భూరికార్డుల ప్రక్షాళనపై విపక్షాల విషం: కర్నె

26 Sep, 2017 02:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎనభై ఏళ్ల కిందటి రెవెన్యూ రికార్డులను సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే విపక్షాలు విషం గక్కుతున్నాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు. భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమై పది రోజులే అవుతుందని, ఇంతలోనే అనేక అక్రమాలు బయటపడ్డాయన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రికార్డుల్లో భూములు లేకున్నా 9వేల ఎకరాలకు సంబంధించి బ్యాంకుల నుంచి అక్రమంగా రుణాలు తీసుకున్నట్లు బయటపడిందన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ పూర్తిగా నిర్వీర్యమయ్యిందని ఆరోపించారు. 42 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన అక్రమాలకు కోదండరాం వత్తాసు పలకడం దుర్మార్గమని.. ఆయన కాంగ్రెస్‌ అనుబంధ నాయకుడిగా మారారని విమర్శించారు. రికార్డుల ప్రక్షాళనకు ఇంకా 80 రోజుల గడువుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ భూదందాలు ఇంకెన్ని బయట పడుతాయో చూడాలన్నారు. న్యాయమైన రైతులకే ఎకరాకు రూ.8వేల పెట్టుబడి దక్కాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు. ఇకనైనా విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకించడం మానితే మంచిదని కర్నె హితవు పలికారు.

>
మరిన్ని వార్తలు