆ చలివేంద్రం పెట్టారట. ‘అంత పెద్ద కష్టం ఎందుకొచ్చింది తల్లీ’ అని అడగ్గానే.. ‘కూలీ నాలీ చేసుకుంటూ జీవితాన్ని నెట్టే బతుకులయ్యా మావి. మాలా మా బిడ్డలు కష్టపడకూడదని వారిని బాగా చదివిం చాలనుకున్నాం. మా పెద్దోడు ఇంజినీరింగ్‌లో సీటు తెచ్చుకున్నాడు. కానీ ఫీజు రూ.70 వేలట. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.35 వేలే వచ్చాయి. అమ్మా.. మిగతా డబ్బు కట్టగలరా? అని అడిగేవాడు. మీకు చాలా కష్టమైపోతోందమ్మా.. అంటూ కుమిలిపోయేవాడు. నిరుడు వినాయక చవితి రోజు మా కష్టం గురించి మరింత ఎక్కువగా ఆలోచించాడేమో. నాన్నా.. నన్ను చదివించడానికి మీరు పడుతున్న కష్టాన్ని చూడలేకపోతున్నా.. పేదవాళ్లుగా పుట్టడమే మనం చేసుకున్న పాపమేమో.. అని ఉత్తరం రాసి, ఉరేసుకుని చనిపోయాడు’ అంటూ ఆ దంపతులు గుండె చిక్కబట్టుకుని కడుపు కోతను చెప్పుకొన్నారు. చాలా బాధేసింది.

ఆ పేదింట చదువుల సౌరభాలు వెదజల్లి, పేదరికాన్ని పారదోలాల్సిన ఆ విద్యా కుసుమం మధ్యలోనే రాలిపోవడం నా మనసును కలచివేసింది. పేదవాళ్లు పెద్ద చదువులు చదువుకోవాలను కోవడమే శాపమైతే.. మరి ఆ పాపం ఎవరిది? వారికి ఆ ఆశపెట్టి మోసపుచ్చిన పాలకులది కాదా? పేదరికం అన్నది చదువుకు ఏ మాత్రం అడ్డుకాకూడదని నాన్నగారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టి.. ఫీజులను సంపూర్ణంగా, సకాలంలో చెల్లించేవారు. కానీ, నేటి ప్రభుత్వం అరకొర ఫీజులు చెల్లిస్తూ.. ఆ కాస్త కూడా నెలల తరబడి పెండింగ్‌ పెడుతూ, లబ్ధిదారులైన విద్యార్థుల సంఖ్యను తగ్గిస్తూ, ఆ పథకాన్ని నీరుగార్చి.. గాలిలో దీపంలా తయారు చేసింది. పేద బిడ్డల జీవితాల్లో చీకటి తెరలు కమ్ముకునేలా చేస్తోంది. అంకమ్మరావులాంటి పేద విద్యా ర్థుల ఉసురు తీస్తోంది. ఏ పేదవాడికీ ఈ పరిస్థితి రాకూడదు. అందుకే నవరత్నాల్లో అటు వైద్యానికి, ఇటు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాను. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన తొలి ఐదు సంతకాలలో ఒకటి.. ప్రతి గ్రామానికీ రక్షిత మంచినీటి సరఫరా. నాలుగేళ్లయిపోయాయి. ఆ పథకం ఏమైంది? మినరల్‌ వాటర్‌ సంగతి దేవుడెరుగు.. కనీసం తాగడానికి సర్ఫేస్‌ వాటరైనా ఇచ్చుంటే.. ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకైనా కొంత మేర ఉపశమనం కలిగేది కదా? మీ తొలి సంతకానికే దిక్కులేకపోతే.. మీరిచ్చిన వందలాది హామీల మాటేంటి? 
-వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు