మైలవరం వివాదంలో ఎస్‌ఐలే దోషులు..

11 Feb, 2019 20:24 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అధికారం ఉంది కదా.. మనకు అడ్డెవరు అనుకున్న టీడీపీ నేతలు బొక్కబోర్లాపడ్డారు. స్థానిక పోలీసులతో చేతులు కలిపి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బుందులకు గురిచేయాలనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. కొద్ది రోజుల క్రితం మైలవరంలో రాజుకున్న రాజకీయ వివాదాన్ని జిల్లా ఎస్పీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ముగింపు పలికారు. ఎన్నికల్లో తమకు సహకరించాలంటూ నియోజకవర్గంలోని పోలీసులకు వైఎస్సార్‌ సీపీ నేతలు డబ్బులు ఇవ్వజూపారనే ఆరోపణ అవాస్తమని పోలీసు ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ఎస్‌ఐలకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని, అవన్నీ అసత్య ఆరోపణలని స్పష్టం చేశారు. దీంతో వైఎస్సార్‌ సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసిన జి.కొండూరు ఎస్‌ఐ అస్ఫక్‌, మైలవరం ఎస్‌ఐ శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ వీఆర్‌లోకి పంపించారు.  

అసలేం జరిగిందంటే..
తమకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ వైఎస్సార్‌ సీపీ నాయకులపై స్థానిక పోలీసులు తప్పుడు కేసులు బనాయించారు. తమపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసనకు దిగారు.  మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిడితో పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. మైలవరం సీఐ, ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు సన్నాహాలు చేపట్టాయి. దీనికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు కూడా ధర్నా చేయాలంటూ మంత్రి దేవినేని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ ధర్నాను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో దీనిపై పోలీసులు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు